ఇలా చేస్తే మీ రక్తపోటు తగ్గిపోతుంది

  రక్తపోటు మనకి రోజువారీ బంధువు. బీపీ సమస్యతో బాధపడే వారు ఇప్పుడు ఇంటికి ఒకరు కనిపిస్తున్నారు. పోషకాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటి మార్పులతో రక్తపోటుని అదుపులో ఉంచుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. నిజమే! కానీ ఈ మార్పులని నిత్యం పటించేది ఎవరు. ఒకవేళ ఆ విషయాలని నెట్లో నట్టింట్లో నిత్యం గుర్తుచేస్తూ, ప్రోత్సహిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన వచ్చింది కొందరికి... American College of Cardiologyకి చెందిన నిపుణులకి ఓ ఆలోచన వచ్చింది. రక్తపోటుతో బాధపడుతున్న రోగులని వెబ్సైటు ద్వారా దిశానిర్దేశం చేస్తే ఎలా ఉంటుంది? అన్నదే సదరు ఆలోచన. ఇందుకోసం వారు 57 సంవత్సరాల వయసున్న ఓ 264 మంది అభ్యర్థులను ఎన్నుకొన్నారు. వీరిలో అంతా 140/90 నుంచి 160/100 రక్తపోటు ఉన్నవారే! అభ్యర్థులందరికీ కూడా ఒక ఏడాది పాటు ఆరోగ్యానికి సంబంధించిన మెయిల్స్ పంపించారు. అయితే ఇలా మెయిల్స్ చేయడంలో ఒక తేడాని పాటించారు. కొంతమంది అభ్యర్థులకి రక్తపోటు, గుండెజబ్బులకి సంబంధించిన విశేషాలతో పాటుగా... వాటిని అదుపులో ఉంచేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేయడం మంచిది? వంటి సాధారణ వివరాలను అందించారు. ఇవన్నీ కూడా తరచూ మనకి వెబ్సైట్లలో కనిపించేవే. మరికొందరికి మాత్రం ఇంకాస్త జాగ్రత్తగా రూపొందిన మెయిల్స్ అందించారు. వీటిలో భాగంగా రకరకాల విశ్లేషణలు, సలహాలు, సందేహాలకు సమాధానాలు పొందుపరిచారు. రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తుల అనుభవాలు, విజయగాథలతో కూడిన వీడియోలను కూడా వీరికి అందించారు. అలాగే అభ్యర్థులు తమ జీవనశైలిలో ఎలాంటి మార్పులను తీసుకువస్తున్నారు, వారి ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారో నిరంతరం ఫీడ్ బ్యాక్ను అందించాల్సి ఉండేది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ అభ్యర్థులకు పంపిన మెయిల్స్ ఒక కౌన్సిలింగ్ రూపంలో సాగాయి. అందుకనే వీటికి e-Counseling అని పేరు పెట్టారు. ఒక ఏడాది గడిచిన తరువాత తాము మెయిల్స్ పంపిన అభ్యర్థుల రక్తపోటులో ఏమన్నా మార్పు వచ్చిందేమో గమనించారు పరిశోధకులు. ఆశ్చర్యకరంగా వారి రక్తపోటులో గణనీయమైన తగ్గుదల కనిపించింది. సాధారణ మెయిల్స్ స్వీకరించిన వ్యక్తుల రక్తపోటు 6 పాయింట్లు తగ్గితే, e-Counseling పొందిన అభ్యర్థుల రక్తపోటు 10 పాయింట్లు తగ్గింది. ఒక్కమాటలో చెప్పాలంటే రక్తపోటుకి మందు వేసుకుంటే ఎంత ప్రభావం ఉందో, e-Counseling వల్ల అంత ప్రభావం కనిపించింది. ఎక్కడో e-Counseling వల్ల రక్తపోటు తగ్గితే మనకేంటి ఉపయోగం అనుకోవడానికి లేదు. రక్తపోటుకి సంబంధించి ఏదో సాధారణ విషయాలు చదువుతూ ఉండిపోకుండా... ఎప్పటికప్పుడు వాటిని జీవితానికి అన్వయిస్తూ, మనలో వచ్చిన మార్పుని ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూ ఉంటే అద్భుతమైన మార్పులు సాధ్యమని ఈ పరిశోధనతో తెలిసిపోతోంది. - నిర్జర.    

read more
Online Jyotish
Tone Academy
KidsOne Telugu
స్పోర్ట్స్‌ డ్రింక్స్‌తో అనారోగ్యం!

  ఆటలంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఆ ఆటలలో అలసిపోతే కాస్త దాహం తీర్చుకోవాలని ఎందుకనిపించదు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఆటల మధ్యలో అలసట కలిగితే దాహం తీర్చుకునేందుకు స్పోర్ట్స్‌ డ్రింక్స్‌ అందుబాటులోకి వచ్చేశాయి. మోజుతోనో, దాహం తీరుతుందన్న నమ్మకంతోనో వీటిని తాగేవారి సంఖ్య ఎక్కువైపోతోంది. కొన్నాళ్లు పోతే కూల్‌డ్రింక్స్‌ తాగినంత తేలికగా స్పోర్ట్స్‌ డ్రింక్స్ తాగే రోజులు వచ్చేస్తాయి. ఇంతకీ వీటి వల్ల ఉపయోగమేనా అంటే... కొంచెం ఆలోచించాల్సిందే మరి!     - అధికంగా వ్యాయామం చేసినప్పుడో, ఆటలు ఆడినప్పుడో... అలసిపోయేవారి శరీరంలో తిరిగి కావల్సిన నీటిని, శక్తిని అందించడమే ఈ స్పోర్ట్స్‌ డ్రింక్స్‌ లక్ష్యం. కానీ అలా తీవ్రంగా అలసిపోయే ప్రొఫెషనల్ ఆటగాళ్లకి మాత్రమే ఈ పానీయాలు ఉపయోగపడతాయనీ, మిగతావారికి అనవసరమనీ హెచ్చరిస్తున్నారు నిపుణులు.   - అధిక శక్తిని ఇచ్చేందుక స్పోర్ట్స్‌ డ్రింక్స్‌లో మోతాదుకి మించి చక్కెర పదార్థాలు ఉంటాయి. ఈ చక్కెర వల్ల పళ్లు దెబ్బతినడం ఖాయమంటున్నారు నిపుణులు. ఒక పరిశోధన ప్రకారం, ఈ పానీయాలు తాగినవారిలో దాదాపు 98 శాతం మంది పంటి పై పొర దెబ్బతిన్నట్లు తేలింది. పంటి పై పొర దెబ్బతింటే అది తిరిగి సరికావడం అంటూ ఉండదు. అంటే స్పోర్ట్స్‌ డ్రింక్స్‌ వల్ల పంటికి శాశ్వతమైన నష్టం కలుగుతుందన్నమాట.   - వీటిలోని అధిక చక్కెరల వల్ల త్వరగా ఊబకాయం వచ్చే ప్రమాదం ఉందని తేలింది. వ్యాయామం వల్ల కోల్పోయే శక్తికంటే వీటి నుంచి లభించే శక్తి అధికంగా ఉండటంతో, అదంతా కొవ్వు కిందకి పేరుకుకోవడం సహజమే కదా!   - పెద్దల పరిస్థితే ఇంత దారుణంగా ఉంటే ఇక పిల్లల సంగతి చెప్పేదేముంది! ఈ స్పోర్ట్స్‌ డ్రింక్స్‌కి అలవాటు పడిన పిల్లలో 90 శాతం మంది పిల్లల పళ్లు దెబ్బతినిపోయినట్లు తేలింది. పైగా ఈ స్పోర్ట్స్‌ డ్రింక్స్‌ తియ్యగా ఉండటంతో పిల్లలకి ఇది ఒక వ్యసనంలా తయారవుతోందట.   - వ్యాయామం చేసేటప్పుడు శరీరం నుంచి కొంత నీరు చెమట రూపంలో బయటకి పోవడం మంచిదే! కానీ స్పోర్ట్స్‌ డ్రింక్స్‌లో ఉండే సోడియం, పొటాషియం వంటి పదార్థాల వల్ల ఇలా శరీరం నుంచి మలినాలు బయటకు పోకుండా ఉండిపోతాయి.   - స్పోర్ట్స్‌ డ్రింక్స్‌ చల్లగా తియ్యగా ఉండటంతో కాస్త తాగగానే దాహం తీరినట్లు అనిపిస్తుందే కానీ, శరీరానికి అవసరమైన నీరు లభించదు. దీంతో శరీరానికి తగినంత నీటిని అందించడం అనే అసలైన లక్ష్యం నెరవేరకుండా పోతుంది.   - ఈ పానీయాలలో సోడియం నిల్వలు మోతాదుకి మించి ఉంటాయి. మన రోజువారీ ఆహారంలో తీసుకునే సోడియం (ఉప్పు) శాతమే ఎక్కువగా ఉందంటూ వైద్యులు గోలపెడుతున్నారు. వాటికి ఈ స్పోర్ట్స్‌ డ్రింక్స్‌ కూడా తోడైతే ఇక చెప్పేదేముంది. ఇలా స్పోర్ట్స్‌ డ్రింక్స్‌ని అధికంగా తీసుకోవడం వల్ల వాటిలో ఉండే సోడియం అధిక రక్తపోటుకీ, గుండెజబ్బులకీ దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.   - స్పోర్ట్స్‌ డ్రింక్స్‌లో చక్కెర, సోడియం, పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ వంటి పదార్థాలే కానీ విటమిన్లు, ఖనిజాల వంటి పోషక పదార్థాలు ఉండవు. అందుకని శరీరానికి శక్తి లభిస్తుందన్న మాటే కానీ బలం చేకూరదు.   వీటన్నింటివల్లా... సాధారణ వ్యాయామం చేసేవారికి స్పోర్ట్స్‌ డ్రింక్స్‌ వల్ల పెద్దగా ఉపయోగం లేదనీ... వాటికంటే మంచినీరు, పాలు, కొబ్బరిబోండాలు, పళ్లరసాలు తీసుకోవడం మేలనీ అర్థమవుతోంది. గంట లోపల వ్యాయామం చేసేవారు కాస్త మంచినీరు పుచ్చుకుంటే సరిపోతుందని మేయో క్లినిక్‌ వంటి సంస్థలు సైతం సూచిస్తున్నాయి.   - నిర్జర.

read more
మీ పిల్లలు ఫోన్‌ చూస్తూ నిద్రపోతున్నారా!

ఒకప్పుడు పిల్లల్ని నిద్రపుచ్చేందుకు కథలో కబుర్లో చెబితే సరిపోయేది. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది కథలు చెప్పే ఓపిక పెద్దలకీ లేదు, కబుర్లు వినే ఉత్సాహం పిల్లవారికీ లేదు. ఇప్పుడంతా డిజిటల్‌మయం. కాసేపు ఫోనో, టీవీనో, టాబ్లెట్టో చూసీచూసీ అలసి నిద్రలోకి జారుకుంటున్నారు పిల్లలు. ఇదేమంత మంచి అలవాటు కాదని అందరికీ తెలుసు కానీ ఎంత హానికకరం అన్నదాని మీద ఇప్పుడిప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. 20 పరిశోధనల సారం లండన్‌లోని కార్డిఫ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు పిల్లల ఆరోగ్యం, అలవాట్ల మీద జరిగిన దాదాపు 20 పరిశోధనలను క్షుణ్నంగా పరిశీలించారు. ఇందులో భాగంగా 14 ఏళ్ల సగటు వయసున్న లక్షాపాతికవేల మంది పిల్లల సమాచారాన్ని గమనించారు. ఈ పరిశీలనలో పిల్లల మీద డిజటల్‌ మాధ్యమాల ప్రభావం గురించి అనేక విషయాలు వెల్లడయ్యాయి. మంచం దగ్గరే 72 శాతం మంది పిల్లలు తమ మంచం దగ్గరే ఏదో ఒక డిజిటల్‌ పరికరాన్ని ఉంచుకుని నిద్రపోతున్నట్లు తేలింది. వీరిలో నిద్రపోయేందుకు ఒక 90 నిమిషాల ముందువరకు ఫోన్‌ చూస్తూ గడిపిన పిల్లల్లో 79 శాతం మంది నిద్రలేమితో బాధపడటాన్ని గమనించారు. ఒకవేళ నిద్రపట్టినా కూడా 46 శాతం మంది పిల్లలు కలతనిద్రలోనే గడపాల్సి వచ్చింది. ఇలా సరైన నిద్ర లేకపోవడంతో, వీరంతా ఉదయం వేళల్లో మత్తుతో తూగిపోవడం మొదలుపెట్టారట. నిద్రే కాదు పిల్లల ఎదుగుదలలో నిద్ర ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది. అలాంటి నిద్రే కనుక దూరమైతే వారు రకరకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం, ఉద్రేకంగా ప్రవర్తించడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, ఊబకాయం, ఎదుగుదల సమస్యలు, మానసికమైన లోపాలు... వంటి సమస్యలన్నీ కూడా ఆ పిల్లవాడిని చుట్టుముడతాయని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. కారణం ఇదీ! ఫోన్, టాబ్లెట్‌, టీవీ వంటి పరికరాల నుంచి వచ్చే వెలుతురు మన శరీరంలోని మెలటోనిన్‌ అనే హార్మోనుని ప్రభావితం చేస్తుందట. మనలోని జీవగడియారాన్ని నియంత్రించే ఈ హార్మోనుని అడ్డుకోవడం వల్ల శరీరానికి నిద్రపోవాలన్న సూచన అందదు. చివరికి అది నిద్రలేమి అనే ఓ విషవలయానికి దారితీస్తుంది. ఇక డిజిటల్‌ పరికరాలతో ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియాలో మునిగిపోవడం, గేమ్స్ ఆడటం, చాటింగ్‌ చేయడం వంటి చర్యల వల్ల పిల్లలోని ఉద్విగ్న స్థాయి పెరిగిపోతుంది. దాని వల్ల కూడా నిద్ర కరువవుతుంది. అంతేకాదు! ఒకవేళ ఫోన్ పక్కన పెట్టేసినా కూడా, మనసు దాని చుట్టూనే తిరిగే అవకాశం ఉందంటున్నారు. వాట్సప్‌లో ఎవరన్నా మెసేజ్‌ పంపి ఉంటారా! ఫేస్‌బుక్‌లో నేను పెట్టిన పోస్టుకి కామెంట్స్‌ ఏవన్నా వచ్చి ఉంటాయా! వంటి సవాలక్ష సందేహాలతో పిల్లల మెదడు మేలుకొనే ఉంటుంది. కాబట్టి రాత్రివేళల్లో పిల్లలు ఫోన్ల వ్యాపకానికి బానిసలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పెద్దలదే. బహుశా అదేమంత కష్టమైన పని కాదేమో! ముందు పెద్దవారు తమ చేతిలో ఉన్న ఫోన్లను పక్కన పెట్టి కాస్త పిల్లలతో మాట్లాడటం మొదలుపెటడితే... పరిస్థితులు సగం దారికి వస్తాయి.     - నిర్జర

