జాగ్రత్త.. ఈ అలవాట్లు జీవితాన్ని  నాశనం చేస్తాయ్..!

 


జీవితం సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. జీవితంలో సంతోషం, సామరస్యం, సానుకూలత ఉన్నప్పుడు చాలా హాయిగా అనిపిస్తుంది. కానీ కొన్ని అలవాట్లు జీవితాన్ని దెబ్బతీస్తాయి.  సంతోషంగా సాగాల్సిన జీవితాన్ని  నాశనం చేస్తాయి.  ఇంతకీ జీవితాన్ని నాశనం చేసే ఆ అలవాట్లు ఏమిటో.. అవి ఎందుకు జీవితాన్ని నాశనం చేస్తాయో తెలుసుకుంటే..


సెల్ఫ్ డబ్బా..

ఎవరూ ఇతరుల ముందు  తమను తాము తక్కువ చేసుకుని చెప్పుకోవాలని అనుకోరు. కానీ తమ గురించి తాము ఇతరుల ముందు అదే పనిగా పొగుడుకోవడం మంచి అలవాటు కాదు. తమను తాము పొడుగుకునేవారు, తమలో లోపాలను సమర్థించుకుని,  కవర్ చేసుకునేవారు ఎప్పటికీ తమలో లోపాలను తెలుసుకోలేరు. తమ తప్పులను తాము తెలుసుకోలేరు. దీని వల్ల వారు వ్యక్తిగతంగా వెనుకబడతారు.  

కోపం..

తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అన్నారు.. కానీ కోపాన్ని ఎక్కువగా ప్రదర్మించేవారు , చిన్న విషయాలకు కోపం తెచ్చుకునేవారు  ఇతరులు చెప్పే మంచిని వినలేరు.. ఇతరులు చెప్పిన మంచి వెనుక దాగిన భవిష్యత్తును అర్థం చేసుకోలేరు. కోప స్వభావులు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కారణంగా చాలా నష్టపోతారు.

సహాయ గుణం లేకపోవడం..

మనుషులు, జంతువులు మాత్రమే కాదు.. సకల ప్రాణి కోటి పట్ల భూత దయ ఉండాలని అంటారు.  నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి సహాయం చేయడం,  ఇబ్బందులలో ఉన్నవారిని ఆదుకోవడం వల్ల అందరితో ఆరోగ్యకరమైన సంబంధాలు ఏర్పడతాయి.  కానీ ఎవరికీ ఎలాంటి సహాయం చేయకుండా ఉండటం వల్ల జీవితంలో తమకు కష్టం వచ్చినప్పుడు సహాయం చేసేవారు ఉండరు. ఇది జీవితాలను సంకటంలోకి నెట్టివేస్తుంది.

హింస గుణం..

ఇతరులకు సహాయం చేయడానికి బదులుగా ఇతరులు బాధపడితే చూసి సంతోషించే శాడిస్ట్ గుణం ఉన్నవారు జీవితంలో చాలా కష్టాలపాలవుతారు. ఒక మనిషిలో ఉండే హింస గుణం ఆ మనిషి జీవితాన్ని ఎప్పటికైనా  వినాశనం వైపుకు తీసుకువెళుతుంది.

బలం..

ప్రతి వ్యక్తిలో ఉండే బలం ఆ వ్యక్తికి మంచి చేసేది.. కొన్ని పరిస్థితులలో సహాయంగా ఉండేది కావచ్చు. కానీ ఇతరులు సహాయం కోసం వచ్చినప్పుడు,  ఇతరులు ఇబ్బందులలో ఉన్నప్పుడు తమకున్న బలాన్ని ప్రయోగించి ఇతరులను ఇబ్బంది పెట్టడం సరికాదు. ఇది ఏదో ఒకరోజు ఆ వ్యక్తిని దెబ్బతీస్తుంది.

చెడు ప్రవర్తన..

ఇతరులతో, స్నేహితులతో చెడుగా ప్రవర్తించడం వల్ల  మంచి సలహాలు ఇచ్చేవారు, మంచి చెప్పే వారు దూరం అవుతారు. అందుకే ఎవరితోనూ చెడుగా ప్రవర్తించకుండా సంతోషంగా ఉంటే  వారి జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. లేకపోతే వినాశనమే.

అత్యుత్సాహం

జీవితంలో పనులు చక్కబెట్టాలంటే ఉత్సాహం మంచిదే.. కానీ అత్యుత్సాహం మాత్రం మంచిది కాదు.. దీని వల్ల జీవితం గందరగోళంలో పడిపోతుంది. కొన్ని సార్లు ఈ అత్యుత్సాహం వల్ల జీవితంలో ఊహించని పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి.


                                     *రూపశ్రీ. 

Related Segment News