ఆగస్ట్ లో పట్టిసీమ ఎత్తిపోతల ట్రయల్ రన్

 

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఆది నుండి ప్రతిపక్షాలు ఎన్ని ఇబ్బందులు సృష్టిస్తున్నా రాయలసీమ ప్రజలకు నీళ్ళను అందించేందుకు తెదేపా ప్రభుత్వం దైర్యంగా ముందుకే సాగింది. మొదట ఏడాదిలోగా పూర్తి చేయాలని భావించినప్పటికీ ఈ ఏడాది ఆగస్ట్ నెలలోనే ట్రయల్ రన్ నిర్వహించేందుకు రేయింబవళ్ళు చురుకుగా పనులు జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అవసరమయితే సిసి కెమెరాలు పెట్టి పనుల పురోగతిని తనే స్వయంగా పరిశీలిస్తూ అధికారులతో మాట్లాడుతానని ఆయన తెలిపారు.

 

పట్టిసీమ ప్రాజెక్టుపై తమ ప్రభుత్వం అనేక విమర్శలను ఎదుర్కొని మరీ ముందుకు సాగుతోంది కనుక, సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లు అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని చాలా బాధ్యతగా ప్రాజెక్టును అనుకొన్న గడువు కంటే ముందే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కోరారు. అలాగని ప్రాజెక్టు నాణ్యతలో ఏ మాత్రం రాజీపడేది లేదని, ఏ మాత్రం నాణ్యత లోపించినా సంబంధిత అధికారులు కాంట్రాక్టర్లే బాధ్యత వహించాల్సి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. సకాలంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి రాయలసీమకు నీళ్ళు అందించడం ద్వారా తమను విమర్శిస్తున్న ప్రతిపక్షాలకు జవాబు చెప్తామని అన్నారు.

 

పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ పనులు వేగవంతం చేసి వచ్చే నెలాఖరుకి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమయిన భూసేకరణ కార్యక్రమాన్ని వీలయినంత వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.