ఏపీకి మెరుపు వరదల ముప్పు!

వర్షాలు ఏపీని వణికించేస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో  దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలు భారీ వర్షాలకు చిగురుటాకుల్లా వణుకుతున్నాయి.   నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య,, ప్రకాశం, కడప జిల్లాలకు రెడ్ అలర్ట్,  అనంతపురం కర్నూలు, నంద్యాల, బాపట్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు(ఫ్లాష్ ఫ్లడ్) సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.  ప్రకాశం జిల్లాలోని 4 మండలాలు, నెల్లూరు జిల్లాలోని 4 మండలాల్లో, అన్నమయ్య జిల్లాలోని 3 మండలాల్లో వర్ష ప్రభావం తీవ్రంగా ఉంటుందని హచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.  సహాయక చర్యల కోసం జిల్లాల్లో 5 ఎస్డీఆర్ఎఫ్, 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేశారు. అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

ఇలా ఉండగా  భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆకస్మిక వరదల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు సహా పలు జిల్లాల్లో వర్షాలపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితులను నివేదించాలని సూచించారు.  కాగా నెల్లూరు జిల్లాలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. వరికుంటపాడు మండలం, కనియంపాడులో పిల్లాపేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. కొండాపురం మండలం, సత్యవోలు అగ్రారం మిడత వాగులోపొంగి ప్రవహిస్తోంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.