తిరుమల శ్రీవారి అన్న ప్రసాదం స్వీకరించిన టీటీడీ చైర్మన్

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గా బీఆర్ నాయుడు బుధవారం (నవంబర్ 6)  ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇలా టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టగానే అలా తిరుమల పవిత్రతను కాపాడే విషయంపై దృష్టి సారించారు. జగన్ ఐదేళ్ల పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠ మసకబారిన సంగతి తెలిసిందే. తిరుమల కొండపై పారిశుద్ధ్యం, పవిత్రత విషయంలో గత టీటీడీ బోర్డు ఇసుమంతైనా దృష్టి పెట్టలేదు. కొండపై హోటళ్లలో నాణ్యత తగ్గిపోయిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. తెలుగుదేశం కూటమి కొలువుదీరిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రక్షాళనను తిరుమల నుంచే ప్రారంభిస్తామని ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత తిరుమలపై పరిస్థితులు చాలా వరకూ మెరుగుపడ్డాయి. 

ఈ నేపథ్యంలోనే తిరుమలలో పరిస్థితులను స్వయంగా పరిశీలించి పర్యవేక్షించాలని టీటీడీ బోర్డు కొత్త చైర్మన్ బీఆర్ రాయుడు నిర్ణయించుకున్నారు. అందులో బాగంగా బుధవారం (నవంబర్ 6) రాత్రి తిరుమల శ్రీవారి అన్న ప్రసాద భవనాన్ని ఆయన సందర్శించారు. సకుటుంబ సమేతంగా సామాన్య భక్తులతో కలిసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా అన్న ప్రసాద భవనంలో కార్యకలాపాలను టీటీడీ ఈవో రాజేంద్ర చైర్మన్ కు వివరించారు. అన్న ప్రసాద భవనంలో ఒక రోజులో ఎంత మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరిస్తారు. అన్న ప్రసాదంలో అందించే పదార్ధాల వివరాలు, పని వేళల గురించి చైర్మన్ సావధానంగా విని తెలుసుకున్నారు. తిరుమల పవిత్రతను కాపాడటం, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా పని చేస్తానని చెప్పారు.