తెలంగాణ హోంమినిస్టర్ సీతక్క?

తెలంగాణ ముఖ్యమంత్రి తన మంత్రివర్గ విస్తరణ కోసం కసరత్తు చేస్తున్నారు. ఇటీవలి తన ఢిల్లీ పర్యటనలో పార్టీ హైకమాండ్ తో విస్తరణపై చర్చించారని విశ్వసనీయంగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ కేబినెట్ విస్తరణ సందర్భంగా ప్రస్తుత మంత్రుల శాఖలలో మార్పులు చేర్పులూ చేసే అవకాశాలున్నాయని విశ్వసనీయంగా తెలిసింది.

అంతే కాదు.  ఉపముఖ్యమంత్రి  దామోదర రాజనరసింహ రేవంత్ కేబినెట్ విస్తరణపై కీలక అప్ డేట్ ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రస్తుత మంత్రుల శాఖలను మార్చాలని భావిస్తే మటుకు ములుగు ఎమ్మెల్యే, మంత్రి సీతక్కకు ప్రమేషన్ రావడం ఖాయమని అన్నారు. ఆమెకు రేవంత్ హోంశాఖను కట్టబట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని దామోదర రాజనర్సింహ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉన్న సంగతి తెలిసిందే. మంత్రివర్గ విస్తరణలో భాగంగా రేవంత్ తన కేబినెట్ లోకి ముగ్గురు లేదా నలుగురిని కొత్తగా తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు.

అలా తీసుకునే వారిలో నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాగోపాల్ రెడ్డి,  అలాగే ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన హైదరాబాద్ కు చెందిన దానం నాగేందర్, నిజామాబాద్ జిల్లాకు చెందిన పోచారం శ్రీనివాసరెడ్డిలకు రేవంత్ కేబినెట్ లో బెర్త్ దక్కడం ఖాయమని పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలిసింది. ఇటు దామోదరరాజనర్సింహ ఇచ్చిన సమాచారం మేరకు సీతక్కకు హోంమంత్రిత్వ శాఖ ఇవ్వడం ద్వారా రేవంత్ ఆమెకు ప్రమోషన్ ఇచ్చినట్లే భావించాల్సి ఉంటుంది. అదే జరిగితే ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ హోంశాఖ మంత్రులుగా మహిళలే ఉంటారు.