తెలంగాణ డాక్టరే కావాలి.. పరాకాష్ట ఇది

 

పిచ్చి పరాకాష్టకు చేరడమంటే ఇదేనేమో.. ఒకవైపు నోటుకు ఓటు కేసుతోనే రెండు రాష్ట్రాల మధ్య, ఇద్దరు సీఎంల మధ్య పచ్చగడ్డి వేస్తేనే బగ్గుమనే పరిస్థితి ఏర్పడితే దానికి ఆజ్యం పోసినట్టుగా ఉంది తెలంగాణ కౌన్సిల్ ఛైర్మన్ కె స్వామిగౌడ్ వ్యవహారం. డాక్టర్ ఎవరికైనా డాక్టరే.. వైద్యం కోసం వచ్చిన వాళ్లకి తెలంగాణ పేషెంటో.. ఆంధ్రా పెషంటో తెలుసుకొని వైద్యం చేయరు కదా. కానీ ఆయన మాత్రం తెలంగాణకు సంబంధించిన డాక్టర్లు మాత్రం కావాలని చేసే వ్యాఖ్యలు మాత్రం ఎంతమాత్రం సబబుకాదని తెలుస్తోంది.

 

దీనికి సంబంధించి స్టేట్ హెల్త్ మినిస్టర్ సీ. లక్ష్మారెడ్డికి కూడా లేఖ రాశారు ఆయన. మెహ్దీ నవాజ్ జంగ్ యూనివర్శిటీ ఆఫ్ ఆంకాలజీ డైరెక్టర్ గా డాక్టర్ ఎన్. జయ లతను నియమించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. డా. జయలత  తెలంగాణకు సంబంధించినది.. కాదని ఆమె స్థానంలో మరో డాక్టర్ ని అదికూడా తెలంగాణకు సంబంధించిన డా. చింతమడక సాయిరామ్.. (ఆంకాలజిస్ట్, తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ ఆసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్) ను నియమించాలని సూచించారు. ఇదే విషయం పై తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ ఆసోసియేషన్ ఎగ్జిక్వ్యూటివ్ మెంబర్ అయిన నరహరి స్పందించి తెలంగాణ డాక్టరో.. ఆంధ్రా డాక్టరో చూసి డైరెక్టర్ చేయలేదని.. మెరిట్ ప్రకారం డా. జయ లతను డైరెక్టర్ గా నియమించామని వివరణ ఇచ్చారు.

 

ఏదీ ఏమైనా రాష్ట్రం విడిపోయినా ప్రజలలో ఉన్న తారతమ్యాలు మాత్రం ఇంకా వీడలేదు అనడానికి ఇదే ఒక నిదర్శనం. తెలంగాణ రాజకీయ నేతలు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడితే అది తెలంగాణ రాష్ట్రానికే సమస్యలు తెచ్చిపెట్టక తప్పదు. అయినా రాజకీయ నేతలు వైద్యం చేయించుకోవాలంటే ఏ రాష్ట్రానికి చెందిన డాక్టరో చూడకుండా మంచి డాక్టర్ అయితే చాలు అని ఆలోచిస్తారు.. కానీ పేదల విషయానికి వస్తే మాత్రం వారికి ఎక్కడలేని రూల్స్ అన్నీ గుర్తొస్తాయి.