నరేంద్ర మోడీ టార్గెట్ ప్రధాని చైర్...?

 

 

 

కేంద్రంలో 2014 ఎన్నికల్లో బీజేపీ దాని మిత్రపక్షాలు అధికారంలోకి వచ్చిన పక్షంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడినే ఆ పార్టీ తరపున ప్రధాని అభ్యర్థిగా దాదాపు ఖరారయ్యింది. మోడి గత దశాబ్ద కాలంగా గుజరాత్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఆ రాష్ట్ర ప్రజల గుండెల లోతుకి తీసుకువెళ్ళగలిగారు. ఎన్నో వివాదాలు మరెన్నో విమర్శలు వచ్చిన ఆయన తనదైన శైలిలో గుజరాత్ రాష్ట్రంలో బిజేపేని అత్యంత పటిష్టస్థితికి చేర్చగలిగారు. మరొక రెండు దశాబ్దాల పాటు ఈ రాష్ట్రంలో మరి ఏ ఇతర ప్రాంతీయ, జాతీయ పార్టీలు కాని కాలు మోపలేనంత పటిష్టస్థితికి బిజెపిని చేర్చగలిగారు. హిందూ పక్షపాతిగా ముస్లీంల వ్యతిరేకిగా దేశంలోని రాజకీయ పార్టీలన్నీ నరేంద్రమోడిని చిత్రీకరించడానికి విశ్వప్రయత్నాలు చేశాయి. ప్రారంభంలో ఆ మాటలు నమ్మిన ముస్లీం వర్గాలు మోడికి మద్దతును ఇవ్వలేదు. కాని రానురానూ గుజరాత్ రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేస్తున్న ఎనలేని కృషిని గుర్తించిన మైనార్టీ వార్తాలు మెల్లగా మోడివైపు మొగ్గుచూపడం మొదలుపెట్టారు. వాస్తవానికి దేశవ్యాప్తంగా బిజెపిని మతతత్వ పార్టీ అంటూ మైనార్టీలు బహిరంగంగానే విమర్శిస్తూ ఉంటారు. అలాగే కాంగ్రెస్, సిపిఎం, సిపీఐ, సమాజ్ వాది, బహుజన్ సమాజ్ వాది పార్టీలు కూడా మైనార్టీ ఓట్లను బిజెపిని మతతత్వ పార్టీ అనే బూచిని చూపించి ప్రయోజనం పొందుతున్నది జగమెరిగిన సత్యం. ఆ మేరకు బిజెపి కూడా మైనార్టీ ఓట్లపై తన ఆశలను ఎప్పుడో వదిలేసుకుంది. బిజెపి తన జాతీయ నాయకుల జాబితాలో పేరుకి ఒకరో ఇద్దరో తప్ప మైనార్టీ వర్గానికి చెందినా జాతీయ నేతలు ఎవరూ లేరు. అలాంటి ముస్లీం వ్యతిరేక పార్టీగా ముద్రపడిన బిజెపిని క్రమంగా మైనార్టీ వర్గాలకు దగ్గర తీసుకెళ్ళిన ఘనత కూడా నరెంద్రేమోడీకే దక్కింది.


మోడి కేవలం తన అభివృద్ధి సంక్షేమ పతకాలతో గుజరాత్ ప్రజల మనసును గెల్చుకోగాలిగారు. అదే సమయంలో మతతత్వ పార్టీ బిజెపి అనే ముద్రను కూడా చెరిపివేయగలిగారు. ఆశ్చర్యంగా గుజరాత్ ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ స్థానానికి కూడా ఆయన మైనార్టీ వర్గాలకు టిక్కెట్లను కేటాయించలేదు. అయినా మైనార్టీలు ఈ సారి మోడీకే మద్ధతునే తెలిపాయి. ఈ విషయమై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ కూడా జరిగింది. ఇదిలా ఉండగా 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన పక్షంలో నరేంద్రమోడినే తమ ప్రధాని అభ్యర్థి అని ఇప్పటికే ఆ పార్టీ ఓక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. కేవలం గుజరాత్ ఎన్నికల దృష్ట్యానే ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించలేదు. ఒకవేళ ఎన్నికలకు ముందే ఈ విషయాన్ని ప్రకటించిన పక్షంలో ప్రజలు మోడి పరోక్షాన్ని ఆమోదించలేరని అందువల్లే ఈ విషయాన్ని ఇప్పటివరకు దాచి పెట్టామని బిజెపి నేతలు చెబుతున్నారు.



