కాంగ్రెస్ కు జ్ఞానోదయం?!

హర్యానా ఫలితాలతో కాంగ్రెస్ కు జ్ణానోదయం అయినట్లుంది. అతి విశ్వాసంతో గెలిచే అవకాశాలు మెండుగా ఉన్న రాష్ట్రాన్ని చేజార్చుకున్న హస్తం పార్టీ ఇప్పుడు హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ముందు జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తోంది. హర్యానా ఎన్నికలలో నోటిఫికేషన్ విడుదల కు ముందు నుంచీ కూడా సర్వేలన్నీ, చివరాఖరుకు బీజేపీ అనుకూల మీడియా సంస్థలు కూడా హస్తం జయకేతనం ఎగురవేయడం ఖాయమని ఉద్ఘాటించాయి. పోలింగ్ పూర్తయిన తరువాత ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ విజయానికి తిరుగులేదనే చెప్పాయి. అయితే ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెలువడ్డాయి. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అన్నీ తల్లకిందులయ్యాయి. దరిమిలా ఈసీ కూడా సర్వేలకూ, ఎగ్జిట్ పోల్స్ కు శాస్త్రీయత లేదని చెప్పేసింది. ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వాస్తవానికి ఈ రెండు రాష్ట్రాలకూ కూడా కాశ్మీర్, హర్యానాలతో పాటే ఎన్నికలు జరగాల్సి ఉంది. కారణాలేమైతేనేం.. భద్రత కారణాలు చూపుతూ ఎన్నికల సంఘం ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలకు నవంబర్ లో ముహూర్తం నిర్ణయించింది. జార్ఖండ్ లో రెండు విడతలలో నవంబర్ 13, 20 తేదీలలో పోలింగ్ జరుగుతుంది. మహారాష్టరలో ఒకే విడతలో నంబంర్ 20న పోలింగ్ జరుగుతుంది. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలూ నవంబర్ 23న వెలువడతాయి. నవంబర్ 20 సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడతాయి. అదీ సంగతి. జార్ఖండ్, మహారాష్ట్ర లలో వివిధ సర్వేలు కూడా ఫలితాలు బీజేపీకి ప్రతికూలంగా ఉంటాయనే చెప్పాయి. పీపుల్స్ మూడ్ బీజేపీకి అనుకూలంగా లేదని తమ సర్వేలలో తేలిందని పేర్కొన్నాయి. 

అయితే ఈ సారి కాంగ్రెస్ ఆ సర్వేల ఫలితాల ప్రవాహంలో కొట్టుకుపోవడానికి రెడీగా లేదు. అందుకే రెండు రాష్ట్రాలకూ ఏఐసీసీ ఎన్నికల పరిశీలకులను నియమించింది. జార్ఖండ్ కు తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తారిఖ్ అన్వర్, అధిర్ రంజన్ చౌదరిలను, మహారాష్ట్రలోని మరాట్వాడా ప్రాంతానికి తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సచిన్ పైలట్ లను, ఉత్తర మహారాష్ట్ర ప్రాంతానికి తెలంగాణ మంత్రి సీతక్క, సయ్యద్ నసీర్ హుస్సేన్ లు పరిశీలకులుగా కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు గంటల ముందు వీరి నియామకాలను ప్రకటించింది. హర్యానా ఎన్నికలలోలా గెలుపు ముంగిట బోర్లా పడకుండా ఈ పరిశీలకులు ఏ మేరకు కాంగ్రెస్ ను కాపాడుతారో చూడాల్సిందే.