సృజనాత్మక లోకం - ఆవిష్కరణల ప్రపంచం!!


ప్రపంచంలో మనిషి ఎప్పుడూ భిన్నమైన వాడే. ఏదో ఒక భిన్నత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉంటాడు. ఆ భిన్నత్వంతోనే ప్రపంచాన్ని భిన్నంగా మార్చేస్తాడు. దానినే నేడు అందరూ అభివృద్ధి అంటున్నారు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఈ మంచిచెడుల గురించి కాదిప్పుడు ప్రస్తావిస్తున్నది. మనం చెప్పుకుంటున్న అభివృద్ధి మానవాభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశంలో కూడా సృజనాత్మకత మరియు ఆవిష్కరణ అనేవి ముఖ్యపాత్ర పోషిస్తాయి. వాటినే కదా భిన్నత్వం అని చెప్పుకున్నాము. ఎప్పుడైతే ఎవరూ చూడనిది, ఎవరికీ తెలియనిది, సులువైన మార్గాన్ని ముందుకు తెచ్చేవి. ఇలా అన్నీ కూడా సృజనాత్మకత, ఆవిష్కరణ అనే అంశాల మీద ఆధారపడి ఉంటాయి. 


అలాంటి వాటి ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి ఏప్రిల్ 21న ప్రపంచ సృజనాత్మకత మరియు ఆవిష్కరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు.  ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే, కొత్త ఆలోచనలను ఉపయోగించమని, కొత్త నిర్ణయాలు తీసుకునేలా మరియు సృజనాత్మకంగా ఆలోచించేలా ప్రజలను ప్రోత్సహించడం.


అసలు ఏమిటి సృజనాత్మక మరియు ఆవిష్కరణ దినోత్సవ ప్రత్యేకత?? ఇది ఎప్పటి నుండి ఉంది?? మనకు ఇంతకుముందు పరిచయం ఉందా?? అని ప్రశ్నించుకుంటే చాలామందికి దీని గురించి తెలియదు. 


మరి ఏమిటి ఈ దినోత్సవం??


 ప్రపంచ సృజనాత్మక మరియు ఆవిష్కరణ దినోత్సవం మే 25, 2001న కెనడాలోని టొరంటోలో స్థాపించబడింది.  1977లో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ క్రియేటివిటీలో సృజనాత్మకతను అభ్యసిస్తున్న కెనడియన్ మార్సి సెగల్ అనే వ్యక్తి ఈ దినోత్సవ వ్యవస్థాపకురాలు.  


ఈరోజును ఎందుకు ఎలా స్థాపించారు??


కెనెడియన్ మార్సి సెగల్ అనే ఆమె నేషనల్ పోస్ట్‌లో 'కెనడా ఇన్ క్రియేటివిటీ క్రైసిస్' అనే హెడ్‌లైన్‌ని చదివిన మరుసటి రోజు ఈ దినోత్సవాన్ని రూపొందించాలని ఆమె నిర్ణయించుకుంది.  ఆమె ఆలోచన ప్రకారం, ప్రజలు కొత్త ఆలోచనలను రూపొందించడానికి మరియు కొత్త చర్యలు తీసుకోవడానికి మరియు ఫలితాలను సాధించడానికి వారి సహజ సామర్థ్యాన్ని ఉపయోగించడం ప్రారంభిస్తే, అది ప్రపంచాన్ని, ప్రపంచంలో జీవిస్తున్న మనుషుల జీవితాలను మెరుగురుస్తుందని అభిప్రాయపడింది.

ఆమె తన సహోద్యోగుల సహాయంతో ఏప్రిల్ 2002లో మొదటి క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ డేని నిర్వహించి,  సృజనాత్మకతను బయటపెట్టమని ప్రజలను ప్రోత్సహించింది. మొదటి నిర్వహణ ఎంతో మంచి విజయం సాధించడంతో దాన్ని అనుసరించి, అనేక సంఘాలు, ప్రపంచం నలుమూలల నుండి ఎన్నో దేశాలు దీనిని జరుపుకోవడంలో చేరాయి.

 యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఏప్రిల్ 21, 2017న వరల్డ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ డేని జరుపుకోవాలని తీర్మానాన్ని ఆమోదించింది. ప్రపంచవ్యాప్తంగా 50 కంటే ఎక్కువ దేశాల్లోని పౌరులు మరియు సంస్థలు సృజనాత్మకత మరియు ఆవిష్కరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు కూడా.  ప్రపంచ ఆమోదం పొందిన తరువాత  మొదటి ప్రపంచ సృజనాత్మకత మరియు ఆవిష్కరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి 2018లో జరుపుకుంది.

దీని ప్రాముఖ్యత ఏమిటి??


సమాజంలోని ప్రతి వర్గాన్ని దృష్టిలో ఉంచుకుని ఆవిష్కరణలు జరగాలని ఐక్యరాజ్యసమితి చెబుతోంది.  ఇది సృజనాత్మకత మరియు సంస్కృతికి ప్రాధాన్యతనిస్తుంది, ఎందుకంటే ఇది ఆర్థిక విలువను అందించడమే కాకుండా, సమగ్ర సామాజిక అభివృద్ధికి దోహదపడే గణనీయమైన ద్రవ్యేతర విలువను కలిగి ఉంటుంది. మాస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, సృజనాత్మకత మరియు ఆవిష్కరణలు ఉపాధిని సృష్టించడంలో సహాయపడతాయని మరియు దేశం యొక్క ఆర్థిక సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి వేగాన్ని అందించగలవని కూడా పేర్కొంది.


ఇంకా చెప్పాలంటే  ప్రపంచం మొత్తం కరోనావైరస్ మహమ్మారితో పోరాడి ఆర్థికంగా, మానసికంగా ఎన్నో నష్టాలు ఎదుర్కొన్న ఈ సమయంలో మన అంతర్గత సృజనాత్మకతను బయటకు తీసి మానసికంగా మరియు ఆర్థికంగా దృఢపడటానికి వినియోగించుకోవాలి. ఇవి మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులలో ఈ సృజనాత్మక విప్లవం మొదలైతే దేశం కూడా ఆర్థిక మాంద్యం నుండి తొందరగా బయటపడగలదు.  


కాబట్టి భిన్నత్వంలో ఏకత్వంగా చెప్పుకునే మన భారతదేశంలో విభిన్నంగా ఆలోచించి ఆవిష్కరణలు చేయడం, సృజనాత్మకతలో భారతాన్ని నింపడం తప్పేమి కాదు. 

                       
 

 ◆వెంకటేష్ పువ్వాడ.