ఈ మేరకు ఓక సంవత్సరం క్రితమే నిర్ణయం తీసుకున్న బిజెపి కేంద్రనాయకత్వం గుజరాత్ ఎన్నికల దృష్ట్యా ఈ విషయాన్ని ఇంతకాలం బహిర్గతం చేయలేదు. 2013  మార్చి నెల నుంచి గతంలో ఆ పార్టీ సీనియర్ నేత ఎల్,కె. అద్వాని చేపట్టిన రథయాత్ర తరహాలోనే నరేంద్రమోడీ కూడా రథయాత్ర ద్వారా దేశవ్యాప్తంగా పర్యటించి కేంద్రంలో 2014 ఎన్నికలకు బిజెపిని అధికారం దిశగా సమాయత్త పరిచే విధంగా ఒక ప్రణాళికను రూపొందించుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ మేరకు ఆయన అన్ని ఏర్పాట్లను చేసుకుంటున్నట్లు సమాచారం. అలాగే ప్రస్తుత అధ్యక్షుడు నితిన్ గడ్కారీని కూడా తొలగించి ఆయన స్థానంలో జాతీయ అధ్యక్షుడిగా నరేంద్రమోడిని నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కేవలం గడ్కారిపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయనని కొంతకాలం అధ్యక్షునిగా కొనసాగించి పరిస్థితి సద్దుమణిగాక ఆయనను తొలగించి ఆ స్తానలో నరేంద్రమోడిని జాతీయ అధ్యక్షుణ్ణి చేయాలని కేంద్ర నాయకత్వం ఈపాటికే నిర్ణయించుకుంది.



గడిచిన మూడు దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీలో వాజ్ పాయ్ మితవాదిగానూ, అద్వాని అతివాదిగానూ ఉంటూ రెండు గ్రూపులుగా పార్టీ నడిచేది. వాజ్ పాయ్ వర్గం మితవాదం వైపు పార్టీని మళ్ళించగా అద్వాని అతివాదం వైపు నడిపించేవారు. రెండు భిన్న విధానాలతో ఆ పార్టీ కార్యకర్తలు గందరగోళానికి గురయ్యేవారు. ఒక దశలో బిజెపి తాము అధికారంలోకి వచ్చిన పక్షంలో దేశంలో కామన్ సివిల్ కోడ్ ను తీసుకొస్తామని, అలాగే రామజన్మభూమిలో రామమందిరాన్ని నిర్మిస్తామని, భారత దేశాన్ని తన సార్వభౌమత్వాన్ని కాపాడే విధంగా తీర్చిదిద్ది అవినీతి రహిత దేశంగా ముందుకు తీసుకువెళ్తామని చెప్పడంతో అప్పట్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ పాలనపట్ల విసుగుచెంది బిజెపి నాయకత్వంలోని ఎన్డీయేకు పట్టం కట్టారు. సుదీర్ఘ పోరాటం తరువాత మొదటిసారి అధికారం చేపట్టిన బిజెపి నాయకత్వం ఎన్నికల సందర్భంలో తాము ప్రజలకు చేసిన వాగ్దానాలను పూర్తిగా నిలుపుకోలేక పోయింది. ఆ మాటకు వస్తే బిజెపి దేశప్రజలకు చేసిన వాగ్దానాల్లో సగానికి పైగా అమలుకు నోచుకోఎల్డు. ఏ హామీలు ఇచ్చి బిజెపి అధికారంలోకి వచ్చిందో వాటిని అమలు చేయలేకపోయిన కారణంగానే తిరిగి బిజెపి అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. ఆ తరువాత ఆ పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వాని చేపట్టిన రథయాత్రలు కూడా ప్రజాదరణ పొందలేకపోయాయి. దాంతో బిజెపి ఆశించిన ఆదరణ లభించలేదు. 'కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు'. ప్రతి మనిషి జీవితంలోనూ ఎత్తుపల్లాలు ఉన్నట్లే అధికారం కోల్పోయి ఎంతో సంక్షోభానికి గురైన కేంద్రనాయకత్వానికి నరేంద్ర మోడి రూపంలో ఒక చిన్న ఆశ చిగురించింది. ఆ ఆశే పెరిగి పెద్దదవుతూ తిరిగి బిజెపిని కేంద్రంలో అధికారం సంపాదించి పెట్టే విధంగా తయారైంది. ఆ మాటకు వస్తే ప్రపంచంలోనే మోడి లాంటి పటిష్ట నాయకత్వ లక్షణాలు గల వ్యక్తి భారత దేశంలో ఉన్నాడని దేశ విదేశ పత్రికలూ సైతం కొనియాడుతున్నాయి.


