రేవంత్ కు మొదలైన అసమ్మతి సెగ.. ఇంటా బయటా చిక్కులేనా?

తెలంగాణలో రేవంత్  సర్కార్ కు లోపలా బయటా కూడా సమస్యలు పెరుగుతున్నాయి.  రైతులకు ఇచ్చిన పెట్టుబడి, రుణమాఫీలపై దృష్టి పెట్టి ఆ హామీలు త్వరితగతిన పూర్తి చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. విపక్షం నుంచే కాదు స్వపక్షం నుంచి కూడా రేవంత్ పై ఈ విషయంలో ఒత్తిడి ఎక్కువ అవుతోంది. అంతే కాకుండా ఆయన అందరినీ  కలుపుకుని పోవటంలేదన్న ఆరోపణలు కాంగ్రెస్ సీనియర్ల నుంచి వెల్లువెత్తుతున్నాయి.

కాంగ్రెసును అధికారంలోకి తీసుకురావటంలో దూకుడు పెంచి బీఆర్ఎస్ ను అధ:పాతాళానికి నెట్టడంతో   ఆయన ఒక్కసారిగా ప్రజానాయకుడిగా ఎదగడమే కాకుండా..  రాష్ట్ర కాంగ్రెస్ లో తిరుగులేని నేతగా మారారు. అధిష్ఠానం సైతం ఆయనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి పట్టడంతోనే ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఉదాహరణకు ప్రగతి భవన్ పేరును ఫూలే ప్రజాభవన్ గా మార్చడం, ప్రజాభవన్ కు ముందున్న బారికేడ్లను, ఇనుప కంచెలను తొలగగించడంతో ప్రజలకు చేరువయ్యారు. ఇక ఎన్నికల హామీలను వంద రోజుల గడువులో నెరవేర్చడంలో చాలా వరకూ కృతకృత్యుడు కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై జనంలో  హర్షం వ్యక్తమైంది. అయితే ఇక మిగిలిన హామీలను నెరవేర్చేందుకు నిధుల కొరత ప్రధాన అడ్డంకిగా మారింది.  రాజకీయం వేరు, పాలన వేరు అంటూ రేవంత్ రెడ్డి కేంద్రంతో కూడా సఖ్యతగా ఉంటున్నారు. దీని వల్ల రాష్ట్రంలో ఎదో మేరకు పనులు సాగుతున్నాయి.  భాగంగా కంటోన్మెంట్ పరిధిలోని  పౌర ప్రాంతాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి రేవంత్ తీసుకురాగలిగారంటే అందుకు ఆయన కేంద్రంతో వ్యవహరించిన తీరే కారణమనడంలో సందేహం లేదు.  

అయితే గతంలో మేడిగడ్డ పూర్తిగా దెబ్బతిందని మరమ్మతులు  సాధ్యం కాదని  ప్రకటించి రేవంత్ ఇబ్బందులు కొనితెచ్చుకున్నారు.  ఎల్అండ్ టీ కంపెనీ విజయవంతంగా మేడిగడ్డ మరమ్మతు లు చేయడంతో  విపక్ష విమర్శలకు టార్గెట్ గా మారారు.   

ఇక ఆపరేషన్ ఆకర్ష్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ గూటికి చేర్చడంలో సక్సెస్ అయిన రేవంత్.. ఆ వ్యవహారంలో సొంత పార్టీ నేతలను ఒకింత నొచ్చుకునేలా చేశారు. దీంతో సొంత పార్టీలోనే రేవంత్ కు ఇప్పుడు అసమ్మతి సెగ గట్టిగా తగులుతోంది. అదే సమయంలో మేడిగడ్డ మరమ్మతులు విజయవంతం కావడం బీఆర్ఎస్ పార్టీకి రేవంత్ సర్కార్ ను దుయ్యబట్టడానికి ఒక అవకాశం లభించింది. మేడిగడ్డ విషయంలో రేవంత్ చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలడంతో బీఆర్ఎస్ విమర్శల దాడి పెంచింది.  

ఏదిఏమైనా రేవంత్ నిధులను సమకూర్చుకుని రైతుల హామీలను నేరవేర్చడం ఆయన ముందు ఉన్న ప్రధాన టాస్క్. దాన్ని నెరవేర్చి రేవంత్ చేతలమనిషి అని రుజువు చేసుకోవడం ద్వారా పార్టీలోనూ ప్రభుత్వంలోని పట్టు సాధిస్తేనే విమర్శకుల నోళ్లు మూతలు పడే అవకాశం ఉంది. లేకుంటే ముందు ముందు ఇంటా బయటా కూడా రేవంత్ కు చిక్కులు తప్పక పోవచ్చు.