ప్రొఫెసర్ సాయిబాబా చనిపోయాడా? హత్యకు గురయ్యాడా?

90 శాతం అంగవైకల్యంతో బాధపడుతున్న ఢిల్లీ యూనివర్శిటీ మాజీ  ఇంగ్లీష్ ప్రొఫెసర్  జిఎన్ సాయిబాబా చనిపోయింది సహజమరణమా అంటే కానే కాదు అని చెప్పాలి. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం పని చేయాల్సిన రాజ్యమే అతన్ని  హత్య చేసిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతుంది.

ప్రజాస్వామ్య పరిఢవిల్లాలంటే  నాలుగు మూల స్థంభాల్లో ఒకటైన న్యాయ వ్యవస్థ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.  జిఎన్ సాయిబాబా  నిర్ధోషిగా బయటపడినప్పటికీ  10 ఏళ్ల కఠినకారాగారా శిక్షననుభవించారు. పురాణాలలో సీత ఒకసారి మాత్రమే అగ్ని పరీక్ష ఎదుర్కొంది. అయితే సాయిబాబా మాత్రం రెండు పర్యాయాలు అగ్ని పరీక్ష ఎదుర్కొన్నారు.  వామ పక్ష భావ జాలమున్న సాహిత్యం తన గదిలో ఉన్న కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం సాయిబాబాను ఉపా చట్టం క్రింద అరెస్ట్ చేసి జైలుకుపంపింది. నిర్దోషిగా బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ సుప్రీం కోర్టు స్టే విధించడంతో మరోసారి జైలు శిక్షను అనుభవించారు. రెండో సారి కూడా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో సాయిబాబా నిర్దోషిగా విడుదలయ్యారు. కొడుకును అకారణంగా జైలు పాలు చేయడంతో  కృంగిపోయి క్యాన్సర్ బారినపడి మరణించారు. తల్లి అనారోగ్యంగా ఉన్నప్పుడు పెరోల్ ఇవ్వాలని సాయిబాబా కోర్టును అభ్యర్థించారు. సాక్ష్యులను ప్రభావితం చేస్తాడన్న అనుమానంతో సాయిబాబాకు కోర్టు పెరోల్ ఇవ్వలేదు. చివరకు తల్లి చనిపోయినప్పుడు అంత్య క్రియలకు అనుమతించాలని కోరుతూ మళ్లీ పెరోల్ అప్పీల్ చేసినప్పటికీ అదే సమాధానం కోర్టు నుంచి వచ్చింది.

కన్న తల్లి అంత్యక్రియలకు కూడా సాయిబాబా హాజరుకాని పరిస్థితి కోర్టు కల్పించింది.  కరడుగట్టిన నేరగాళ్లను వేసే అండా సెల్ లో సాయిబాబా జైలు శిక్ష అనుభవించారు. అండా సెల్  కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది. ఎత్తయిన గోడలు ఈ సెల్ ప్రత్యేకత. వీల్ చైర్ కు పరిమితమైన సాయిబాబాను అండా సెల్ లో ఎందుకు వేసినట్టు. ఆదివాసిలు నివాసముండే అడవులను మైనింగ్ కోసం నరికి వేస్తే గట్టిగా పోరాడిన వ్యక్తి సాయిబాబా. అడవులను నరికివేస్తే ఆదివాసీల మనుగడ ప్రశ్నార్థకమౌతుందనే వారు. వారిని ఇతర ప్రాంతాలకు తరలించి నప్పటికీ బతకలేరని ఎప్పుడూ అనేవారు. ఆప్రికన్ దేశాల నుంచి భరత ఖండానికి వలసవచ్చిన ఆఫ్రికన్లే మన మొదటితరం ఆది మానవులే ఆదివాసీలు. ఈ ఆదివాసీలు  మన పూర్వికులు అని అనేక సందర్బాల్లో సాయిబాబా చెప్పేవారు.

