గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

వైసీపీ గుంటూరు-కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా ఉందని ఆరోపించిన ఆ పార్టీ, ఈ పరిస్థితుల్లో ఎన్నికలు ధర్మబద్ధంగా జరిగే అవకాశాలు లేవని పేర్కొంది. ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితులు లేనందను ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు  వైసీపీ నాయకుడు పేర్ని నాని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  

పాకిస్థాన్ తీవ్రవాదులను అరెస్టు చేసినట్లుగా వైసీపీ కార్యక్తలను వేధిస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో  ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్ కాట్ చేయాలని పార్టీ నిర్ణయించిందని పేర్కొన్నారు. స్వయంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారంటేనే రాష్ట్రంలో పాలన ఏ రీతిన  సాగుతోందో అవగతమౌతోందని పేర్ని నాని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.  

అయితే తెలుగుదేశం పార్టీ వైసీపీ బహిష్కరణ ప్రకటనను ఎద్దేవా చేసింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో కృష్ణా- గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో వైసీపీకి జీరో రిజల్ట్ వచ్చిందనీ, ఇప్పడు ఆ పార్టీకి ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు అభ్యర్థులే దొరకని పరిస్థితి ఉందని, అందుకే ఎన్నికలలో పోటీకి నిలబడకుండా పలాయనం చిత్తగిస్తోందనీ తెలుగుదేశం పేర్కొంది.