కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 25 వరకూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న కవిత జ్యుడీషియల్ కస్టడీ బుధవారంతో ముగిసిన నేపథ్యంలో జైలు అధికారులు ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరు పరిచారు. కోర్టు విచారణను జులై 25కు వాయిదా వేస్తూ, ఆమె జ్యుడీషియల్ కస్టడీని కూడా ఆ తేదీ వరకూ పొడిగించింది. 

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో మూడున్నర నెలలుగా ఢిల్లీ, తిహార్ జైల్లో ఉన్న కల్వకుంట్ల కవిత  ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసుకున్న రెండు బెయిలు పిటిషన్లను కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రౌస్ అవెన్యూ కోర్టు ఆమె జ్యుడీషియల్ కస్టడీని పొడిగించడంతో ఆమెకు ఇప్పటిలో ఊరట లభించే సూచనలు కనిపించడం లేదు.

మరో వైపు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కవిత తండ్రి అయిన కేసీఆర్ కూడా చిక్కుల్లో ఇరుక్కున్నారు. విద్యుత్ కొనుగోలుపై విచారణకు బీఆర్ఎస్ డిమాండ్ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్‌ ను రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను కూడా తిరస్కరణకు గురైంది. దీంతో కేసీఆర్ కమిషన్ ముందు హాజరు కాక తప్పని పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా తెలంగాణ ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు తిరుగులేని నేతగా అధికారం చెలాయించిన కేసీఆర్ ఇప్పుడు అన్ని విధాలుగా చిక్కుల్లో పడ్డారు.