సల్మాన్ ఖాన్ హత్యకు భారీ కుట్ర... సబర్మతి జైలు నుంచే లారెన్స్ బిష్ణోయ్ ఆపరేషన్ 

1998లో కృష్ణ జింకను చంపిన కేసులో  బాలివుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు న్యాయస్థానాలు ఊరట ఇచ్చినప్పటికీ కృష్ణ జింక ఆరాధకులు  మాత్రం వదలడం లేదు. 26 ఏళ్ల తర్వాత కూడా కసితో రగిలిపోతున్నారు కృష్ణ జింక ఆరాధకులు. గ్యాంగ్ స్టర్ సిద్దూ మూసే వాలా హత్య కేసులో   లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం గుజరాత్ సబర్మతి జైలులో ఖైదీగా ఉన్నాడు.అతడు  జైలులో ఉండి కూడా  సల్మాన్ హత్యకు కుట్రలు చేస్తున్నాడని పోలీసులు అంగీకరించారు. 
కృష్ణజింక హత్య కేసులో సల్మాన్ ఖాన్‌ను తన వర్గం ఎప్పటికీ క్షమించబోదని  గతంలో వెల్లడించాడు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్. ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఢిల్లీ పోలీసులు లారెన్స్ బిష్ణోయ్‌ను విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విచారణ సందర్భంగా లారెన్స్ అనేక సంచలన విషయాలు వెల్లడిస్తున్నాడు.
‘‘కృష్ణజింక హత్యకు సంబంధించి మా వర్గం ఎప్పటికీ సల్మాన్‪‌ను క్షమించదు. అతడు ఈ విషయంలో బహిరంగ క్షమాపణ చెబితేనే క్షమిస్తాం’’ అని లారెన్స్  గతంలో చెప్పాడు. కృష్ణజింకను చంపాడనే కారణంతో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను చంపేందుకు లారెన్స్ గ్యాంగ్ ప్రయత్నించింది. ఈ మేరకు 2018లో హత్యాయత్నం చేసింది.  సల్మాన్ తండ్రితోపాటు, అతడి లాయర్‌కు కూడా చంపుతామని బెదిరింపులు వచ్చాయి. ఇద్దరికీ సిద్ధూ మూసేవాలా గతే పడుతుందని హెచ్చరిక లేఖల్లో పేర్కొన్నారు. ఈ బెదిరింపులపై ఢిల్లీ పోలీసులు లారెన్స్‌ను ప్రశ్నించగా, అతడు అనేక  విషయాలు వెల్లడించాడు. కృష్ణజింక హత్య కేసులో సల్మాన్ ఖాన్‌కు జైలు శిక్ష విధించినప్పటికీ బెయిల్ లభించింది. ఇంకా ఈ కేసు విచారణ కొనసాగుతోంది.
అయితే, ఈ కేసుకు సంబంధించి సల్మాన్‌ను లారెన్స్ టార్గెట్ చేయడం వెనుక ఒక కారణం ఉంది. లారెన్స్ సంబంధీకులు కృష్ణజింకల్ని దైవంగా కొలుస్తారు. లారెన్స్ వర్గానికి ఆధ్యాత్మిక గురువు, దైవంతో సమానమైన జంబేశ్వర్ లేదా జంబాజీ ప్రతిరూపంగా కృష్ణజింకను భావిస్తారు. అలాంటి కృష్ణజింకను సల్మాన్ హత్య చేశాడనే కోపంతో అతడ్ని చంపేందుకు లారెన్స్ వర్గం ప్రయత్నిస్తోంది.  ఈ కేసును వాదించిన సల్మాన్ లాయర్‌ను  కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరించిన సంగతి తెలిసిందే. దీనిపై లాయర్, సల్మాన్ తండ్రి  అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసి రక్షణ కోరారు. సల్మాన్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించిన సంపత్ నెహ్రాను 2018లో పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు లారెన్స్ ఈ విషయంలో సూత్రధారి అనే విషయం తెలిసింది

ఈ ఏడాది ఏప్రిల్ 14న బాంద్రాలోని బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఇంటి వెలుపల కాల్పుల ఘటన కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. కరుడుగట్టిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ ‘సల్మాన్ ఖాన్ హత్యకు పక్కా కుట్ర’ పన్నిందని నవీ ముంబై పోలీసులు తేల్చారు. మొత్తం ఐదుగురు నిందితులపై హత్యకు కుట్ర, ఇతర తీవ్రమైన నేరాలకు సంబంధించిన అభియోగాలను మోపారు. ఈ మేరకు కొత్త ఛార్జిషీట్ దాఖలు చేశారు. రూ.25 లక్షల ఒప్పందం ప్రకారం సల్మాన్‌ను హత్య చేయాలనుకున్నారని, ఆగస్ట్ 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు నెలల పాటు ఈ హత్య ప్రణాళికను రూపొందించారని పోలీసులు పేర్కొన్నారు.
