చంద్రబాబు-రేవంత్ భేటీ.. ప్రధానాంశాలు ఇవే!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య శనివారం (06-07-24) నాడు జరిగే చారిత్రక సమావేశానికి అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్‌లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమవుతారు. రాష్ట్ర విభజనకు సంబంధించి అపరిష్కృతంగా వున్న సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కావడం ఇదే మొదటిసారి. ఈ సమావేశంలో ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో వున్న సంస్థల విభజన విషయంలో చర్చించే అవకాశం వుంది.

విద్యుత్ సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న బకాయిల మీద చర్చ జరగనుంది. తనకు 24 వేల కోట్లు ఏపీ చెల్లించాలని తెలంగాణ చెబుతోంది. కానీ,7 వేల కోట్లు తెలంగాణ చెల్లించాల్సి వుందని ఆంధ్రప్రదేశ్ అంటోంది. ఈ చిక్కుముడిని విడిపించడానికి చర్చ జరుగుతుంది. రెండు రాష్ట్రాల మధ్య ఢిల్లీలో ఏపీ భవన్‌కి సంబంధించిన విభజన వివాదాన్ని రేవంత్ రెడ్డి ఇప్పటికే పరిష్కరించారు. మైనింగ్ కార్పొరేషన్‌కి సంబంధించిన చిక్కుముడి కూడా ఈమధ్యే వీడిపోయింది. 

తొమ్మిదో షెడ్యూల్లో వున్న మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోం శాఖ షీలాబేడీ కమిటీని వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించి అభ్యంతరాలేవీ లేవు. మిగతా 23 సంస్థల  పంపిణీపై చర్చ జరిగే అవకాశం వుంది. పదో షెడ్యూల్లో వున్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీ విషయంలో కూడా చర్చ జరగాల్సి వుంది. కీలకమైన ఈ భేటీలో రెండు రాష్ట్రాల అధికారులూ పాల్గొంటున్నారు. వివిధ అంశాలకు సంబంధించిన వివరాలను రెండు రాష్ట్రాల అధికారులు సిద్ధం చేసుకున్నారు.