2027 నాటికి పోలవరం పూర్తి!

జగన్ హయాంలో పడకేసిన పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పుడు జోరందుకున్నాయి. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు తన మొదటి పర్యటన పోలవరం సందర్శనతోనే ప్రారంభించారు. తద్వారా పోలవరం ప్రాజెక్టుకు తమ ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతను చాటారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికల్లా పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.

చంద్రబాబు కృషి కారణంగా పోలవరం ప్రాజెక్టుకు నిధులు వెల్లువెత్తుతున్నాయని చెప్పిన ఆయన ఇప్పటి వరకూ పోలవరం ప్రాజెక్టుకు 5052 కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా వచ్చాయన్నారు.   జగన్ హయాంలో కేంద్రం విడుదల చేసిన పోలవరం రీయింబర్స్‌మెంట్ నిధులను దారి మళ్లించిందనీ, ప్రాజెక్టు పనులను పక్కనపెట్టేసి పోలవరంను నిర్వీర్యం చేసిందనీ రామానాయుడు విమర్శించారు.  ప్రస్తుతం  పోలవరం పనులను కూటమి ప్రభుత్వం కేంద్రం సహకారంతో పరుగులు పెట్టిస్తోందని వివరించారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పూర్తి చేసేలా, డిజైన్స్ కు అనుమతులు తీసుకుంటున్నామని   తెలిపారు.

డయాఫ్రమ్ వాల్ పనులకు ప్రస్తుతం రెండు కట్టర్లను ఉపయోగిస్తూ.. 136 మీటర్ల పొడవున, 6700 చదరపు మీటర్లు పూర్తి చేసినట్లు వివరించారు. ఏప్రిల్ మొదటివారం నుంచి డి వాల్ నిర్మాణానికి మూడో కట్టర్ కూడా అందుబాటులోకి వస్తుందన్నారు.  పోలవరం ప్రాజెక్టు  నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం 990 కోట్ల రూపాయలను ఒకే విడతగా వారి వారి ఖాతాల్లో జమచేసిందన్నారు. 

 ⁠