డబ్బుల భోజనం.. కల్యాణ మండపాల లీజు! వివాదాలకు కేరాఫ్ గా టీటీడీ బోర్డు 

తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం. దేశంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటి శ్రీ వెంకటేశ్వరుని నిలయం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు తిరుమలను అతి పవిత్రంగా భావిస్తుంటారు. అయితే తిరుమల ఆలయ వ్యవహారాలు చూసే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాత్రం వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ ఆలయానికి మచ్చ తెస్తోంది.  వైసీపీ ప్రభుత్వం వచ్చాకా గత రెండేండ్లుగా టీటీడీ పనితీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అన్యమత ప్రచారం మొదలుకుని ఆలయ ప్రసాదాల వరకు అన్నింటా విమర్శలే ఎదుర్కొంది టీటీడీ బోర్డు. శ్రీవారి సన్నిధిలో వెలుగుచూస్తున్న ఘటనలపై భక్తులు ఆవేదన చెందుతున్నా టీటీడీ తీరు మాత్రం మారడం లేదు. ఇటీవలే టీటీడీ ప్రవేశపెట్టిన సంపద్రాయ భోజనంపై విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది. తాజాగా శ్రీవారి కల్యాణ మండపాల లీజు విషయంలో టీటీడీ తీసుకున్న నిర్ణయం దుమారం రేపుతోంది.

తెలుగు రాష్ట్రాలలోని 177 కల్యాణ మండపాలను లీజుకు ఇచ్చేందుకు టీటీడీ సిద్దమైంది. దేశవ్యాప్తంగా 299 కల్యాణ మండపాలను టీటీడీ నిర్మించింది. గతంలో కల్యాణ మండపాల పరిస్థితులపై విజిలెన్స్ ఆధ్వర్యంలో టీటీడీ ఓ కమిటీని నియమించింది. విజిలెన్స్ నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. చాలా చోట్ల కల్యాణ మండపాలు నిర్వహణ అధ్వానంగా ఉన్నట్లు నివేదిక అందింది. కొన్ని ప్రాంతాల్లో కల్యాణ మండపాలో గేదలను మేపుతున్నట్లు ఫోటోలోతో విజిలెన్స్ సమాచారం ఇచ్చింది. విజిలెన్స్ నివేదిక మేరకు ఇకపై కల్యాణ మండపాలను నిర్మించకూడదని పుట్టా సుధాకర్ యాదవ్ నేతృత్వంలోని గత పాలకమండలి నిర్ణయం తీసుకుంది. 

అయితే  వైసీపీ ప్రభుత్వం వచ్చాక  తిరిగి కల్యాణ మండపాల నిర్మాణానికివైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలకమండలి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 5 సంవత్సరాల కాలపరిమితితో కల్యాణ మండపాలు లీజుకు ఇచ్చేందుకు టీటీడీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక వైపు నూతన కల్యాణ మండపాలను నిర్మిస్తూ…. మరో వైపు నిర్మించిన కల్యాణ మండపాలను లీజుకు ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. కల్యాణ మండపాల నిర్మాణంపై నిర్దిష్టమైన విధానం తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు.

ఇటీవల సంప్రదాయ భోజనం పథకాన్ని ప్రవేశపెట్టింది టీటీడీ. అయితే విమర్శలు వెల్లువెత్తడంతో టీటీడీ వెనక్కి తగ్గింది.  డబ్బులు తీసుకుని భోజనం పెట్టాలనే నిర్ణయంపై పెద్ద యెత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఆ పథకాన్ని ప్రవేశపెట్టకూడదని నిర్ణయం తీసుకుంది. సంప్రదాయ భోజనాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. అన్న ప్రసాదానికి డబ్బులు తీసుకోకూడదని వైవీ సుబ్బా రెడ్డి అన్నారు. స్వామివారి ప్రసాదంగానే భోజనం అందించాలని ఆయన అన్నారు. పాలకమండలి లేని సమయంలో అధికారులు ఆ నిర్ణయం తీసుకున్నారని  చెప్పారు. తిరుమలలో నిత్య అన్నదాన్నం నిరంతరాయంగా కొనసాగుతుందని, దీంతోపాటు టీటీడీ పరిధిలో వేలం ద్వారా అనేక క్యాంటీన్ లు నడుపుతున్నారని, వాటిలో 10 బిగ్ క్యాంటీన్లు,7 జనతా క్యాంటీన్లు, 148  ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, 128 టి స్టాల్స్ నిర్వహిస్తున్నారు. వీటికిప్రతినెలా లైసెన్స్ ఫీజ్ కడుతుంటారని చెప్పింది.