ఇప్పుడు దేశానికి నిజాయితీగా నమ్మకంగా ప్రజల సమస్యలను తీర్చుతూ వారికి ఉపాధి అవకాశాలు కల్పించే నాయకుడు కావాలని ఎదురుచూస్తున్నారు. ఆ తరుణంలో గుజరాత్ రాష్ట్రంలో ఇప్పటికే తానేమిటో నిరూపించుకున్న నరేంద్రమోడి దేశానికి కూడా నాయకత్వ పటిమను లక్షణాలను జాతీయ, అంతర్జాతీయ మీడియా కూడా బయటి ప్రపంచానికి తెలియజేసింది. మోడీ దేశాన్ని సమర్థవంతంగా పరిపాలించగల నాయకుడిగా చిత్రీకరించాయి. ప్రస్తుతం మోడి పేరు తారక మంత్రంగా వినిపిస్తోంది. మూడోసారి కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడినే పగ్గాలు చేపడుతారంటూ అన్ని సర్వేసంస్థలు తమ సర్వేలు ప్రకటించేశాయి. ఇక ఎన్నికల ఫలితాలను అధికారికంగా ప్రకటించడమే మిగిలిఉంది. ఇంకా బిజెపిలో కొనసాగుతున్న ఇరువర్గాలు ఇటు వాజ్ పాయ్, అటు అద్వాని వర్గం రెండూ కూడా నరెంద్రేమోడీనే ప్రధాని అభ్యర్థిగా అంగీకరిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఎన్డీయేలోని భాగస్వామ్య పక్షమైన జేడీయు నేత బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ఎన్డీయే తరపున ప్రధాని అభ్యర్థిని నిర్ణయించాల్సింది బిజెపియేనని తేల్చేశారు. మిగిలిన భాగస్వామ్య పక్షాలు కూడా నరేంద్రమోడీ వైపే మొగ్గుచూపిస్తున్నాయి. అందువల్ల ఎన్డీయే అధికారంలోకి వచ్చిన పక్షంలో నరేంద్రమోడీనే భావిభారత ప్రధాని అని నిస్సందేహంగా చెప్పవచ్చు.



ఇప్పటికే అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన యూపిఏ ప్రభుత్వానికి సమర్థవంత నాయకత్వం కూడా లోపించిందన్న పెద్దఎత్తున విమర్శ ఉంది. ఇప్పటికే నిజాయితీపరుడిగానూ, సమర్థవంతంగా గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకెళ్ళిన వ్యక్తిగానూ నిరూపించుకున్న నరేంద్రమోడి దేశవ్యాప్తంగా పర్యటించి తాను ఏ విధంగా దేశాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకెళ్ళగలనో ప్రజలకు వివరించగలిగిన రోజున  నిస్సందేహంగా ప్రహాలు మోడీవైపు మొగ్గుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇందిరాగాంధి తరువాత దేశంలో ధృడచిత్తం గల నేతగా నరేంద్ర మోడీ గుర్తింపబడ్డారు. ఇక ఆంధ్రప్రదేస్ రాష్ట్ర విషయానికొస్తే టి.ఆర్.ఎస్. పార్టీ ఇప్పటికే ఏ పార్టీ అయితే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తుందో ఆ పార్టీతోటే కలిసి పని చేయడానికి తాను సిద్ధమే అని చెప్పడం జరిగింది. కాబట్టి టి.ఆర్.ఎస్. రాబోయే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పనిచేసే అవకాశం ఉంది. ఇదే క్రమంలో టిడిపిలో కొంతమంది నాయకులు కూడా ఇప్పటికే బిజెపిలోని కొందరి ప్రముఖులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.