కొండాసురేఖకు బిగ్ షాక్... గురువారం  ఢిల్లీకి అసమ్మతి వర్గం

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి , మంత్రి కొండాసురేఖ మధ్య జరిగిన  వివాదం  చిలికి చిలికి గాలి వానగా మారింది. బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే రేవూరి ఫోటోలు లేకపోవడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. కొట్టుకునే వరకు వెళ్లడంతో కొండా వర్గీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివాదంలో మంత్రి తల దూర్చడమే కాకుండా ఇన్ స్పెక్టర్ కుర్చీలో కూర్చొని పోలీస్ కమిషనర్ , సిఐలను దూషించడం వివాదాస్పదమైంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత దీపా దాస్ మున్షీకి ఫిర్యాదు చేసిన  వరంగల్ కాంగ్రెస్ నేతలు రేపు ( అక్టోబర్ 17) న ఢిల్లీ వెళ్లి  ఎఐసిసి నేత కెసీ వేణుగోపాల్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. వేములవాడలో మంత్రి రాక సందర్బంగా స్వామి వారికి సమర్పించే నైవేద్యం ఆలస్యం చేయడం పార్టీకి చెడ్డ పేరు తెస్తుందని వారు అన్నారు. సినీ హీరో నాగార్జున కుటుంబ సభ్యుల మీద ఆమె చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే క్రిమినల్ కోర్టులో రెండు వేర్వేరు పరవు నష్టం దావాలను మంత్రి కొండా సురేఖ ఎదుర్కొంటున్నారు. ఒకటి నాగార్జున , మరోటి కెటీఆర్ వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. సమంతకు క్షమాపణ చెప్పినప్పటికీ  ఈ వివాదం సద్దుమణగలేదు. పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ గొడవ సద్దుమణిగినది అని చెప్పినప్పటికీ వరంగల్ కాంగ్రెస్ నేతలు తాడో పేడో తేల్చుకుంటామని అధిష్టానం దగ్గరికి బయలు దేరనున్నారు. అధిష్టానం సీరియస్ గా తీసుకుంటే కొండా సురేఖ మంత్రి పదవి ఊడే అవకాశం ఉంది.