కళయా... నిజమా..??
posted on Apr 17, 2022 9:30AM
ఏదైనా పనిని ప్రత్యేకంగానో, ఆకర్షణగానో, కొత్తగానే చేస్తే ఎంతో బాగుంటుంది. మనం చేసే విధానం ఆ పనిని ఇంకా ఇంకా ఉన్నతంగా చూపెడుతూ ఉంటే ఖచ్చితంగా కళ తొంగిచూస్తోంది అనో లేక కళ తిష్ఠ వేసుకుంది అనో అంటాము. కాబట్టి కళ అంటే అందం, ఆ అందంతో పాటు సహజత్వం, సహజత్వంతో పాటు ఆకర్షణ, ఆకర్షణతో పాటు ప్రత్యేకత ఇలా ఒకదానికొకటి తోడయి దాన్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి. అందుకే కళ అంటే ఒకానొక ప్రత్యేక విభాగం అయిపోతుంది.
కొందరికి ఈ కళల విషయంలో ప్రత్యేక అభిరుచి ఉంటుంది. మరికొందరు ఆ కళల సంగత్యంలో బతికేస్తూ ఉంటారు. అలాంటివాళ్ళు కాసింత కృత్రిమత్వం నుండి వేరైపోయి ఉంటారు కూడా. ఈ కళలు మనుషులను ప్రత్యేకంగా నిలబెడతాయి కూడా. అలాంటి కళల కోసం కలలు కనేవాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే మనిషిని కదిలించే గుణం కళకు ఉంది మరి.
కళయా… నిజమా…..??
అరవై నాలుగు కళలు ఉన్నాయి. వీటినే చతుష్షష్టి కళలు అని అంటారు. వీటిలో సామాన్యమైన కళలు ఉన్నాయి, లలిత కళలు ఉన్నాయి.
ముఖ్యంగా లలిత కళలు ఎంతో ప్రత్యేకమైనవి. బొమ్మలు వేయడం, పాటలు పాడటం, సాహిత్యం, నాట్యం ఇవి మాత్రమే కాకుండా శిల్ప కళ మొదలైనవి భారతీయ వారసత్వ కళలుగా వస్తున్నాయి. అయితే కొందరు ఈ కళలలో గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో శ్రమిస్తూ ఉంటారు. మరికొంతమంది తమలో ఉన్న అసంబద్ధమైన విద్యను కళగా అందరి ముందు ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే కళ మీద ఉన్న కలను తీర్చుకోవడం ఎలా??
సాధన!!
సాధనములు పనులు సమకూరు ధరలోన అంటాడు యోగి వేమన. అంటే దేనికైనా సాధన అవసరం అని అర్థం. కాబట్టి కళ అంటే నాలుగు రోజులు దాని వెంట పడి ఊగులాడటం కాదు. ఏళ్లకేళ్ళు సాధన అవసరం. అంతేకాదు ఎప్పటికప్పుడు దాన్ని కొత్తగా వ్యక్తం చేయగలుగుతూ ఉండాలి. దానికి ఎలాంటి అగౌరవం తీసుకురాకూడదు.
ప్రేమ!!
ప్రతి కళ మనిషికి గుర్తింపు తెచ్చేది మాత్రమే కాదు, డబ్బు సంపాదించే ఆదాయ వనరు కూడా. అయితే ఈమధ్య కాలంలో ప్రతి కళను కేవలం ఆద్య వనరుగా మార్చేసుకుంటూ దాన్ని కృత్రిమంగా ఒంటబట్టించేసుకుంటున్నారు. అందుకే కళను ప్రేమిస్తే ఆ కళ మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. అందుకే కళను ప్రేమించేవారికే ఆ కళ కూడా దగ్గరవుతుంది అంటారు.
విలువ!!
విలువ తెలిసినప్పుడు దేనికి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇస్తారు. కాబట్టి కళకు ఉన్న విలువ తెలుసుకోవాలి మొదట. కళను కళగా కాక ఏదో టైమ్ పాస్ పనిగానో, గౌరవం లేనిచోటనో ప్రదర్శించి ఆ కళను అవమానించకూడదు. అప్పుడే ఆ కళలో ఉండే హుందాతనం మనిషిలో కూడా ప్రస్ఫుటం అవుతుంది.
ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే కళ ఒక అద్భుతమైతే దాన్ని అంతే అద్భుతంగా అవిష్కరించేవాడు కళాకారుడు అవుతాడు. కళ కోసం జీవితాన్ని ధారబోసిన ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో. అలాంటి గొప్ప కళాకారులకు, అలాంటి కళాకారులను ప్రపంచానికి అందించిన కళకు వేల వేల కృతజ్ఞతలు చెప్పుకోవాలి.
కళను ప్రేమించండి, కళ మిమ్మల్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్తుంది.
◆వెంకటేష్ పువ్వాడ.