ఎమోషనల్ డ్రామాగా చిన్ని.. నేడే ప్రారంభం!

 

స్టార్ మా ఛానల్‌లో నేటి (జూలై 01) నుంచి ‘చిన్ని’ అనే కొత్త సీరియల్ ప్రసారం కానుంది. సోమవారం నుంచి శనివారం వరకూ రాత్రి 7 గంటలకు ‘చిన్ని’ సీరియల్ ప్రసారం కానుంది. అయితే ఏదైనా కొత్త సీరియల్ వస్తుందంటే.. దాన్ని తీసుకొచ్చి ప్రైమ్ టైమ్ లో పెడుతుంటారు. రాత్రి 7 నుంచి 9.30 వరకూ మంచి ప్రైమ్ టైమ్ కాబట్టి ఆ టైమ్ లో ప్రసారం అయ్యే సీరియల్స్‌కి ఎక్కువ రేటింగ్ వస్తుంటుంది. కాబట్టి కొత్త సీరియల్ ఏదైనా సరే అదే టైమ్ లో పెడుతుంటారు. ఇప్పుడు చిన్ని సీరియల్‌ని రాత్రి 7 గంటలకు ప్రసారం చేస్తుండంటంతో.. ఇతర సీరియల్స్ టైమింగ్స్ మారాయి.

ఈ సీరియల్ ప్రోమో ప్రకారం.. చిన్ని జైలులో పుట్టి అక్కడే తన తల్లితో పాటు జైలులోనే పెరుగుతుంది. ఆ జైలునే తన ప్రపంచం అనుకుంటుంది చిన్ని. అక్కడ ఉండే ఖైదీలు, జైలర్, పోలీసులు, పనిచేసేవాళ్లు వీళ్లే ‘చిన్ని’.. బంధువులు, బంధుత్వాలు. పదేళ్లవరకు తల్లితోనే పెరిగిన చిన్ని అనూహ్య పరిస్థితుల్లో తల్లిని వదిలి జైలు నుంచి బయటకు వస్తుంది. తన తల్లి ఇచ్చిన నమ్మకంతో జైలు నుంచి బయటకు వచ్చిన చిన్ని.. తనకి పరిచయం లేని ప్రపంచంలో ఎలా ఉండబోతోంది? ఆమెకు నీడనిచ్చిందెవరు? తిరిగి తన తల్లి ప్రేమను ఎలా దక్కించుకున్నదన్న భావోద్వేగ కథే ‘చిన్ని’.  ఈ సీరియల్‌లో మెయిన్ లీడ్ హీరోయిన్‌గా కావ్య శ్రీ (Kavya Sri) నటిస్తోంది. జైల్లో ఖైదీగా.. చిన్నికి జన్మనిచ్చిన తల్లిగా బరువైన పాత్రలో నటించింది కావ్యశ్రీ. ఈమె గతంలో ‘గోరింటాకు’, ‘గువ్వ గోరింక’ వంటి సీరియల్స్‌లో నటించి మెప్పించింది. ప్రస్తుతం చిన్ని సీరియల్‌తో స్టార్ మా టీవీ అభిమానుల్ని అలరించేందుకు రెడీ అయ్యింది. వీరేన్ (Actor Viren) నెగిటివ్ రోల్‌లో కనిపించబోతున్నారు. ఇతను గతంలో అగ్నిపూలు, అభిషేకం, ఎన్నెన్నో జన్మలబంధం వంటి సీరియల్స్‌లో నటించారు. మరో నటుడు రవికిరణ్ కీలకపాత్రలో కనిపించబోతున్నాడు.

చిన్ని సీరియల్ రాత్రి 7 గంటలకు ప్రసారం కానుండటంతో.. ఆ టైంలో ప్రసారం అవుతున్న.. ‘నువ్వు నేను ప్రేమ’ సీరియల్ మధ్యాహ్నం 1 గంటకు మారింది. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రసారం అవుతున్న మామగారు రెండింటికి షిఫ్ట్ అయ్యింది. ఆరు గంటలకు ‘గుప్పెడంత మనసు’ సీరియల్ ప్రసారం అవుతుండగా.. 6.30 గంటలకు మగువా ఓ మగువా, 7.00 గంటలకు నువ్వు నేను ప్రేమ, 7.30కి బ్రహ్మముడి, 8. 00 గంటలకు కార్తీకదీపం సీరియల్స్ ప్రసారం అవుతున్నాయి. అయితే ఇప్పుడు రాత్రి 7 గంటలకు ‘చిన్న’ సీరియల్ వస్తుండటంతో ‘నువ్వు నేను ప్రేమ’ సీరియల్‌ని మధ్యాహ్నం ఒంటగంటకు మార్చేశారు.