అది తప్పుడు కేసు!
posted on Mar 13, 2025 3:19PM
.webp)
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె డాక్టర్ సునీత, అల్లురు రాజశేఖర్ రెడ్డిపై వివేకా పిఏ కృష్ణారెడ్డి పెట్టింది తప్పుడు కేసని పోలీసులు నిర్ధారించారు. వైసీపీ హయాంలో కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు డాక్టర్ సునీత, రాజశేఖరరెడ్డిలతో పాటు అప్పటి సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అది తప్పుడు కేసు అని పోలీసులు ఇప్పుడు తేల్చారు.
జగన్ అధికారంలో ఉన్నంత కాలం నత్తనడకన సాగిన వివేకా హత్య కేసు దర్యాప్తు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వేగం పుంజుకుంది. ఈ దర్యాప్తులో భాగంగా సునీత, రాజశేఖ్ రెడ్డి, రామ్ సింగ్‌పై వివేకా పీఏ తప్పుడు కేసు పెట్టారని విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు జమ్మలమడుగు కోర్టులో చివరి ఛార్జ్‌షీట్‌ను పులివెందుల డీఎస్పీ దాఖలు చేశారు. పులివెందుల మెజిస్ట్రేట్ సెలవులో ఉన్నందున జమ్మలమడుగు కోర్టులో సమర్పించారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన సాక్షులు వరుసగా మరణించడంపై ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తోంది. దీంతో సాక్షుల మరణంపై లోతుగా మళ్లీ దర్యాప్తు చేయాలని డీజీపీని ఆదేశించింది.