సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిల్ చేశారు : కొండా సురేఖ
Publish Date:Sep 3, 2026
Advertisement
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్‌మెయిల్ చేశాడు..! తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అంతర్గత కలకలం రేగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ మధ్య విభేదాలు చిలికి చిలికి గాలివానలా మారి చివరకు అధిష్ఠానం వద్దకు చేరాయి. పార్టీ హైకమాండ్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చి, బ్లాక్‌మెయిల్ రాజకీయం చేస్తూ తనను కేబినెట్ నుంచి తప్పించేందుకు కుట్ర పన్నుతున్నారని కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేశారు. వరంగల్ వేదికగా కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక నేతలపై చేసిన వ్యాఖ్యలు ఈ విమర్శల తుఫానుకు మూలకారణంగా నిలిచాయి. దీనిపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వివరణ కోరగా, తన కుమార్తె ఒక స్వతంత్ర వ్యక్తి అని, ఆమె మాట్లాడిన వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదని సురేఖ స్పష్టం చేశారు. అయితే, పార్టీ నేతల ఒత్తిడి పెరగడంతో అధిష్ఠానం పిలుపు మేరకు ఆమె ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. ఢిల్లీ పర్యటనలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌లతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తనపై ఏ విధమైన అవినీతి మరకలు లేవని, మంత్రిగా తన పనితీరు మెరుగ్గా ఉందని విన్నవించారు. తనపై చర్యలు తీసుకునే ముందు, మంత్రివర్గంలోని ఇతర నేతలపై వస్తున్న ఆరోపణలు, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించినట్లు సమాచారం. ఒక బీసీ మహిళా నేతనైనందుకే తనను కావాలని లక్ష్యంగా చేసుకుంటున్నారని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో అందరికీ ఒకే రకమైన నిబంధనలు వర్తింపజేయాలని, కొందరు మంత్రులపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినా పట్టించుకోకుండా డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించినట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అధిష్ఠానం ఒత్తిడి తెచ్చినా తాను మంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని, ఒకవేళ సీఎం తెస్తున్న ఒత్తిళ్లకు తలొగ్గి బర్తరఫ్ చేయాలనుకుంటే చేసుకోమని సురేఖ బహిరంగంగానే సవాల్ విసిరారు. తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం ముమ్మాటికీ సరికాదని, కావాలని కొంతమంది నేతలతో ప్రెస్ మీట్లు పెట్టించి తనపై లీకులు ఇప్పిస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీ వేదికగా చోటుచేసుకున్న ఈ సంచలన పరిణామాలతో తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సీనియర్ మంత్రికి మధ్య నెలకొన్న ఈ పోరును అధిష్ఠానం ఏ విధంగా సర్దుబాటు చేస్తుందోనని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. వరంగల్ ప్రాంతంలో బలమైన వర్గపోరుగా మారిన ఈ వ్యవహారంలో అధిష్ఠానం కఠిన చర్యలకు దిగుతుందా లేక నష్టనివారణ చర్యలు చేపడుతుందా అనేది రాబోయే రెండు రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది. (Konda Surekha Bartaraf, CM Revanth Reddy, Telangana Cabinet, Telangana Politics, Revanths Sensational Decision, Nerella Sarada, gundu sudharani, Telangana One, Telugu news)
http://www.teluguone.com/news/content/(konda-surekha-bartaraf-24-230615.html





