శృతి మించిన ఎస్పీ ఎంపి ప్రవర్తన

 

 

 

 

లోక్ సభ లో కనీ వినీ ఎరగని దారుణం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ లకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన కోటా బిల్లును ప్రవేశ పెట్టేందుకు మంత్రి నారాయణ స్వామి లేచి నుంచున్నారు. ఇంతలో, సమాజవాదీ పార్టీ సభ్యుడు యస్వీర్ సింగ్ వెనుక నుండి దూసుకు వచ్చి బిల్లును మంత్రి నుండి విసురుగా లాక్కున్నారు. అనుకోని పరిణామంతో మంత్రి షాక్ తో అలా నిల్చుండి పోవాల్సి వచ్చింది.

 

దీనికి ఆగ్రహించిన సోనియా గాంధీ ఆ బిల్లును లాక్కునేందుకు ముందు బెంచీల నుండి వేగంగా యస్వీర్ వద్దకు వచ్చారు. దీనితో యస్వీర్ తన వెనుక ఉన్న మరో ఎస్పీ సభ్యుడు నీరజ్ శేఖర్ వద్దకు బిల్లును విసిరేశారు. శేఖర్ దానిని ముక్కలు చేసి, వాటిని వెల్ వద్ద వెదజల్లారు. ఒక దశలో యస్వీర్ తన పిడికిలి బిగించిన తీరును గమనించిన కాంగ్రెస్ సభ్యులు కనుమూరి బాపిరాజు, విలాస్ ముత్తెం వార్ సోనియా చుట్టూ ఆమెకు రక్షణగా నిలబడ్డారు.

 

ఈ సంఘటన జరుగుతున్న సమయంలో ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సభలోనే ఉన్నారు. ఎస్పీ సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న సమయంలో, బిల్లును సాధ్యమైనంత త్వరగా ఆమోదించాలని మరో వైపు బిఎస్పీ సభ్యులు పోటీ నినాదాలు చేశారు. ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో హల్ చల్ చేసిన యస్వీర్ సింగ్, ఈ బిల్లు వల్ల లబ్ది పొందే వర్గానికి చెందిన ఓ దళితుడు కావడం కొస మెరుపు.