బండి సంజయ్ కాలికి గాయం... పాదయాత్ర ఆగిపోనుందా? 

తెలంగాణ  బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గాయపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్రో భాగంగా  మూడవరోజు లంగర్ హౌస్ ప్రాంతంలో పాదయాత్రను కొనసాగిస్తుండగా... ఆయనను కలిసేందుకు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. ఈ సందర్భంగా అక్కడ తోపులాట చోటుచేసుకుంది. అభిమానులు ఒక్కసారిగా రావడంతో అదుపుతప్పి కిందపడిపోయారు బండి సంజయ్. దీంతో ఆయన కుడికాలికి గాయమైంది. నడవడం ఇబ్బందిగా మారడంతో పాదయాత్రను ఆపేశారు సంజయ్. వైద్యులు ఆయనను పరీక్షింతారు. చికిత్స అందించిన వైద్యులు, కాలికి ప్లాస్టర్ వేశారు. ప్రస్తుతం బండి సంజయ్ రెస్ట్ తీసుకుంటున్నారు. 

ఈనెల 28న పాతబస్తిలోని భాగ్యలక్ష్మి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభించారు బండి సంజయ్. రెండవరోజు ఆదివారం కూడా ఓల్డ్ సిటీలోనే ఆయన యాత్ర సాగింది. టోలిచౌకి, గోల్కోండలో ఆయనకు జనాల నుంచి మంచి స్పందన వచ్చింది. గోల్కోండ కోట దగ్గర నిర్వహించిన సభలో మాట్లాడిన బండి సంజయ్.. కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరిగారు.మూడవ రోజు సోమవారం గోల్కోండ నుంచి అప్పా జంక్షన్ మీదుగా బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది. ఉదయమే యాత్ర ప్రారంభించిన బండి సంజయ్ ఒక సభలో మాట్లాడారు. తర్వాతే ఇబ్బంది పెరగడంతో యాత్రకు విరామం ఇచ్చారు. కాలికి గాయమైనా సంజయ్ పాదయాత్ర యథావిధిగా కొనసాగుతుందని బీజేపీ నేతలు తెలిపారు.

తెలంగాణలో ప్రధాని ఆవాస్‌ యోజన పథకం పేరు మార్చారని, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లంటూ పేరు మార్చుకున్నారని బండి సంజయ్ విమర్శించారు. ప్రధాని మోడీకి పేరు వస్తుందనే పథకం పేరు మార్చారని ఆరోపించారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లలో నాణ్యత లేదని, కాంట్రాక్టర్ల కోసమే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ళు కడుతున్నారని విమర్శించారు. పేదల గురించి ప్రభుత్వం ఆలోచించడంలేదని, ఇప్పటివరకు కేంద్రానికి లబ్ధిదారుల జాబితా అందించలేదన్నారు. కేంద్రం ఎన్నిసార్లు అడిగినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ప్రభుత్వం ఇళ్లు కట్టకపోవడం వల్లే జాబితా పంపట్లేదన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను మాత్రం ప్రభుత్వం చక్కగా వాడుకుంటోందన్నారు. రాష్ట్రంలో ఒకే కుటుంబం మూర్ఖపు పాలన సాగుతోందని, తెలంగాణలో ఎక్కడికి వెళ్లిన ప్రజలు సమస్యలు చెబుతున్నారని బండి సంజయ్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ సర్కార్ మెడలు వంచేది బీజేపీ మాత్రమేనని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.