అవినాష్‌రెడ్డికి కొత్త తలనొప్పి!

ఉన్న తలనొప్పులు చాలవన్నట్టు కడప ‘అమాయక’ ఎంపీ అవినాష్ రెడ్డికి కొత్త తలనొప్పులు చుట్టుకున్నాయి. బాబాయ్ మర్డర్ కేసుకు సంబంధించిన అసలు సిసలు విచారణ త్వరలో ప్రారంభం కాబోతోంది. ఇంతకాలం తనకు రక్షణగా నిలిచిన అన్నియ్య జగన్ అధికారం కోల్పోయాడు. తాను కడప నుంచి ఎంపీగా గెలిచినప్పటికీ ‘కడప’టి వరకూ ఆ పదవిలో కొనసాగుతాడో లేడో తెలియని పరిస్థితి. మరోవైపు కుటుంబం దూరమైపోయింది. తానెంత అమాయకంగా కనిపించినా ప్రతి కళ్ళూ తననే అనుమానంగా చూస్తూ వుంటాయి.... ఇలా ఇన్ని తలనొప్పులకు తోడు ఇప్పుడు ఆయనకు మరో  తలనొప్పి కూడా ఎదురైంది. అదే పెండింగ్ బిల్లుల తలనొప్పి.

జగన్ అధికారంలో వుండగా కడప పార్లమెంట్ నియోజకవర్గంలో అస్మదీయులైన కాంట్రాక్టర్లకు రకరకాల కాంట్రాక్టు పనులు పంచిపెట్టారు. తమకు రావలసిన తృణమో, పణమో ముందుగానే పుచ్చేసుకుని కాంట్రాక్టులు ఇచ్చారు. సదరు కాంట్రాక్టర్లు జేబులో డబ్బు ఖర్చుపెట్టి కొంతవరకు పనులు చేశారు. వాళ్ళకి జగన్ ప్రభుత్వం కాంట్రాక్టులు అయితే ఇచ్చిందిగానీ, బిల్లులు మాత్రం చెల్లించలేదు. జగన్ ప్రభుత్వం చివరి దశలో వున్నప్పుడు తమకు బిల్లులు చెల్లించాలని వాళ్ళందరూ అవినాష్ రెడ్డి మీద ఒత్తిడి తెచ్చారు. అయితే మళ్ళీ వచ్చేది అన్నియ్య ప్రభుత్వమే కాబట్టి, మళ్ళీ వచ్చాక ఇప్పటి పెండింగ్ బిల్లులన్నీ ఇచ్చేయడంతోపాటు కొత్త కాంట్రాక్టులు కూడా మీకే ఇస్తామని వాళ్ళకి సర్దిచెప్పారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం రాలేదు. జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు పోలవరం ప్రాజెక్టులాంటి పెద్ద ప్రాజెక్టు కాంట్రాక్టుల విషయంలోనే రివర్స్ టెండరింగ్ చేసిన చరిత్ర వుంది. మరి పిల్లబచ్చాల్లాంటి ఈ కాంట్రాక్టర్లను కొత్త ప్రభుత్వం ఎందుకు లెక్కచేస్తుంది? అడిగినంత డబ్బు ఎందుకు ఇస్తుంది? ఎంత ఖర్చుపెట్టారు? ఎందుకు ఖర్చుపెట్టారు... అంటూ బిల్లులను పెండింగ్‌లో పెట్టకుండా వుంటుందా? ఇలాంటి పరిస్థితి ఎదురైతే తమ నెత్తిన గుడ్డ పడటం ఖాయమని భయపడిపోతున్న కాంట్రాక్టర్లు మూకుమ్మడిగా అవినాష్ రెడ్డి దగ్గరకి వెళ్ళి తమ గోడును వెళ్ళబోసుకున్నారు. తమరి ప్రభుత్వం హయాంలో మాకు మొత్తం మూడు వందల కోట్ల రూపాయల బిల్లులు రావాలి.. వాటి పరిస్థితి ఏమిటని నిలదీశారు. 

కాంట్రాక్టర్లు తనను ఒక్కసారిగా అలా అడిగేసరికి ఈ అన్నచాటు తమ్ముడికి ఏం చెప్పాలో అర్థం కాక నీళ్ళు నమిలినట్టు సమాచారం. మిమ్మల్ని నమ్మి, మీకు సమర్పించుకోవాల్సినవి సమర్పించుకుని కాంట్రాక్టులు తీసున్నాం. ఇప్పుడు మాకు బిల్లులు రాకపోతే మా కుటుంబాలు ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదని సదరు కాంట్రాక్టర్లు అవినాష్ రెడ్డిని ‘ఎమోషనల్ బ్లాక్ మెయిల్’ చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి, అవసరమైతే ఉద్యమాలు చేసి మీ బిల్లులు మీకు వచ్చేలా చేస్తానని వాళ్ళందరికీ హామీ ఇచ్చి పంపించేసరికి అవినాష్ రెడ్డి తలప్రాణం తోకలోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తన మీద వున్న కేసులనే మేనేజ్ చేసుకునే స్థితిలో అవినాష్ రెడ్డి లేడు. మరోవైపు అన్నయ్య హిమాలయాలకు వెళ్దామనుకుని, చివరికి బెంగళూరు ప్యాలెస్‌లో స్థిరపడ్డారు. ఇప్పుడేం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అవినాష్ రెడ్డి వున్నారు.