భార్యలు తాగేస్తున్నారంటూ.. మొగుళ్ల గగ్గోలు
posted on Mar 13, 2025 12:50PM

ఇంట్లో మగాళ్లు తాగుతుంటే మహిళలు గగ్గోలు పెడుతుండటం చూస్తూనే ఉంటాం. మందుబాబుల వీరంగాలతో గృహహింస కేసులు కామన్‌గా మారిపోతున్నాయి. అయితే అక్కడ మాత్రం సీన్ పూర్తిగా రివర్స్‌లో కనిపిస్తున్నది. ఆ గ్రామంలో మహిళలు మద్యానికి బానిసలు కావడంతో కుటుంబాలు నాశనమవుతున్నాయని అదే గ్రామానికి చెందిన పురుషులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లా బొరిగుమ్మ సమితిలోని పూజారిపుట్ పంచాయతీ కొండగూడ గ్రామానికి చెందిన పలువురు పురుషులు బుధవారం పోలీసులు, ఆబ్కారీ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. గ్రామంలో కొందరు యువకులు నాలుగేళ్లుగా విపరీతంగా సారా తయారుచేస్తూ విక్రయిస్తున్నారని.. మగవారు కూలి చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటే మహిళలు మాత్రం వారి కష్టాన్ని మద్యానికి ధార బోసేస్తున్నారని మగాళ్లు వాపోతున్నారు. ఫలితంగా తమ పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సారా తయారీ స్థావరాలపై దాడులు చేయాలని కోరారు. నిజంగా వింతగా ఉంది కదూ.