నడ్డాకు ఉద్వాసన? బీజేపీ కొత్త సారథి ఎవరంటే..?

బీజేపీలో సంస్థాగత మార్పులకు రంగం సిద్ధమైందా అంటే ఆ పార్టీ సీనియర్ల నుంచి ఔననే సమాధానమే వస్తోంది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో అనుకున్న ఫలితాలు సాధించడంలో విఫలమైన నాటి నుంచీ బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతల నుంచి నడ్డాను తప్పించాలన్న చర్చ మొదలైంది. పనిలో పనిగా జాతీయ అధ్యక్షుడితో పాటుగా పార్టీ పదవులలో కూడా సమూల మార్పులు చేయాలని హైకమాండ్ భావిస్తోంది. 

ముచ్చటగా మూడో సారి మోడీ సర్కార్ కొలువుదీరినా, అనుకున్న స్థాయిలో స్థానాలను గెలుచు కోవడంలో బీజేపీ వైఫల్యం నడ్డా మెడకు చుట్టుకుంది. వచ్చే ఏడాది ఆరంభంలోనే అంటే 2025 జన వరి లేదా ఫిబ్రవరిలో పార్టీలో సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టు అవకాశాలు ఉన్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల పట్ల తీవ్ర నిరుత్సాహంతో ఉన్న బీజేపీ హైకమాండ్.. నడ్డా మెతకతనం వల్లే ఫలితాలు అనుకున్న విధంగా రాలేదని భావిస్తున్నది. అందుకు పార్టీని ముందుండి నడిపించగలిగిన బలమైన నేత కోసం గాలిస్తోంది.

వాస్తవానికి బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీ కాలం గత జూన్ తోనే ముగిసింది. అయితే మోడీ, షాలకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన నడ్డా స్థానంలో మరొకరిని తీసుకువచ్చే యోచన బీజేపీ హైకమాండ్ చేయలేదు. అందుకే బీజేపీ మూల సిద్ధాంతానికి విరుద్ధమే అయినా నడ్డాను పార్టీ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా జోడు పదవులలో కొనసాగిస్తూ వచ్చింది. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత, తాజాగా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత ఇక నడ్డాకు ఉద్వాసన పలకక తప్పదన్న నిర్ణయానికి కమలం పెద్దలు వచ్చారు. అయితే పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టగలిగే నేత ఎవరన్న దానిపై అధిష్ఠానంలో ఏకాభిప్రాయం కుదరడం లేదు. పరిశీలనలో  మధ్యప్రదేశ్ కు చెందిన సీనియర్ నాయకుడు శివరాజ్ సింగ్ చౌహాన్, మహారాష్ట్రకు చెందిన దేవేంద్ర ఫడ్నవిస్, అలాగే రాజస్థాన్ కు చెందిన సీనియర్ నేత వసుంధరా రాజెపేర్లు ప్రముఖంగా వినిపి స్తున్నాయి. అయితే వీరంతా కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వభావం కలిగిన నేతలు కావడంతో  మోడీ, షాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని పార్టీ వర్గాలలో వినిపిస్తోంది. ఇక ఆర్ఎస్ఎస్ అయితే నితిన్ గడ్కరీని సిఫారసు చేస్తోందని అంటున్నారు. వచ్చే ఏడాది జరిగే పార్టీ సంస్థాగత ఎన్నికల నాటికి ఎవరి పేరు ఖరారౌతుందన్నది వేచి చూడాల్సిందే.