read more
రక్తపోటు గురించి కొత్త విషయాలు

  ఇవాళా రేపట్లో అధిక రక్తపోటు అనేది సాధారణం అయిపోయింది. మారుతున్న జీవనశైలి వల్లనో లేకపోతే ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరగడం చేతనో... ఇప్పుడు ఎవరిని కదిపినా రక్తపోటు గురించి తెగ కబుర్లు చెప్పేస్తున్నారు. ఇంకా మాట్లాడితే భయపెట్టేస్తున్నారు. కానీ నిజానికి రక్తపోటును అదుపులో ఉంచుకోవడం ఏమంత బ్రహ్మవిద్య కాదంటూ మధ్యమధ్యలో కొన్ని నివేదికలూ స్పష్టం చేస్తున్నాయి. AARP అనే ఒక వైద్య పరిశోధనా పత్రిక ఇటీవల ప్రచురించిన ఒక నివేదికే ఇందుకు ఉదాహరణ. వాటిలో ముఖ్య అంశాలు ఇవిగో....   చిన్నపాటి వ్యాయామం:  చేతితో నొక్కే చిన్నపాటి వ్యాయామ పరికరం ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడే మనకు కనిపిస్తోంది. ఈ HAND GRIPPER తో వ్యాయామం చేస్తే దాదాపు 10 శాతం రక్తపోటు తగ్గిపోతుందట. ఈ విషయాన్ని నిరూపించేందుకు 2013లో ఒక పరిశోధన కూడా జరిగిందని చెబుతోంది AARP. దీని ప్రకారం చేతికి ఒత్తిడి కలిగించే ఈ వ్యాయామాన్ని రెండు నిమిషాల చొప్పున పావుగంట పాటు... వారానికి మూడుసార్లు చేస్తే కనుక రక్తపోటులో గణనీయమైన మార్పులు వస్తాయట. బహుశా రక్తపోటుని నివారించుకునేందుకు ఇంతకంటే చవకైన సులువైన ఉపాయం దొరకదేమో!   రక్తపోటు అనివార్యం:  చాలామంది, ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన పెద్దవారు రక్తపోటు వచ్చిందనగానే కంగారుపడిపోతూ ఉంటారు. నిజానికి వయసుతో పాటుగా రక్తపోటు పెరగడం సహజమే అంటోంది AARP నివేదిక. వయసు పెరిగేకొద్దీ మన రక్తనాళాలు గట్టిపడిపోతాయనీ, దీనివల్ల మన రక్తపోటులో హెచ్చుతగ్గులు కనిపిస్తాయని చెబుతోంది. అందుకే మన పెద్దలు 100+ మన వయసుని రక్తపోటు కోసం పరిగణలోకి తీసుకునేవారని గుర్తుచేస్తోంది.   శ్వాసలో మార్పు తెస్తే:  రక్తపోటు కనుక ఎక్కువగా ఉందని అనిపిస్తే ఊపిరిని కాస్త నిదానంగా పీల్చమని చెబుతోంది AARP. మన శ్వాసని కనుక నిమిషానికి 12 సార్లకు తగ్గించగలిగితే తాత్కాలికంగా అయినా రక్తపోటు తగ్గుముఖం పడుతుందని వివరిస్తోంది. ఇలా చేయడం వల్ల మన రక్తపోటులో అప్పటికప్పుడు ఒక మూడు పాయింట్ల తగ్గుదల కనిపించే అవకాశం ఉందట!   మందుల విషయంలో జాగ్రత్త!  రోజువారీ జలుబు, నొప్పులకు వాడే మందులు కూడా రక్తపోటు మీద ప్రభావం చూపించే అవకాశం ఉందంటున్నారు. సాధారణంగా మనం ఇలాంటి సమస్యలకు దగ్గరలో ఉన్న మందుల షాపుకి వెళ్లిపోయి ఏ మందు ఇస్తే ఆ మందుని వాడేస్తూ ఉంటాము. కానీ ఒకోసారి ఇవే మన రక్తపోటు మీద ప్రతికూలంగా వ్యవహరించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి రక్తపోటు ఉన్నవారు సాధారణ ఆరోగ్య సమస్యల వచ్చినప్పుడు ఏ మందులు తీసుకోవచ్చునో ముందుగానే తమ వైద్యుని దగ్గర తెలుసుకుని ఉండమని సూచిస్తున్నారు.   నాలుక చేసే మోసం:  రక్తపోటు ఉన్నవారు వీలైనంత తక్కువ ఉప్పుని తీసుకోవాలన్న సూచనలు తరచూ వినిపించేవే! కానీ ఇందులో మరో కోణం కూడా ఉందట. వయసు పెరిగే కొద్దీ, నాలుకలో రుచిని గ్రహించే శక్తి తగ్గిపోతుందనీ... కాబట్టి చాలామంది పెద్దలు తాము ఎంత ఉప్పుని తీసుకుంటున్నామో తెలియని అయోమయంలో ఉంటారనీ AARP విశ్లేషిస్తోంది. పైగా బేకరీ వంటి పదార్థాలు రుచిగా ఉండటానికీ, అందులో విచ్చలవిడిగా వాడే ఉప్పే కారణం అని చెబుతున్నారు. కాబట్టి వయసు మీరుతున్న ఉప్పు విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. - నిర్జర.

read more
పిల్లల గుండెతీరు బాగుండటం లేదు!

