భూమి ఏడుస్తోంది!!
posted on Apr 19, 2022 9:30AM
ఈ ప్రపంచం పంచభూతాలతో నిండి ఉంది. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి. ఇవన్నీ పంచభూతాలు. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఈ ప్రపంచం ఎలా ఉండేదో!! ఆలోచిస్తే ఏమీ తోచదు. కాసింత ఉలికిపాటు కలుగుతుంది కూడా. మరి ఈ పంచభూతాలు లేకపోతే మనిషి మనుగడ ఈ భూ గ్రహం మీద ఉండేది కాదేమో. ఈ పంచభూతాలో మనుషుల్ని మోస్తున్న భూమి మహా ఓపిక కలిగినది. ఈ గ్రహం అవిర్భవించినప్పటి నుండి ఎన్నో కోట్ల జీవరాశులను మోస్తూనే ఉంది. కానీ మనిషి మాత్రం తనను మోస్తున్న భూమిని హింసకు గురిచేస్తున్నాడు. రోజురోజుకూ భూమిలో ఉన్న సారాన్ని తగ్గించేస్తున్నాడు. అలా చేసి భూమిని నిర్జీవంగా, ప్రాణమొదిలేసిన మనిషిలా మారుస్తున్నాడు.
కానీ భూమి మనిషిలాంటిది కాదు. బిడ్డ ఎన్ని తప్పులు చేసినా తల్లి క్షమంచినట్టు భూమి కూడా మనుషుల్ని మన్నించేస్తోంది. కానీ….. తల్లి లోపల కుమిలిపోయినట్టు భూమి కూడా లోపల ఏడుస్తోంది. ఇదే నిజం మరి.
మనుషులు చేస్తున్న తప్పులు!!
అభివృద్ధి అనే పేరు వెంట తోకలా పట్టుకుని మనిషి భూమిని ఎన్ని విధాలుగా కావాలో అన్ని విధాలుగా నాశనం చేస్తున్నాడు.
వాటిలో మొదటిది చెట్ల నరికివేత. చెట్లను నరికివేయడం, సాగు భూములుగా మార్చడం మనిషి చేసిన మొదటి తప్పు. పోనీ దానివల్ల మనవాళికి ఆహారం లభిస్తోంది అనుకుంటే, సేంద్రియ వ్యవసాయం వల్ల భూమి బాగానే ఉంది అనుకున్నా సంతోషంగానే ఉండేవాళ్ళం ఏమో కానీ ఆ వ్యవసాయం కూడా రసాయనికం అయిపోయి భూమిని పూర్తిగా దాని సహజత్వాన్ని కోల్పోయి నిర్జీవంగా మార్చేస్తోంది. మనిషి రసాయనికత వైపు వెళ్లి భూమికి అన్యాయం చేస్తున్నాడు.
అదే కోవలోకి వచ్చే మరొక అంశం రియల్ ఎస్టేట్. కళ్ళు చెదిరే భవంతుల స్థానంలో పచ్చని వనాలు, తిండి గింజలు ఇచ్చే పంట పొలాలు అన్ని నిర్వీర్యమైపోయి ఉంటాయి. ఇంకా అవన్నీ పెకిలించి చదును చేసిన ఆ భూములు కూడా అంత పటిష్టంగా ఉండవు. అదే ప్రాంతాలలో అడ్డు అదుపు లేకుండా అడుగుల కొద్దీ బోర్లు వేయడం వల్ల భూమిలోపల ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
పారిశ్రామికత, రసాయనికత!!
పారిశ్రామిక విప్లవం. అబ్బో ఫ్యాక్టరీలు మాయాజాలం అంతా ఇంతా కాదు. అందులో వెలువడే వ్యర్థాలు అన్నీ నీటిలోకి వెళ్లి, భూమిలోకి ఇంకి భూమిని విషపూరితం చేయడం అన్ని చోట్లా జరుగుతూ ఉంది.
తప్పు దిద్దుకోవాలి!!
నిజంగా చేస్తున్న తప్పులను సరిదిద్దుకోవాలి. మొదట చేయాల్సింది మనిషికి కనిపించినంత మేర నేలను సిమెంట్ తో నింపేయకుండా సహజమైన మట్టితో ఉండనివ్వడం.
చెట్లను పెంచాలి. నిజానికి చెట్లను పెంచడం వల్ల ఆ చెట్ల ద్వారా భూమి సారవంతం అవ్వడమే కాదు, ఆ చెట్లు రాల్చే ఆకులు, ఆ చెట్ల మీద నివసించే పక్షుల మల, మూత్రాలు, రాలిపడే కాయలు, పండ్లు ఇట్లా అన్నీ నేలకు సహజమైన పోషకాలను సంధిస్తాయి. నిజానికి ఈ సహజమైన ఎరువులను ఉపయోగించి చేసే సేంద్రియ వ్యవసాయం వల్ల భూమి బాగుండటమే కాకుండా వాటి ద్వారా పండే పంటలు కూడా మనిషి ఆరోగ్యానికి మంచి చేస్తాయి.
ప్రకృతికి హాని చెయ్యని భూమిలో తొందరగా కలిసిపోయి భూమికి హాని చెయ్యని వాటిని ఉపయోగించాలి. ముఖ్యంగా భూమిలో ఎన్నేళ్లయినా కరగని ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టాలి. భూమికి సారాన్ని పెంచే సహజసిద్ద ఎరువులకు నిలయమైన ఆవులను పెంచాలి. ఆవు ఉన్న భూమి ఎప్పటికీ గొడ్రాలవ్వదు. బుట్టల్లోనూ, ప్లాస్టిక్ బకెట్ల లోనూ, డ్రమ్ములలోనూ మొక్కల్ని పెంచి మురిసిపోయే బదులు నేరుగా నేలలో ఓ చెట్టును పెంచినా మంచిదే.
ఒకటి మాత్రం నిజం. మనం ఎప్పుడైతే మన ఆలోచనలను మంచి దారిలో మళ్లించామో అప్పుడే భూమి నవ్వడం మొదలుపెడుతుంది. మన పనులను బట్టి పచ్చని పసిరిక మొలకలు మన దోసిట్లో పెడుతుంది.
◆వెంకటేష్ పువ్వాడ.