ఇలాంటి విద్య ప్రతి ఒక్కరికీ అవసరం!
posted on Nov 7, 2024 9:30AM
విద్యార్థులు ఆటలు, పాటలు, విహారయాత్రలకు స్వస్తి చెప్పి చదువుల తల్లి చెంతకు చేరే సమయం ఆసన్నమైంది. పాఠశాల చదువులు ముగించి కళాశాలకు పోయే విద్యార్థులు కొందరైతే, కళాశాల చదువులు పూర్తిచేసి విశ్వవిద్యాలయాలకు వెళ్ళేవారు మరికొందరు. అలాగే విశ్వవిద్యాలయాలకు వీడ్కోలు చెప్పి విదేశాలకెగసే విద్యార్థులు మరెందరో! గదులు మారి తరగతులు పెరిగినా, గతులు వేరై ఘనకార్యాలు సాధించినా… మేధావులు సృష్టించిన నేటి మన విద్యావిధానం మహాత్ముల్ని సృజించడంలో విఫలమవుతుంది. వైజ్ఞానికంగా ఎంత ఎదిగినా వివేకపథంలో వెనుకంజ వేస్తుంది. నేటి సమాజంలో సత్యధర్మాలు, సేవా త్యాగాల్లాంటి... విలువలు మానవతా గగనకుసుమా లయ్యాయి. సంఖ్యలకే ప్రాధాన్యతనిచ్చే విద్యతోపాటు నడవడికలో నాణ్యతను పెంచే విద్య చాలా అవసరం. అక్షరజ్ఞానంతో పాటు విజ్ఞానం తోడైనప్పుడే మానవతా విలువలు భాసిల్లుతాయి. చదువుతో పాటు సంస్కారాన్ని పెంచే విద్యే నిజమైన విద్య. బుద్ధిని వృద్ధిచేసే విద్యే నేటి సమాజంలోని అన్ని రుగ్మతలకు సరైన ఔషధం.
విద్యకు భూషణం వినయం...
విద్యార్థి గురువు వద్ద ఎలా అణకువతో ప్రవర్తించాలో శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతలో బోధించాడు.
తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ।
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వదర్శినః ॥
శిష్యుడు గురువు సన్నిధిలో ఉంటూ భక్తిశ్రద్ధలతో గురువుకు సపర్యలు చేస్తూ తన సందేహ నివృత్తి చేసుకోవాలి. శిష్యుని వినయ విధేయతలకు గురువు ప్రీతి చెంది శిష్యునికి జ్ఞానాన్ని ప్రబోధిస్తాడు.
పెద్దలయందు, గురువులయందు గౌరవమర్యాదలు లేనివాడు ఎన్నటికీ జీవితంలో ఉన్నతి పొందలేడు. అహంకారి అయిన దుర్యోధనునితో 'నువ్వు గురువులకు, పెద్దలకు వినయంతో సేవ చేయడం నేర్చుకో దాని వల్ల నీలో సత్ప్రవర్తన వృద్ధి చెందుతుంది' అని శ్రీకృష్ణుడు అంటాడు. విద్యార్థి గ్రంథాల ద్వారా నేర్చుకొనే దాని కన్నా గురువు సాంగత్యంలో నేర్చుకొనే విద్య ఎక్కువ ప్రయోజనాన్నిస్తుంది.
ఆచరించేవాడే ఆచార్యుడు...
ఆచార్య అంటే సంగ్రహించే వాడు. శాస్త్ర సారాన్ని సంగ్రహించి, విద్యార్థులకు బోధించేవాడు ఆచార్యుడు అని అర్థం. తాను సంగ్రహించిన వేదసారాన్ని శిష్యులకు ఆచరణలో చూపించిన వాడే ‘ఆచార్యుడు' అని మరో అర్థం. ఆచరణాత్మక బోధ నలతో ఆదర్శజీవితాన్ని గడిపి, శిష్యుల్లో మానవతా విలువల్ని పెంపొందించే వాడే నిజమైన ఆచార్యుడు.
విలువల్ని పెంచే విద్య...
నేడు మనకు కావలసిన విద్య ఎలా ఉండాలో స్వామి వివేకానంద మాటల్లో…
We want that education by which character is formed, strength of mind is increased, the intellect is expanded...
శీలనిర్మాణం, మనోబలం, విశాలబుద్ధి ఈ మూడు సుగుణాల్ని పెంపొందించే విద్య నేడు మనకు అవసరం. స్వామి వివేకానంద నిర్వచించిన విద్యలో ఉన్న మూడు లక్షణాలను విద్యార్థి అలవరచుకోవాలంటే తైత్తిరీయో పనిషత్తులో గురువు శిష్యులకిచ్చిన సూచనల్ని ఆచరణాత్మకం చెయ్యాలి.
◆నిశ్శబ్ద.