పట్టిసీమ పైప్ లైన్ లీక్

పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లా రైతులకు  సాగునీరు, తాగునీటికి ఊరటనిచ్చే  పట్టిసీమ ఎత్తిపోతలతో పథకాన్ని గత అయిదేళ్లుగా ప్రభుత్వం పక్కన పెట్టివేసింది. గత ఏడాది తాగునీటి ఎద్దడిని తట్టుకోలేక  కొద్ది రోజులు పట్టిసీమను  వినియోగించి ప్రభుత్వం మమ అనిపించింది.  ఈ ఏడాది నాగార్జున  ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరటంతో .. కృష్ణా, గుంటూరు జిల్లాలు  తాగునీటి కోసం తల్లడిల్లిపోతున్నాయి. కనీసం కృష్ణాజిల్లా  రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో   పట్టిసీమ మోటార్లతో  నీటి తరలింపు ప్రారంభించారు. ఏలూరు జిల్లా పోలవరం  మండలం విక్కిసిరావుపేట వద్ద శుక్రవారం ఉదయం పట్టిసీమ  పైప్ లైన్ పగిలిపోయింది. ఎయిర్ వాల్ లీక్  ఘటనతో  20 అడుగులు ఎత్తులో  నీళ్లు ఎగిసి పడుతున్నాయి. పట్టిసీమ ఎత్తిపోతల నుంచి పైప్ లైన్ ద్వారా కుడి కాల్వలోకి నీళ్లు వెళ్లే మార్గంలో పైప్ లైన్ ధ్వంసమైంది.

జగన్ సర్కార్ నాలుగేళ్లుగా పట్టిసీమను నిర్లక్ష్యం చేసి వినియోగించకుండా వదిలేయడం వల్లే ఈ ఘటన జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైప్ లైన్ లీక్ తో   గోదావరి జలాలు పంట పొలాలను ముంచెత్తుతున్నాయి.  గోదావరి నది నుంచి పోలవరం కుడి కాల్వ వరకు డెలివరీ ఛానల్‌ ఏర్పాటు చేశారు. రెండు రోజుల కిందట  మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి 2,800 క్యూసెక్కుల గోదావరి జలాలు పోలవరం ప్రాజెక్టు కుడి కాలవకు  విడుదల చేశారు.   పట్టిసీమ వద్ద గోదావరి నీటిమట్టం 14.74 మీటర్లకు పైబడి ఉండడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 8 పంపులు 8 మోటార్ల ద్వారా నీటి పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే పైప్‌లైన్ లీకేజీ జరిగింది. ఇటుకల కోట డెలివరీ ఛానల్‌కు వెళ్లే పైపు లైన్ వాల్ ప్లేట్ ఊడిపోయింది.   
 
పైప్ లైన్ లీకేజీతో తమ పొలాలు మునిగిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు నీటి లీకేజీ అరికట్టాలని కోరుతున్నారు. మరోవైపు పైప్‌లైన్ పగిలిపోయిన ప్రాంతానికి వెళ్లే మార్గం కూడా మూసుకుపోయింది. చెట్లు, పొదలతో నిండిపోయిన ప్రాంతానికి చేరాలంటే జంగిల్ క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోటార్లను నిలుపుదల చేస్తే తప్ప ఏ లైన్ పగిలిందో గుర్తించలేని పరిస్థితి ఉంది. దీంతో జలవనరుల శాఖ అధికారులు పైప్‌లైన్లలో ఏ మేరకు నష్టం జరిగిందో గుర్తించే పనిలో పడ్డారు. 
అటు, ఈ ఘటనపై స్పందించిన మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత జలవనరుల శాఖ ఇంజినీర్‌లతో నిమ్మల ఫోన్‌లో మాట్లాడారు. వెంటనే లీకేజిని అరికట్టాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలతో లీకేజీ నివారించే చర్యలను అధికారులు చేపట్టారు. నీటి విడుదలను తాత్కాలికంగా నిలిపి జలవనరుల శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు.