ఎమ్మెల్సీలుగా రామచంద్రయ్య, హరిప్రసాద్ ఏకగ్రీవం!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండు స్థానాలకు ఈ ఇద్దరి నుంచే నామినేషన్లు రావడంతో, ఇద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. సార్వత్రిక ఎన్నిలకు ముందు ఎమ్మెల్సీలుగా వున్న సి.రామచంద్రయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్ వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారిలో ఇక్బాల్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. రామచంద్రయ్య మీద అనర్హత వేటు పడింది. అలా ఖాళీ అయిన రెండు స్థానాలు ఉప ఎన్నికలు లేకుండానే ఏకగ్రీవంగా భర్తీ అయ్యాయి. తెలుగుదేశం సీనియర్ నాయకుడు రామచంద్రయ్యకు ఎన్డీయే కూటమి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. మరో అభ్యర్థి పి.హరిప్రసాద్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి రాజకీయ కార్యదర్శి.