హ్యాపీ హోమ్!! స్వీట్ హోమ్!!

ఇదేమి కొత్త సినిమాలో పాట కాదు. అంతకు మించి ఏదో ప్రత్యేక దినానికి సంబంధించి స్లోగన్ కూడా కాదు. మరింకేమిటి అంటున్నారా??

ప్రతి ఇంట్లో సాధారణంగా ఇద్దరు అంతకు మించిన మనుషులు ఉండటం కామన్. ఇప్పుడంటే ఉమ్మడి కుటుంబాలు లేవు కానీ ఒకప్పుడు అబ్బో దాదాపు ఒకే ఇంట్లో పది నుండి  ముప్పై మంది, ఇంకా ఎక్కువే ఉన్న కుటుంబాలు బోలెడు ఉండేవి. ఇదంతా ఎందుకు అంటే అదే విషయమే ఇప్పుడు చెప్పేసుకుందాం. ప్రస్తుతం కుటుంబ నియంత్రణలో భార్య, భర్త, ఒకరు లేద ఇద్దరు పిల్లలతో ముచ్చటైన కుటుంబాలే ఎక్కడ చూసినా. అయితే ఉన్న నలుగురి మధ్యనో, లేదా ఐదుగురి మధ్యనో కూడా నిరంతరం యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఇవేమీ కత్తులు, కటార్లు పట్టుకుని చేయకపోయినా మనసుల మనసుల మధ్య జరిగే మాటల యుద్ధాలే. ఫలితంగా మాటా మాటా పెరిగి అవన్నీ తూటాల్లా మారి, ముచ్చటైన కుటుంబాలు బీటలు వారే పరిస్థితి వచ్చేస్తుంది. అలాంటివేమి జరగకుండా ఉండటానికి కొన్ని చిన్న జాగ్రత్తలు చాలు.

కాసింత కాంప్రమైజ్   

భార్యా భర్తలు అన్నాక సర్దుకుపోవడం కామన్. అయితే అమ్మాయిలకె దీన్ని ఎక్కువగా ఆపాదించేసి పెళ్ళవ్వగానే తన ఇష్టాలను తగ్గించుకుని భర్తకు తాగినట్టు ఉండటమే సమాజ ఆమోదమనే వేదంతాలు చెప్పేసి వాళ్ళను కంట్రోల్ లో పెడతారు చాలా మంది. అయితే ఇలాంటివి వాటి వల్ల జరిగేది ఏమిటంటే బయటకు సరేనని చెప్పినా మనస్ఫూర్తిగా మార్చుకోలేని ఇష్టాల వల్ల మానసికంగా కుంగిపోతారు అమ్మాయిలు. అలాంటి వాళ్ళు ఏదైనా కాస్త  ఎమోషనల్ సంఘటన జరగగానే ఒక్కసారిగా విస్ఫోటనం అయినట్టు తన బాధ తాలూకూ సంఘటనలు తాను చంపేసుకున్న ఇష్టాలు ఇలా అన్ని ఒక్కసారి గుర్తొచ్చి పెద్ద గొడవకు దారి తీస్తాయి. కాబట్టి అమ్మాయిలు మాత్రమే కాంప్రమైజ్ అవ్వాలనే నియామాన్ని పక్కన పెట్టి సందర్భానుసారంగా భార్యాభర్తలు ఇద్దరూ సర్దుకుపోవడం మంచిది. అలాగే పిల్లలు కూడా దీనికి అనుగుణంగానే నడుచుకుంటే కుటుంబంలో కలకలం ఏర్పడదు. 

కాసింత అండర్స్టాండింగ్ 

చాలా మంది విషయాన్ని అర్థం చేసుకోవడం కంటే అర్థతరంగా అట్లాగే వదిలేసి నిరసన వ్యక్తం చేస్తూ వెళ్ళిపోతారు. అయితే అసలు విషయంలో సమస్య ఏమిటి?? దాన్ని ఎలా పరిష్కారం చేసుకోవాలి. దాని వల్ల ప్రయోజనాలు, నష్టాలు ఇలాంటివన్నీ అందరూ కలసి మాట్లాడుకుంటే సమస్య తాలూకూ ప్రభావం ఎవరి మీద ఉండదు. తప్పుకోకుండా ఒప్పేసుకోండి ఏదైనా మీవైపు నుండి తప్పు జరిగితే దాన్ని నేరుగా ఇంట్లో వాళ్ళ ముందు ఒప్పేసుకుని, దాని వెనుక కారణాన్ని విడమరిచి చెప్పాలి. అప్పుడే ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. నాది కాదు అందరిదీ  ప్రతి ఒక్కరికి నాది అనే భావన ఉంటుంది. అయితే అన్ని విషయాల్లోనూ అదే పనికిరాదు. కొన్ని విషయాల్లో మన అనే భావన కుటుంబం మొత్తానికి ఎంతో బలాన్ని ఇస్తుంది. సమస్యల్లోనూ, ఇబ్బందుల్లోనూ ఇలాంటి బలమే అందరూ వాటిని అధిగమించేలా చేస్తుంది. మీకు మీకు మధ్య మీ ఇంటి సమస్యలు ఏవైనా ఉంటే వాటిని ఇంట్లో ఉంటున్న వాళ్ళు అంటే అందరూ కలసి మాట్లాడుకుని పరిష్కరించుకోవడం ఎంతో మంచిది. అంతే కానీ ఇరుగు పొరుగులను న్యాయం చెప్పే పెద్దలుగా మార్చేసి, చుట్టాలకు, స్నేహితులకు ఇంటి గొడవ గురించి చెప్పి తప్పెవరిది వంటి విషయాలు అడగకూడదు. 

ఫ్రెండ్లీ హోమ్ ట్రెండీ హోమ్ 

ప్రస్తుత తరాలకు తగ్గట్టు ఇంట్లో తల్లిదండ్రులు, పిల్లల మధ్య పేరెంట్స్, చిల్డ్రన్స్ అనే బంధం కంటే ఫ్రెండ్స్ అనే బంధమే ఆరోగ్యకరంగా ఉంటుంది. అలా ఉంటేనే పిల్లలు ప్రతిదీ తల్లిదండ్రులతో షేర్ చేసుకోగలరు. అంతే కాదు పిల్లలతో తల్లిదండ్రులు స్నేహితులుగా ఉండే కుటుంబంలో అర్థం చేసుకునే వాతావరణం మరియు ఒకరికోసం ఒకరం అనే భావన  ఎక్కువగా ఉంటుంది. 

ఆల్ ఈజ్ వెల్ 

పైన చెప్పుకున్నవి అన్ని మీ మీ కుటుంబాల్లో ఉన్నాయో లేదో సరిచూసుకుని లేకపోతే కుటుంబంలో అందరూ కలసి మాట్లాడుకుని మెల్లగా వాటిని ఫాలో అయితే ఆల్ ఈజ్ వెల్ అని హ్యాపీ గా స్లోగన్ చెప్పుకోవచ్చు.


                                                                                                                            ◆ వెంకటేష్ పువ్వాడ