'పోలీస్ వారి హెచ్చరిక' టైటిల్ లోగో లాంచ్ చేసిన దర్శకుడు తేజ!

అభ్యుదయ  దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ నిర్మిస్తున్న "పోలీస్ వారి హెచ్చరిక" సినిమా టైటిల్ లోగోను ప్రముఖ డైరెక్టర్  తేజ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా దర్శకుడు తేజ మాట్లాడుతూ "ఏ సినిమా కైన  ప్రేక్షకులను ఆకర్షించేది, వారిని థియేటర్ ల వద్దకు నడిచేలా చేసేది  టైటిల్ మాత్రమే. ఈ  "పోలీస్ వారి హెచ్చరిక" అనే టైటిల్ కూడా అలాంటి శక్తివంతమైన  మాస్  టైటిల్. ఈ టైటిల్ దర్శక నిర్మాతలకు కొంగు బంగారంగా మారి విజయాన్ని చేకూరుస్తుంది" అని పేర్కొన్నారు.
 
విజయాలను సెంటిమెంట్ గా మలుచుకున్న సక్సెస్ ఫుల్ దర్శకుడు తేజ గారి చేతుల మీదుగా మా సినిమా పబ్లిసిటీ నీ ప్రారంభించడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని, దీనిని ఒక శుభసూచికగా మేము భావిస్తున్నామని నిర్మాత బెల్లి జనార్థన్
అన్నారు.

దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ.. సినిమా  షూటింగ్  రెండు తెలుగు రాష్ట్రాల్లోని అద్భుతమైన లొకేషన్ లలో పూర్తి చేశామని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని తెలిపారు.

సన్నీ అఖిల్, అజయ్ ఘోష్, రవి కాలే, గిడ్డేశ్, శుభలేఖ సుధాకర్, షియాజీ షిండే, హిమజ, జయవాహినీ, శంకరాభరణం తులసి, ఖుషి మేఘన, రుచిత, గోవింద, హనుమ, బాబురాం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి గజ్వేల్ వేణు సంగీతం అందిస్తుండగా, సినిమాటోగ్రాఫర్ గా నళినీ కాంత్, ఎడిటర్ గా శర్వాణి శివ వ్యవహరిస్తున్నారు.