  పుట్టిన పిల్లలు ఇంచుమించుగా ఒకే తరహా ఆరోగ్యంతో పుడతారు. కానీ రానురానూ వారి జన్యు నిర్మాణం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. పుట్టుకతో వచ్చిన జన్యువుల ప్రభావాన్ని మన పెద్దగా నివారించలేకపోవచ్చు. కానీ అనారోగ్యకరమైన జీవనశైలితో వారు రోగాల దిశగా వెళ్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం! ఇవే విషయాన్ని ‘అమెరికన్‌ హార్ట్ అసోసియేషన్‌’ స్పష్టం చేస్తోంది. ఆ సంస్థ ప్రచురిస్తున్న ఒక జర్నల్‌లో నేటి పిల్లలు గుండెజబ్బులకు ఎలా సిద్ధమవుతున్నారో హెచ్చరిస్తోంది.   ఇదీ పరిశోధన మినెసొటా విశ్వవిద్యాలయానికి చెందిన జూలియా స్టెయిన్‌బర్గర్ అనే పిల్లల వైద్యుని నేతృత్వంలో ఈ పరిశోధన జరిగింది. ఇందులో భాగంగా 2007-08 సంవత్సరంలో అమెరికాలోని పిల్లల ఆహారపు అలవాట్ల గురించి చేసిన సర్వేలోని గణాంకాలన్నింటినీ పరిశీలించారు. వీటిని పిల్లల బరువు, వారి వ్యాయామపు అలవాట్లు, ఆహారం, శరీరంలో కొవ్వు శాతం, రక్తంలో చక్కెర నిల్వలు... వంటి ఏడు కొలబద్దల ఆధారంగా విశ్లేషించారు.   ఇదీ ఫలితం - పిల్లల్లో దాదాపు 91 శాతం మంది సరైన ఆహారాన్ని తీసుకోవడం లేదని తేలింది. వీరి ఆహారంలో ఎక్కువగా చక్కెర అధికంగా ఉన్న పదార్థాలూ, శీతలపానీయాలే ఉన్నట్లు తేలింది.   - ఈ చక్కెర పదార్థాలు ఒక ఎత్తైతే.... పోషక విలువలు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, చేపలు, తృణధాన్యాలు వంటి ఆహారాన్ని దూరంగా ఉంచడం మరో ఎత్తు అంటున్నారు స్టెయిన్‌బర్గర్.   - ఆడుతూ పాడుతూ ఉండాల్సిన వయసులో కూడా చాలామంది పిల్లలలో తగిన శారీరిక వ్యాయామమే ఉండటం లేదన్నది మరో ఆశ్చర్యకరమైన ఫలితం. ఇక 16 ఏళ్లు దాటిన వారిలో అయితే శారీరిక శ్రమ, వ్యాయామం అన్న లక్షణాలే కనిపించడం లేదట!   - టీనేజి దశలోకి చేరుకున్న అమెరికన్‌ పిల్లల్లో దాదాపు మూడోవంతు మంది పొగతాగే వ్యసనానికి లోనవుతున్నారని తేలింది. ఇలాంటి అలవాట్లు అన్నింటివల్లా నాలుగో వంతు పిల్లలు ఊబకాయులుగా మారిపోతున్నారు; మూడోవంతు మంది పిల్లల్లో కొలెస్ట్రాల్‌ నిల్వలు అధికంగా ఉన్నాయి; టీనేజిలో ఉన్న 37% మంది మగపిల్లల్లో చక్కెర నిల్వలు కూడా అధికంగా నమోదవుతున్నాయి. ఏతావాతా స్టెయిన్‌బర్గర్ బృందం పరిశీలించిన గణాంకాల ప్రకారంగా, కేవలం ఒకే ఒక్క శాతం మంది పిల్లలు ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగిస్తున్నారు!   ఇదీ నివారణ పిల్లల జీవన విధానం కనుక ఇలాగే కొనసాగితే మున్ముందు వారిలో గుండెజబ్బులు వచ్చే అవకాశం చాలా తీవ్రంగా ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అందుకోసం ఇప్పటికైనా మేలుకొమ్మని... మేలుకొని కొన్ని నివారణ చర్యలు మొదలుపెట్టమని సూచిస్తున్నారు. అవేమిటంటే...   - పిల్లల్లో సిగిరెట్‌ అలవాటు వారి ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. కాబట్టి సిగిరెట్‌ అలవాటుని వారి దరి చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.   - వారి ఎత్తుకి తగిన బరువు ఉన్నారో లేదో ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి.   - పిల్లల దినచర్యలో కనీసం ఒక గంట సేపైనా శారీరిక శ్రమ ఉండేలా చర్యలు తీసుకోవాలి.   అన్నింటికీ మించి, ఎప్పటికప్పుడు వారికి తగిన పోషక పదార్థాలు అందేలా జాగ్రత్త పడాలి. ఫాస్ట్‌ఫుడ్స్‌, చక్కెర అధికంగా ఉండే పదార్థాలు, శీతల పానీయాలు... వంటి పదార్థాల మోతాదు తగ్గిస్తూ వాటి స్థానంలో పోషక విలువలుండే సంప్రదాయ ఆహారాన్ని చేర్చాలి. లేకపోతే అమెరికన్లయినా, భారతీయులైనా అపసవ్యమైన జీవన విధానం ఎవరికైనా చేటు చేయక తప్పదు కదా!   - నిర్జర.

read more
టీనేజిలోనే మానసిక వ్యాధులు!