 ఉమ్మడి రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో పుట్టిన సాయిబాబా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 2010లో ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థులు చేపట్టిన ప్రత్యేక తెలంగాణ  ఆందోళన కార్యక్రమానికి ప్రొఫెసర్ హోదాలో ఉండి కూడా నాయకత్వం వహించారు. నక్సలైట్లను బూటకపు ఎన్ కౌంటర్లు చేసినప్పుడు  ఎప్పటిప్పుడు ఎండగట్టే ప్రొఫెసర్ సాయిబాబా  రాజ్యం చేతిలో ఎన్ కౌంటర్ కన్నా హీనంగా హత్యకాబడ్డారు. . ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుల్లో ఒకరైన సాయిబాబాను గత టిఆర్ఎస్  ప్రభుత్వం  అస్సలు పట్టించుకోలేదు. ఉద్యమకారుల బలిదానాలతో అధికారంలో వచ్చిన   ఆ పార్టీ పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ  ఒక్కసారంటే ఒక్కసారి జైల్లో కానీ  ఆయన కుటుంబ సభ్యులను కానీ పరామర్శించలేదు. అయితే  సాయిబాబా  చనిపోయిన తర్వాత పార్థీవ దేహాన్నిపరామర్శించడానికి వచ్చిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావ్ కు చేదు అనుభవం ఎదురైంది. సాయిబాబా మద్దత్తు దారులు గో బ్యాక్ కెటీఆర్ అంటూ గట్టిగా నినదించారు. వందమంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కాని  ఒక్క  నిర్దోషికి శిక్ష పడకూడదు ప్రాథమిక న్యాయ సూత్రం చెబుతుంది. అయినా  ఒక్క ఆధారం లేకుండానే సాయిబాబా పదేళ్ల పాటు  కఠినకారాగార శిక్ష అనుభవించారు.  ఈ పదేళ్లు జైల్లో వేసిన మహరాష్ట్ర ప్రభుత్వం మీద శిక్ష వేయాల్సిన అవసరముంది. తాను చనిపోయిన తర్వాత కూడా వైద్య విద్యార్థుల కోసం     తన    మృత దేహాన్ని పరీక్షల నిమిత్తం  గాంధీ హాస్పిటల్ కు అప్పగించాలని కోరారు. ఆయన కోరిక మేరకు సాయిబాబా మృత దేహాన్ని గాంధీ హాస్పిటల్ కు అప్పగించారు. నిర్దోషిగా విడుదలైనప్పటికీ జైల్లో అనుభవించిన శిక్ష వల్ల ఆయన ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. ఏడు నెలల క్రితం విడుదలైనప్పటి నుంచి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందిన  సాయిబాబా  గత శనివారం చనిపోయారు. 


మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో 2014లో సాయిబాబాను పోలీసులు అరెస్టు చేశారు. 2017లో ఆయనకు గడ్చిరోలి సెషన్స్‌ కోర్టు జీవితఖైదు విధించింది. దీంతో దాదాపు తొమ్మిదేళ్లపాటు జైల్లోనే గడపాల్సి వచ్చింది. నేరం రుజువు కానప్పటికీ  జైలులో  కఠిన కారాగార శిక్ష అనుభవించారు. ఆ సమయంలో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు సాయిబాబా. అయితే ఈ ఏడాది మార్చి 5న బాంబే హైకోర్టు సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించింది. దీంతో నాగ్‌పూర్‌ జైలు నుంచి విడుదలయ్యారు. అనారోగ్య సమస్యలు ఆయనను వెంటాడటంతో  శరీరంలో అంతర్గత రక్త స్రావమై  సాయిబాబా  చనిపోయారు. 
 ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురంకు చెందిన సాయిబాబా తెలంగాణ ఉద్యమం, ఆదివాసుల హక్కుల కోసం శ్రమించారు.   1967లో జన్మించిన సాయిబాబాకు  పోలియో సోకి చిన్న వయసులోనే రెండు కాళ్లు పూర్తిగా చచ్చుపడిపోయాయి. ఢిల్లీ యూనివర్సిటీలో సాయిబాబా ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. సాయిబాబా అరెస్టు నేపథ్యంలో 2014లో ఆయనను ఢిల్లీ యూనివర్సిటీ సస్పెండ్‌ చేసింది.  
రాజకీయ నాయకులు పెద్ద పెద్ద స్కాములు చేస్తున్నప్పటికీ తప్పించుకు తిరుగుతుంటే చెయ్యని నేరానికి ప్రాణాలు కోల్పోయి భారీ మూల్యం చెల్లించాడు సాయిబాబా