చంద్రబాబు హస్తిన పర్యటన... అందరి దృష్టీ మోడీతో భేటీపైనే!

చంద్రబాబు ఢిల్లీ  పర్యటనతో  రాష్ట్రానికి మేలు జరుగుతుందన్న ఆశ సర్వత్రా వ్యక్తమౌతోంది.  బీహార్ ముఖ్యమంత్రి నితీష్ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్  నేపథ్యంలో చంద్రబాబు మోడీతో భేటీలో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు.

 మోదీతో సమావేశంలో చంద్రబాబు ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తారా అన్నదానిపైనే  రాష్ట్రంలో   చర్చ జరుగుతున్నది. పోలవరం డయాఫ్రేం వాల్  కొత్తగా నిర్మించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు కుష్విందర్ ఓహ్రీ స్పష్టంగా ప్రకటించడం, విదేశీ నిపుణుల మధ్యంతర నివేదికలో పోలవరం పనులు ఇక వేగంగా ముందుకు సాగే అవకాశాలున్నాయని తేలడంతో  బాబు హయాంలో ఏపీ ప్రగతి బాటలో పరుగులు తీస్తుందన్న నమ్మకం అందరిలో కలిగింది.

గతంలోలా కేంద్రం కూడా రాష్ట్రం విషయంలో పట్టీపట్టనట్టుగా ఉండే అవకాశం ఇసుమంతైనా లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబుకు కేంద్రంలో ఉన్న పలుకుబడితో  గతంలో వాజ్ పేయి హయాంలో ఎలా అయితే  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సమృద్ధిగా నిధులు రాబట్టుకున్నారో.. అలాగే ఇప్పుడు కూడా రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇతోధిక సహకారం, సహాయాన్ని పొందగలుగుతారని చెబుతున్నారు.  ప్రజా రాజధాని అమరావతిపై  మంగళవారం (జులై 3) సీఎం శ్వేత పత్రం విడుదల చేసారు. అంతకు ముందే  పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేశారు. జగన్ హయాంలో ఆ రెండింటినీ ఎలా నిర్వీర్యం చేశారు. అరాచకత్వంతో వాటిని ఎలా పాడుబెట్టారో ఆ శ్వేతపత్రాల్లో సవివరంగా పేర్కొన్న చంద్రబాబు.. ఇప్పుడు మోడీతో భేటీలో ఈ రెండింటి పూర్తికి అవసరమైన ఆర్థిక సహాయ సహకారాలపై గట్టిగా పట్టుబట్టే అవకాశం ఉందని అంటున్నారు.  

త్వరలో కేంద్రం బడ్జెట్ పెట్టనుంది. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్  అభివృద్ధికి నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలన్నది కూడా చంద్రబాబు ప్రధాన డిమాండ్ గా ఉంటుందని చెబుతున్నారు.  అమరావతి,పోలవరంతో పాటు రాష్ట్రాభివృద్ధి నిధులకోసమే అయన తన వెంట ఆర్థికమంత్రి ని కూడా తీసుకుని వెళ్లారని అంటున్నారు. చంద్రబాబు ప్రధానిమోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అవుతారు. ఆ భేటీల్లో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై చర్చించనున్నారు.  మొత్తం మీద చంద్రబాబు ఢిల్లీ పర్యటన రాష్ట్రానికి, కూటమికి కూడా ప్రయోజనం చేకూరుస్తుందన్న ఆశాభావం సర్వత్రా వ్యక్తం అవుతోంది.