  పిల్లలు ఎప్పటికీ పిల్లలుగానే ఉండిపోరు. వారు ఎదుగుతుంటారు. రెక్కలు చాచుకుని ఎగురుతుంటారు. యుక్తవయసుకి రాగానే వాళ్లకి స్వేచ్ఛతో పాటుగా సామాజిక సమస్యలూ మొదలైపోతాయి. ఇలాంటి సందర్భంలోనే వారిలో మానసిక వ్యాధులూ బయటపడితే...   ఓ పరిశోధన!  ఇంగ్లండులోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం, లండన్ కాలేజి విశ్వవిద్యాలయం కలసి ఈ మధ్యనే ఒక పరిశోధన చేశాయి. ఇందులో భాగంగా 14 నుంచి 24 సంవత్సరాల వయసు ఉన్న దాదాపు 300 మందిని ఎన్నుకొన్నారు. MRI పరీక్షల ద్వారా వారి మెదడు పనితీరుని నమోదు చేశారు.   ఫలితం!  MRI పరీక్షలు జరిపిన కుర్రవాళ్ల మెదళ్లలో చూపు, వినికిడి వంటి నేర్పుకి సంబంధించిన భాగాలన్నీ అప్పటికే ఒక పరిపూర్ణతకు చేరుకున్నాయి. కానీ ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం వంటి క్లిష్టమైన చర్యలకు తోడ్పడే భాగాలు మాత్రం విపరీతమైన మార్పులకు లోనవుతున్నాయి. అంటే మెదడు నిర్మాణంలో ఎలాంటి వృద్ధి లేకున్నా, అది పనిచేసే తీరులో మాత్రం ఇంకా సర్దుబాట్లు జరుగుతూనే ఉన్నాయన్నమాట!   వ్యాధుల ఉనికి:  ఇక పరిశోధకులను ఆందోళనకు గురి చేసిన మరో అంశం... స్కిజోఫ్రీనియా వంటి వ్యాధులను రెచ్చగొట్టే కొన్ని రకాల జన్యువుల ఈ దశలోనే తమ ఉనికిని చాటుకోవడం. పైగా ఆలోచనా తీరుని ప్రభావితం చేసే ‘మేలిన్‌’ అనే పొర మరింత బలపడుతున్నట్లు కూడా తేలింది. మెదడు ఉపరితలం మీద ఉండే ఈ మేలిన్‌, మెదడులోని నాడీకణాలు మరింత చురుకుగా సమాచారాన్ని అందించుకునేందుకు దోహదపడుతుంది.   ఎందుకిలా! తీవ్రమైన మానసిక వ్యాధులకు సంబంధించిన లక్షణాలు ఇలా యుక్తవయసులోనే ఎందుకు బయట పడుతున్నాయి అన్న ప్రశ్నకి స్పష్టమైన సమాధానాలైతే లేవు. కానీ జన్యువులు, పెరిగిన వాతావరణం, చిన్నతనంలో ఎదుర్కొన్న ఒత్తిడి వల్ల... ఒక వయసుకి చేరుకునేనాటికి రకరకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని మాత్రం ఊహిస్తున్నారు. చాలామంది యుక్తవయస్సులో క్రుంగుబాటుకి లోనుకావడానికి కారణం... మెదడులో ఒక్కసారిగా బయటపడే ఈ మార్పులే అంటున్నారు.   మరేం చేయడం: యుక్తవయసులో ఉన్న కుటుంబీకుల మానసిక స్థితిని కాస్త జాగ్రత్తగా అంచనా వేస్తుండాలి. వారిలో పూర్తి అసహజంగా కనిపించే ప్రవర్తన ఏదన్నా కనిపించినప్పుడు వారితో మాట్లాడటం, వైద్యులను సంప్రదించడం వంటి చర్యలు తీసుకోవడంలో భేషజాలకు పోకూడదు. వారిలో మానసికమైన వ్యాధులు తలెత్తే అవకాశం ఉంది అని పరీక్షలలో తేలినప్పుడు, మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు పరిశోధకులు. తరచూ వైద్యులను సంప్రదించడం, జీవనశైలిలో మార్పులు తీసుకురావడం, అవసరమైతే చికిత్స తీసుకోవడం ద్వారా వ్యాధుల దాడిని వీలైనంత దూరానికి నెట్టేయవచ్చని ఆశిస్తున్నారు.   -నిర్జర.  

read more
యోగా మంచిదే కానీ...

యోగా మంచిదే! ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరు. కానీ ప్రతి శాస్త్రానికీ ఉన్నట్లే యోగాను ఆచరించేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి వాటిని కనుక విస్మరిస్తే ఇబ్బందులు తప్పవు. యోగాసనాలు వేయాలనుకునేవారు వాటికి సంబంధించి కొన్ని జాగ్రత్తలను కూడా గుర్తుంచుకుంటే మంచిది.   గురుముఖత: యోగాసనాలు ఎలా వేయాలో చెప్పేందుకు సవాలక్ష మార్గాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. డీవీడీలు, పుస్తకాలు, వెబ్‌సైట్లు, ఆఖరికి లైవ్‌ షోలు కూడా యోగాసనాల గురించి మార్గనిర్దేశనం చేస్తూ ఉంటాయి. కానీ యోగాను ఏదో కాలక్షేపంగా కాకుండా పూర్తి నిబద్ధతతో నేర్చుకోవాలనుకునేవారు మంచి యోగా గురువుని ఆశ్రయించడం మంచిది. దీని వల్ల భంగిమల్లో మనం చేసే చిన్న చిన్న తప్పులను వారు నివారించే అవకాశం ఎలాగూ ఉంటుంది. పైగా మన వ్యక్తిత్వం, జీవనశైలి, ఆరోగ్య సమస్యలకు అనుగుణంగా గురువులు తగిన యోగాసనాలను వ్యక్తిగత శ్రద్ధతో నేర్పించే అవకాశం ఉంటుంది. ఆహారం: యోగా నేర్చుకునేటప్పుడు వీలైనంత సాత్విక ఆహారం, మరింతగా మంచినీరు తీసుకోవాలి. శరీరాన్ని త్వరగా స్వస్థత పరిచేందుకు, మలినాలను తొలగించేందుకు ఇది చాలా అవసరం. కానీ భోజనం చేసిన వెంటనే యోగాసనాలు వేయడం ఏమాత్రం మంచిది కాదు. దీనికి రెండు కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి- యోగాసనాలు ఎప్పుడూ కూడా రక్తప్రసారం మీదే ఆధారపడతాయి. భోజనం చేశాక రక్తప్రసారం అంతా కూడా జీర్ణవ్యవస్థ వద్ద కేంద్రీకృతం అవుతుంది కాబట్టి, అసలుకే మోసం వస్తుంది. రెండు- యోగాసనాలలో ఎక్కువ శాతం ఉదరభాగం మీద ఆధారపడి ఉంటాయి కనుక, పొట్ట మీద అదనపు భారం మోపినట్లు అవుతుంది. వజ్రాసనం వంటి ఒకటి రెండు ఆసనాలకే ఇందుకు మినహాయింపు ఉంది.   ఆరోగ్యం: కొన్ని కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఆసనాలకు దూరంగా ఉండాలి. ఉదాహరణకు గుండెజబ్బులు ఉన్నవారు శీర్షాసనానికి దూరంగా ఉండాలి. అలాగే ఆస్తమా, రక్తపోటు, స్పాండిలైటిస్ ఉన్నవారు గురువుల సలహా మేరకే ఆసనాలను వేయాలి. ఇక గర్భిణీ స్త్రీలు, రుతుక్రమంలో ఉన్నవారు, జ్వరంతో బాధపడుతున్నవారు.... ఇలా శరీర స్థితిని బట్టి కూడా ఆసనాల విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.   ప్రాణాయామం: ఆసనాల విషయంలో ఎంత జాగ్రత్తను వహిస్తామో ప్రాణాయామం విషయంలో అంతే జాగ్రత్తను తీసుకోవలసి ఉంటుంది. గాలి, వెలుతురు, వాతావరణం... ప్రాణాయామం చేసేటప్పుడు ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. మన ఆరోగ్య పరిస్థితిని బట్టి కూడా చేయాల్సిన ప్రాణాయామం మారుతుంది. ఉదాహరణకు అధిక రక్తపోటు ఉన్నవారు కపాలభాతిని చేస్తే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే!   తొందరపాటు: యోగాను నేర్చుకోవడం మొదలుపెట్టగానే త్వరత్వరగా ఆసాంతం నేర్చేసుకోవాలన్న తొందర చాలామందికి ఉంటుంది. అందుకనే శరీరం పూర్తిగా అలవాటు పడకుండానే త్వరత్వరగా ఆసనాలను వేయడం, ప్రారంభంలోనే కష్టమైన ఆసనాలను ప్రయత్నించడం చేస్తుంటారు. వీటి వల్ల కాళ్లు బెణకడం దగ్గర నుంచి వెన్ను దెబ్బతినడం వరకూ ఏ ప్రమాదమైన సంభవించవచ్చు. ‘ఆసనాలు వేశాం కదా, అదే సర్దుకుంటుందిలే’ అని తేలికగా తీసుకోకుండా, వాటిని ఆచరించే సమయంలో ఏదన్నా సమస్య తలెత్తితే వెంటనే వైద్యుని సంప్రదించాలి. - నిర్జర.  