నిందితుల ముఠా ఏకే కె-47, ఏకే-92, ఎం 16 రైఫిల్స్‌ వంటి అధునాతన మారణాయుధాలను పాకిస్థాన్ నుంచి కొనుగోలు చేయాలని భావించారని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యలో ఉపయోగించిన టర్కీలో తయారయ్యే ‘జిగానా పిస్టల్‌’ను కూడా కొనాలని భావించినట్టు దర్యాప్తులో తేలిందని వివరించారు.
హత్య కుట్రలో భాగంగా సల్మాన్ ఖాన్‌పై భారీ నిఘా పెట్టినట్టు దర్యాప్తులో వెల్లడైంది. సల్మాన్ ఖాన్ ప్రతి కదలికను ట్రాక్ చేసేందుకు దాదాపు 60 నుంచి 70 మంది వ్యక్తుల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నట్టు ఛార్జిషీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. విస్తృతమైన ఈ నిఘా నెట్‌వర్క్ ద్వారా ముంబైలోని సల్మాన్ నివాసం, పన్వెల్‌లో ఉన్న అతడి ఫామ్‌హౌస్, సినిమా షూటింగ్‌కు వెళ్లే గోరేగావ్‌ ఫిల్మ్ సిటీని కూడా కవర్ చేసేలా ఈ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారు.
ఇక హత్య చేసేందుకు 18 ఏళ్ల లోపు బాలుళ్లను నియమించుకున్నారని ఛార్జ్ షీట్ పేర్కొంది. నిందిత మైనర్‌లు దాడి చేసేందుకు గ్యాంగులో కీలక వ్యక్తులైన గోల్డీ బ్రార్, అన్మోల్ బిష్ణోయ్ నుంచి ఆదేశాల కోసం ఎదురు చూశారని పోలీసులు వెల్లడించారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్ 14న బాంద్రాలోని సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల మోటార్‌బైక్‌లపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పలు రౌండ్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.
1998లో జోధ్‌పూర్ సమీపంలోని అడవులలో ఖాన్ మరియు అతని సహనటులు - సైఫ్ అలీ ఖాన్ , సోనాలి బింద్రే , నీలం మరియు టబు - హమ్ సాథ్-సాథ్ హైన్  చిత్రాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు జింకను చంపినట్లు  సల్మాన్ పై ఆరోపణలున్నాయి.  2007లో సల్మాన్ కు  కోర్టు బెయిల్ మంజూరు  చేసింది. ఈ బెయిల్ మంజూరు చేయడానికి ముందు సల్మాన్ జోధ్‌పూర్ జైలులో ఒక వారం గడిపాడు. వన్యప్రాణుల  చట్టం కింద అంతరించిపోతున్న జింకలను 
సల్మాన్ వేటాడారనే ఆరోపణలున్నాయి. అంతే కాదు  గడువు ముగిసిన లైసెన్స్‌తో తుపాకీలను ఉంచడం మరియు ఉపయోగించడం కోసం ఖాన్‌పై ఆయుధాల చట్టంలోని 3/25 మరియు 3/27 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.