పవన్ కళ్యాణ్ ఇంకా ఎప్పుడు ప్రశ్నిస్తాడో? రామ్ గోపాల్ వర్మ

 

ఒకానొకప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి రావాలని, ఆయన ముందుకు వస్తే యావత్ రాష్ట్ర ప్రజలు ఆయన వెనుక సంద్రంలో కదిలివస్తారని రామ్ గోపాల్ వర్మ ట్వీటర్ లో తెగ మెసేజులు పెట్టేవారు. పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని తను కోరుకొంటున్నట్లు చెప్పేవారు. కానీ పవన్ కళ్యాణ్ నిజంగానే జనసేన పార్టీ పెట్టి రాజకీయాలలోకి వచ్చిన తరువాత ఆయన వ్యవహర శైలి చూసి రామ్ గోపాల్ వర్మ కంగు తిన్నట్లుంది.

 

పవన్ కళ్యాణ్ మాటలను అర్ధం చేసుకోవాలంటే రాజకీయ నాయకులు కనీసం ఓ రెండు వారాలు రాజకీయాలకు శలవు పెట్టి ఆలోచించాల్సి ఉంటుందని అయినా అర్ధం చేసుకోవడం సాధ్యం కాదేమోనని ఎద్దేవా చేసారు. ఎన్నో సినిమాలు తీసే తనకు కూడా పవన్ కళ్యాణ్ వ్రాసిన ‘ఇజం’ పుస్తకం లో ఒక్కముక్క కూడా అర్ధం కాలేదని ఎద్దేవా చేసారు. ఆ తరువాత నుండి అప్పుడప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ మీద ఏదో ఒక బాణం వదులుతూనే ఉన్నారు. కానీ రామ్ గోపాల్ వర్మ తీరే అంత అని అందరూ లైట్ గా తీసుకొనేవారు.

 

మళ్ళీ నిన్న కూడా ఆయన పవన్ కళ్యాణ్ మీద మరో అస్త్రం ప్రయోగించారు. ఆదేమిటంటే “ ప్రశ్నిస్తానన్న వాడు ప్రశ్నించనప్పుడు లోక కల్యాణానికి ద్రొహమ్..ఇది కళ్యాణ ద్రోహం. పాలకుల్ని ప్రశ్నిస్తాననే వాడు ప్రశ్నించనప్పుడు, కళ్యాణం కోరుకునే జనాలకి ప్పెళ్ళెప్పుడు?” అని ట్వీట్ చేసారు.

 

అయితే ఇప్పటికే చాలా మంది ఈ ప్రశ్నవేసి పవన్ కళ్యాణ్ నుండి ఎటువంటి జవాబు రాబట్టలేక ఊరుకొన్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడయినా ప్రజల ముందుకు వచ్చినప్పుడు తాను మీడియాలో వస్తున్న వార్తలను చాలా జాగ్రత్తగా గమనిస్తానని, కానీ ప్రతీ అంశం మీద స్పందించలేనని ఆయనే స్వయంగా చెప్పుకొంటారు. అలాగే తన వింత వింత నిర్ణయాలకు కారణాలు, సంజాయిషీలు ఇచ్చుకోవడం కూడా ఆయనకు షరా మామూలే. కనుక మళ్ళీ ఏదో ఒకనాడు ఆయనకీ ఆవేశం కలిగితే మళ్ళీ జనాల ముందుకు వచ్చి ఇంత కాలం తను ఎందుకు మౌనంగా ఉండిపోవలసి వచ్చిందో...తను ఎందుకు ప్రశ్నించలేకపోయాడో ప్రజలకు సంజాయిషీలు ఇచ్చుకోవచ్చును.

 

కానీ పవన్ కళ్యాణ్ తన ఈ విచిత్ర వ్యవహార శైలి రాజకీయాలకు ఏమాత్రం పనికిరాదనే విషయం గ్రహిస్తే మంచిది. అన్నయ్య చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి చెయ్యి కాల్చుకొని మళ్ళీ సినిమాలలోకి వెళ్లిపోతుంటే, తమ్ముడు సినిమాలను వదిలి రాజకీయాలలోకి వచ్చి చెయ్యి కాల్చుకోవడం ఎందుకు? అన్నీ స్వంత అనుభవం మీదనే తెలుసుకోనవసరం లేదు కదా?

 

ఈ విధంగా వ్యవహరించి నిత్యం విమర్శలు ఎదుర్కోవడం కంటే తనకు రాజకీయాలు అబ్బలేదు కనుక మళ్ళీ అందులోకి రానని, ఇకపై సినిమాల మీదే దృష్టి పెడతానని ఒక చిన్న మెసేజ్ పెట్టి చేతులు దులుపుకొంటే మంచిదేమో? మహా అయితే జనాలు కొన్ని రోజులు దీని గురించి చెప్పుకొంటారు, నవ్వుకొంటారు...ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు విమర్శలు గుప్పిస్తారు. కానీ ఆ తరువాత క్రమంగా అందరూ మరిచిపోతారు. కానీ అలా చేస్తే ఆయన వీరాభిమానులు మాత్రం చాలా సంతోషిస్తారు. కనుక పవన్ కళ్యాణ్ వాళ్ళనయినా సంతోషపరిస్తే ఆయన సినిమాలు మూడు హిట్లు ఆరు సూపర్ హిట్లుగా సాగిపోతాయి కదా?