బీజేపీ ఛీ పొమ్మన్నా.. వైఛీపీ ఊడిగం!

జగన్ వైసీపీ పార్టీకి ఒక సిద్ధాంతం, ఒక నిబద్ధత ఏవీ లేనట్టుగానే కనిపిస్తోంది. అసలు ఆ పార్టీ ఆవిర్భావమే జగన్  ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్న ఏకైక లక్ష్యంతో జరిగిందని పరిశీలకులు అప్పట్లోనే చెప్పారు. ఆవిర్భావం నుంచీ వైసీపీ ప్రస్తానం కూడా అలాగే సాగింది. అయితే జగన్ పార్టీ 2019 ఎన్నికలలో విజయం సాధించిన తరువాత జగన్ సీఎం కావాలన్న లక్ష్యం నెరవేరింది. అయితే ఆ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం కక్ష సాధింపు, జగన్ ఆర్థిక నేరాల కేసుల నుంచి ఉపశమనం పొందడమే పాలన అన్నట్లుగా సాగింది. అందుకే ఐదేళ్లు అధికారంలో ఉన్నా రాష్ట్ర సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాల గురించి పట్టింపు లేకుండా వ్యవహరించింది. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ కేసుల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రంలోని మోడీ సర్కార్ ను ప్రసన్నం చేసుకోవడం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలను వేధించడం, ఇక మరోసారి అధికారంలోకి రావడం కోసం సంక్షేమం పేరిట బటన్లు నొక్కుతూ అరకొరగా సొమ్ములు పందేరం చేయడానికే పరిమితమైంది. ఆ క్రమంలో అన్ని రంగాల్లో రాష్ట్రం అధమ స్థితికి చేరినా పట్టించుకోలేదు. 

సరే జగన్  సర్కార్ అధ్వాన పాలనపై కన్నెర్ర చేసిన ఆంధ్రా జనం ఆయనను తిరస్కరించారు. చరిత్ర కనీవినీ ఎరుగని రీతిలో వైసీపీ ఘోరంగా పరాజయం పాలైంది. కనీసం విపక్ష హోదా కూడా దక్కలేదు. 
ఐదేళ్ల పాటు రాష్ట్ర ప్రయోజనాలకు కేంద్రం కాళ్ల దగ్గర తాకట్టు పెట్టి... కేంద్రం అడిగినా అడగకున్నా అన్ని విషయాలలోనూ బేషరతు మద్దతు ప్రకటించిన వైసీపీ తీరా ఎన్నికల ముందు బీజేపీ తెలుగుదేశం కూటమితో జతకట్టడంతో అనివార్యంగా ఆ పార్టీపై విమర్శలు గుప్పించింది. రాష్ట్రంలో తన వైరి పక్షంతో జతకట్టి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీకి మామూలుగా అయితే ఏ విషయంలోనూ మద్దతు ఇవ్వకూడదు. అయితే జగన్ పార్టీకి రాజకీయ పార్టీకి ఉండాల్సిన ఏ లక్షణమూ లేకపోవడంతో ఇప్పటికీ ఆ పార్టీ బీజేపీకి గులాం గిరీయే చేస్తోంది. అలా చేయకపోతే జగన్ కేసుల విచారణ వేగం పుంజుకుంటాయన్న భయమే అందుకు కారణం. 

రాజ్యసభలో నాలుగో అతి పెద్ద పార్టీ వైసీపీ కేంద్రాన్ని ప్రశ్నించే స్థితిలో ఉన్న.. మోడీ సర్కార్ రాష్ట్రంలో వైసీపీ పాలనా కాలంలో చేసిన దుర్మార్గాలను, దుష్టపరిపాలనను దనుమాడుతూ విమర్శల వర్షం కురిపిస్తున్నా.. నిస్సిగ్గుగా కేంద్రంలోని మోడీ సర్కార్ ను ప్రశంసలతో ముంచెత్తుతోంది. అంతే కాదు రాజ్యసభలో మోడీ సర్కార్ పై ఇతర పక్షాలు విమర్శలు చేస్తుంటే వాటిని నిందిస్తోంది.  రాజును మించిన రాజభక్తిని ప్రదర్శిస్తోంది. తెలుగుదేశం కూటమితో జతకట్టి ఏపీలో తమ పార్టీ ఘోర పరాజయానికి కారణమైన బీజేపీని నిస్సిగ్గుగా మద్దతుగా నిలబడుతోంది.  ఇంత కంటే రాజకీయ దివాళాకోరుతనం ఉండదన్న రీతిలో  వైపీపీ వ్యవహరిస్తోంది. అయినా జగన్ ఆర్థిక నేరాల కేసుల నుంచి బయటపడగలరా అంటే అనుమానమే అని అంటున్నారు పరిశీలకులు.