read more
అలసందలంటే అలుసా

అలసందలు - వీటినే బొబ్బర్లు అని కూడా అంటారు. నవధాన్యాలలో ఒకటైన అలసందలలో పోషకవిలువలు అమోఘంగా ఉంటాయి. వీటిలో కాలరీలు తక్కువగా ఉండటం వల్ల లో కాలరీ ఫుడ్ గా పేరు పొందాయి. అలాగే పీచుపదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియకు మంచిది. షుగర్ పేషెంట్స్ కి అద్భుతమైన ఆహారం.   ఇంతకీ ఇందులో దాగి ఉన్న గుణాలు ఏంటో చూద్దామా? ఈ బొబ్బర్లలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే కొన్ని రకాల వ్యాధులను నివారించడంలోనూ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉంచడంలోనూ సహాయపడతాయి. అంతే కాదు శరీరంలో వైరస్ వ్యాప్తి చెందకుండా హానికరమైన టాక్సిన్స్ ను కూడా నియంత్రిస్తాయి.     అలసందలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలసందల్లో అధిక ఫైబర్ కలిగి ఉండటం వల్ల కడుపులో అనుకూల ప్రభావంను కలిగి ఉండి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. పొట్ట అసౌకర్యాన్ని నివారిస్తుంది . మలబద్దకాన్ని నివారించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.   వీటిలో పుష్కలంగా లభించే విటమిన్ k మెదడు చురుగ్గా పనిచేయటంలో దోహదపడుతుంది. అంతేకాక నరాలకు కూడా బలాన్నిస్తుంది. బొబ్బర్లలో ఉండే ఐరన్,మెగ్నీషియం మన ఎనర్జీ లెవెల్స్ పెరిగేలా చేస్తాయి.   ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తాయి. ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్స్, మినిరల్స్ పొటాషియం గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. ఒంట్లో కొవ్వు తగ్గాలి అనుకునే వాళ్ళు రోజుకో కప్పు నానబెట్టి ఉడికించిన అలసందలు తింటే కొన్ని రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది.   అలసందల్లో గ్లిజమిక్స్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. మధుమేహంతో బాధపడే వారికి లోగ్లిజమిక్ ఇండెక్స్ కలిగిన అలసందలు చాలా ఆరోగ్యకరం . ఇవి బ్లడ్ షుగర్ లెవల్స్ ను నార్మల్ గా ఉంచడంలో సహాయపడతాయి. వీటిని తినటం వల్ల  కడుపు బరువుగా ఉండి ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. లావుగా ఉంది సన్నగా తయారనుకునేవారు కూడా వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఆ తేడాను గమనించచ్చు.   ఇన్ని విధాలుగా  ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అలసందలని అలుసుగా చూడకుండా రోజువారి ఆహారంలో తింటూ ఉంటే మనకి ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా లభిస్తుంది.    ...కళ్యాణి

read more
క్యాబేజీ... ఖావోజీ...

