సీనియర్లకు వాలంటరీ రిటైర్మెంట్.. సొంత పార్టీ నేతలపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ నేతలపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే రాజాసింగ్ తాజాగా సొంత పార్టీలోని సీనియర్లు కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యారనేలా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఒక్క కాంగ్రెస్ అనేమిటి ఈ సీనియర్లు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో అంటకాగుతారని దుయ్యబట్టారు.   తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే సీనియర్లను పార్టీ నుంచి బయటకు పంపేయాలన్నారు. పార్టీలోని కొందరు సీనియర్ నాయకుడు రాష్ట్రంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతో అంటకాగుతూ స్వప్రయోజనాల కోసమే పని చేస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు ఆయన రాసిన ఓ బహిరంగ లేఖలో బీజేపీ సీనియర్లను పాత సామానుతో పోల్చారు.

పార్టీ ప్రయోజనాలను ఫణంగా పెట్టి పబ్బంగడుపుకుంటున్నారని రాజాసింగ్ అంటున్నారు.  పార్టీలోని కొందరు సీనియర్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డితో రహస్య భేటీలు జరుపుతున్నారని ఆరోపించారు.   ఇటువంటి నేతలతో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మృగ్యమన్న రాజాసింగ్ అటువంటివారిని పార్టీ నుంచి సాగనంపాలన్నారు. ఇది తన ఒక్కడి అభిమతం కాదనీ, కార్యకర్తలు కూడా ఇదే కోరుకుంటున్నారనీ చెప్పారు.  

బీజేపీ అధికారంలోకి వస్తేనే  తెలంగాణలో హిందువులకు రక్షణ ఏర్పడుతుందన్నారు.  రేవంత్ ప్రభుత్వ పాలనను ఆయన నిజాం పాలనతో పోల్చారు. అలాంటి రేవంత్ రెడ్డితో రహస్య భేటీలు నిర్వహించే నేతలను పెట్టుకుని బీజపీ రాష్ట్రంలో అధికారంలోకి ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఇటువంటి వారికి వాలంటరీ రిటైర్మెంట్ ఇస్తేనే రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్ బాగుంటుందని అన్నారు.