పోలవరం డయాఫ్రం వాల్ కొత్తది కట్టాలి.. మరమ్మతులకు చాన్స్ లేదు!

జగన్ నిర్వాకం వల్ల పోలవరం నిర్మాణం మళ్లీ మొదటికొచ్చినట్లైంది. జగన్ రివర్స్ వ్యవహారం కారణంగా పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ దెబ్బతిన్న సంగతి తెలిసిందే. అయితే అది అలా ఇలా కాదు.. ఇంకెందుకూ పనికిరానంతగా దెబ్బతిన్నదన్న సంగతి నిపుణుల పరిశీలనలో వెల్లడైంది. ఇప్పుడు కొత్త డయాఫ్రం వాల్ నిర్మించడం తప్ప మరో మార్గం లేదని కేంద్ర జలసంఘం చైర్మన్ కుష్విందర్ ఓహ్రా వెల్లడించారు.

కాగా పోలవరం ప్రాజెక్టు సమస్యలపై పరిశీలిస్తున్న విదేశీ నిపుణులు రెండు వారాలలోగా పూర్తి స్థాయి నివేదిక అందించే అవకాశాలు ఉన్నాయి. వారి నివేదిక ఆధారంగా పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతాయి. ఇప్పటికైతే దెబ్బతిన్న డయాఫ్రం వాల్ విషయంలో ఒక స్పష్టత వచ్చింది. ప్రస్తుతం దెబ్బతిన్న డయాఫ్రం వాల్ స్థానంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు కుష్విందర్ ఓహ్రీ చెప్పారు. ఇక పాత డయాఫ్రం వాల్ కు మరమ్మతులు అన్న ప్రశక్తే లేదనీ, ఆ విషయంలో చర్చకు తావులేదని స్పష్టం చేశారు. పాత డయాఫ్రం వాల్ ముగిసిన అంశమని తేల్చేశారు.  ఇక ఇప్పుడు ఉన్న చర్చ అంతా కొత్త డయాఫ్రం వాల్ ఎక్కడ నిర్మించాలి, ప్రస్తుతం దెబ్బతిన్న డయాఫ్రం వాల్ కు ఎంత దూరంలో నిర్మించాలి? తదితర అంశాలపై నిపుణుల నివేదిక మేరకు నిర్ణయం తీసుకుంటారు.  

నాలుగు రోజులు  పోలవరం ప్రాజెక్టులో పర్యటించిన విదేశీ నిపుణులు ఇక్కడి సాంకేతిక సవాళ్లు, సమస్యలపై అధ్యయనం చేశారు. నిపుణులు గమనించిన అంశాలపై వారితో బుధవారం(జులై 3)  కుష్విందర్ ఓహ్రా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు.

ఈ సమావేశంలో విదేశీ నిపుణులు డేవిడ్‌ పాల్, సీస్‌ హించ్‌ బెర్గర్, రిచర్డ్‌ డొన్నెల్లీ, గియాస్‌ ఫ్రాంక్‌ డి సిస్కో, రాష్ట్ర ప్రభుత్వ జలవనరులశాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం ఇంఛార్జ్​ చీఫ్‌ ఇంజినీర్‌ నరసింహమూర్తి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యదర్శి రఘురామ్, కేంద్ర జల సంఘం డిజైన్ల విభాగం చీఫ్‌ ఇంజినీర్‌ విజయ్‌ శరణ్, డిప్యూటీ డైరెక్టర్లు అశ్వనీకుమార్, గౌరవ్‌ తివారీ తదితరులు పాల్గొన్నారు. 

ఇప్పటికే కేంద్ర జలసంఘం చీఫ్‌ ఇంజినీర్, విదేశీ నిపుణులు ఛైర్మన్‌ ఓహ్రాకు ఒక నివేదిక పంపారు. నాలుగు రోజులుగా ఏమేం పరిశీలించారు, ఏమేం చర్చలు జరిగాయి, వాటి సారాంశం ఏంటనే అంశాలను అందులో నివేదించారు. ఆ నివేదిక ఆధారంగానే కుష్విందర్‌ ఓహ్రా భేటీ నిర్వహించారు. విదేశీ నిపుణులు నలుగురూ ఓహ్రాకు తమ అభిప్రాయాలు  తెలియజేశారు. కేవలం ఇక్కడ చూసిన అంశాలు, ఇక్కడి వారి అభిప్రాయాలు, చర్చల ఆధారంగా మాత్రమే తుది నిర్ణయాలకు రాలేమని వారు పేర్కొన్నారు. ఉన్న నివేదికలను అధ్యయనం చేసేందుకు తగినంత సమయం దొరకలేదని, వాటన్నింటినీ అధ్యయనం చేసి రెండు వారాల్లో  మధ్యంతర నివేదిక ఇస్తామని ఓహ్రాకు విదేశీ నిపుణులు వివరించారు. 

పోలవరం వద్ద గోదావరిలో బంకమట్టి ఉన్నందున కట్టడాల నిర్మాణంలో స్టోన్‌ కాలమ్‌ల నిర్మాణం తదితర అంశాలపైనా విదేశీ నిపుణలు మాట్లాడారు. బంకమట్టి పరిస్థితులున్నా నిర్మాణాలు చేపట్టవచ్చని భరోసా ఇచ్చారు. మొత్తం మీద విదేశీ నిపుణుల రాకతో పోలవరంలో ఒక భరోసా, సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని ఇంజినీరింగ్‌ అధికారులు చెబుతున్నారు.