దీపమంత ఆశ!! 

తాను వెలుగుతూ చుట్టూ వెలుగును అందిస్తూ ఆశను పెంచి, ఆశావహ జీవితానికి ప్రేరణగా నిలిచేది దీపం. ప్రతి ఇంట్లో దీపం తప్పనిసరి. అది ఏ కులం అయినా హిందువులు దేవతా విగ్రహాలు పటాల ముందు, ఇస్లాం మతస్తులు దర్గాలలో, వారి ఇళ్లలో వారి దేవుడి ముందు, క్రిస్టియన్స్ వారి యేసు ప్రభువు దగ్గర కాండీల్స్ వెలిగించడం అన్ని చోట్లా కనబడుతుంది. దీపారాధన మనిషిలో కొన్ని కల్మషాలను తొలగించి మనసును శుద్ధి చేస్తుందని చెప్పుకుంటారు. ఇక హిందూ మతంలో దీపావళి ముగిసి ప్రారంభమయ్యే కార్తీకమాసం మొదలు నుండి మాసం ముగింపు దాకా దీపాల సందడి కొనసాగుతూనే వుంటుంది. మనుషులందరూ సుమారు పట్టణాలకు తరలిపోయినపుడు, పల్లెలు పట్టణాల రంగులోకి మారుతున్నపుడు కొన్ని సాంప్రదాయాలు తగ్గిపోతున్నా దాన్ని కాపాడుకుంటున్నామంటూ పలుచోట్ల దీపాల మిణుకులు సంతోషాన్ని కలిగిస్తాయి.
ఇకపోతే మునుపు దీపాలు వెలిగించడంలోనూ ఇప్పుడూ చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. చాలా చోట్ల కాండీల్స్ పెదుతుంటారు. కానీ దాని వల్ల ప్రయోజనం ఉండదు. ఇక్కడ ప్రయోజనం అంటే దేవుడి పుణ్యమో మరేదో కాదు. 

దీపాలు వెలిగించడం వెనుక శాస్త్రీయత!!

కార్తీకమాసం నవంబర్ డిసెంబర్ నెలల్లో సాగుతుంది. ఆ సమయంలో వర్షాలు సరేసరి, చలి మొదలవుతుంది. ప్రతి ఇంట్లో ముందు నూనె వేసి, వత్తితో, మట్టి ప్రమిధల్లో దీపాలు వెలిగించడం వల్ల ఆ దీపం కాలుతున్నపుడు వచ్చే వాసనే క్రిమికీటకాలను ఇంట్లోకి వెళ్లకుండా చేస్తుంది. కానీ ఇప్పట్లో అంతా కృత్రిమంగా తయారైపోయారు. నూనె ముట్టుకుంటే చేతికి జిడ్డు అంటారు, వత్తులు చేయడం చాలమందికి రానే రాదు.

మట్టి ప్రమిధలు కొనాలంటే నామోషీ!!

పెద్దవాళ్లే ఇట్లా ఉంటే ఇక పిల్లలకు ఏమి వస్తాయి ఈ అలవాట్లు హిందుత్వాన్ని సంప్రదాయాలను కాపాడుకోవడానికి కోటి దీపోత్సవాలు, లక్ష దీపోత్సవాలు నిర్వహిస్తే సమాజంలోని బీదరికం, వెనుకబడిన వాళ్ళ ఆకలి గుర్తొస్తాయి నాస్తికులకు, వైజ్ఞానిక వేత్తలకు. కానీ వేలంటైన్స్డే, న్యూ ఇయర్ లకు మాత్రం పేదవాళ్ళు, వెనుకబడిన వాళ్ళు గుర్తుకురారు. ఎందుకంటే వీళ్ళందరూ పాశ్చాత్య సంస్కృతిని దాని విశిష్టత.

దాని గొప్పదనాన్ని ఎప్పుడూ మైక్ పట్టుకుని చెబుతుంటారు మరి!!

ఇంకొక శాస్త్రీయ కారణం ఏమిటంటే కార్తీక మాసం మొదలైనపుడు పగటి కాలం తక్కువగానూ చీకటి కాలం ఎక్కువగానూ గడుస్తూ ఉంటుంది. ఇంటి ముందు దీపాలు వెలిగించడం వల్ల చీకటిని దీపాల వెలుగుతో తరిమినట్టే. దీపాలు ఉపయోగించే నూనె, పత్తి కాలడం వల్ల వచ్చే పొగ, వాసన ఎంతో గొప్ప పలితాన్ని చేకూర్చుతాయని ఆయుర్వేదంలో పేర్కొంటారు. అలాంటి గొప్ప సంప్రదాయం, ఆరోగ్య విశిష్టత నిండి ఉన్న మన వారసత్వాన్ని చేతులారా నిర్లక్ష్యం చేస్తే మనం నష్టపోవడం మాత్రమే కాకుండా పరోక్షంగా నాటి బ్రిటిష్ బానిస బతుకులు మొదలవుతాయి. నాడు ప్రత్యక్షంగా అయితే

నేడు వ్యాపారమనే వలయంలో వాళ్ళ గుప్పట్లో భారతాన్ని బంధించే ప్రయత్నాలు ఎన్నో!!

అందుకే మన సంప్రదాయంలో ఉన్న అన్నిటినీ పిల్లలకు వివరిస్తూ, మనమూ పాటిస్తూ ఉంటే చిన్ని చిన్ని చేతులు వెలిగించే దీపాలు రేపటి కొండంత జీవితానికి ఆశావహ దృక్పథాన్ని ఎంతో ఉన్నతంగా మారుస్తాయి. ఆలోచనా విధానాన్ని విస్తృతం చేస్తాయి. చిన్ని చిన్ని ఆశ, ఈ దీపమంత ఆశ అని పాడుకుంటూ దీపాల సందడిలో మునిగిపోండి.


◆వెంకటేష్ పువ్వాడ