  క్యాబేజీ అనగానే మొహం చిట్లిస్తారు చాలామంది. రుచిగా వుండదని దూరంగా పెడతారు. అది ఉడికేటప్పుడు వచ్చే వాసన కూడా నచ్చడు చాలామందికి. కానీ, క్యాబేజీ మన ఆరోగ్యానికి ఎంతో మంచిదని, ఇందులో ఎన్నో పోషకాలు వున్నాయని చెబుతున్నారు పౌష్టికాహార నిపుణులు. పైగా ఇందులో కేలరీలు చాలా ఎక్కువ. పోషకాలు ఎక్కువే:- క్యాల్షియం, ఐరన్, అయోడిన్, పొటాషియం, సల్ఫర్, ఫాస్పరస్ వంటివి క్యాబేజీలో సమృద్ధిగా వుంటాయి. ఇక విటమిన్ల విషయానికి వస్తే విటమిన్ ‘ఎ’ నుంచి ‘బి’, ‘సి’, ‘ఇ’, ‘కె’, ఫోలిక్ యాసిడ్లు ఇందులో ఎక్కువగానే వుంటాయి. యాంటీ బ్యాక్టీరియల్ గుణం ఎక్కువ:- క్యాబేజీకి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు వున్నాయి. అందుకే అమెరికన్ క్యాన్సర్ సంస్థ అత్యుత్తమ స్థాయిలో సిఫారసు చేసిన కూరగాయల్లో క్యాబేజీ  ఒకటి. ఇందులో యాంటీ క్యాన్సర్, యాంటీ ఆక్సిడెంట్లకు కొదవే లేదు. ఆరోగ్యంగా వుండాలంటే మన శారీరక వ్యవస్థ బాగా పనిచేయాలి. అందుకు ఉపయోగపడే ఫిటో న్యూట్రియెంట్లు క్యాబేజీలో చాలా ఎక్కువ వున్నాయిట. ఇవి క్యాన్సర్‌కి కారణమయ్యే హార్మోన్లతో పోరాడే యాంటీ బాడీల ఉత్పత్తిని పెంచుతాయి. కాబట్టి క్యాబేజీని పచ్చిగా లేదా కొద్దిగా ఉడికించి వారానికి రెండుమూడుసార్లు తిన్నవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు బాగా తక్కువని గుర్తించారు. కేవలం క్యాన్సరే కాదు... గుండె ఆరోగ్యానికీ క్యాబేజీ మంచిదే. రుమటాయిజం, చర్మ సంబంధిత వ్యాధులకి క్యాబేజీ మంచి ఆహారంట. బరువు తగ్గాలననుకునే వారికి దివ్య ఔషధం:- బరువు తగ్గాలనుకునేవారు క్యాబేజీని ఆహారంలో చేర్చుకుంటే చాలు... ఆ పని అది చేస్తుంది. క్యాబేజీలో వుండే కొన్ని పదార్ధాలు చక్కెరలు, ఇతర కార్బో హైడ్రేట్లు కొవ్వుగా మారకుండా అడ్డుకుంటాయి. వండే విధానం ముఖ్యం:- * క్యాబేజీని ఎక్కువగా ఉడికించడం వల్ల కొన్ని పోషక విలువలు కోల్పోయే అవకాశం వుందిట. కాబట్టి క్యాబేజీని తక్కువ సమయం మాత్రమే ఉడికించాలి. * అలాగే ఎప్పుడూ కుక్కర్లో ఉడికించకూడదు. దాని వలన మన ఆరోగ్యానికి లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది. క్యాబేజీని ఉడికించేటప్పుడు మూత కూడా పెట్టకూడదు. పోషకాలు పోకూడదంటే:- క్యాబేజీని కొనేటప్పుడు ఎప్పుడైనాసరే పూర్తి క్యాబేజీనే కొనాలి. కోసి వున్నవి కొనకూడదు. ఒక్కసారి క్యాబేజీని కోశాక పోషక విలువలు తగ్గడం మొదలవుతుంది. ఎప్పుడైనా సగం కోసి వాడాల్సి వస్తే ఓ డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో వుంచితే అందులోని పోషక విలువలు పోకుండా వుంటాయి. -రమ

read more
నిద్రలేమితో బాధపడుతున్నారా?

    ఈ సమస్యను ' పూర్ స్లీప్ కన్సాలిడే షన్ ' అంటారు. అంటే బెడ్ పైనే ఎక్కువ సేపు గడుపుతారు కాని, నిద్రపోయే సమయం తక్కువ,చాలదు. ఈ పరిస్థితి తగ్గాలంటే కొన్ని జాగ్రత్తలు,శ్రద్ధ అవసరం. బెడ్ టైమ్ కు ముందుగా కునుకులు తీయకండి. బాగా అలసటగా,నిద్ర వస్తున్న ఫీలింగ్ కలిగి నపుడే పడుకోవాలి. ఒత్తిడి ఏమాత్రం లేనపుడే పడక పైకి చేరాలి. ఏవైనా విషయాలు ఆందోళన కలిగిస్తుంటే మంచం దిగేసి మనస్సు మళ్ళించాలి. తిరిగి నిద్ర వస్తున్నప్పుడే పడుకోవాలి. వీకెండ్స్ అయినా సరే వేళ ప్రకారం నిద్రలేస్తుండాలి. రాత్రి లేట్ అయిందనే కారణంతో నిద్రలేచే సమయాన్ని పొడిగించు కోవద్దు. మద్యాహ్నం వేళ ఎక్కువ నిద్ర పోవద్దు.   ఇరవై నిమిషాల కునుకుచాలు. అదికూడా మద్యాహ్నం మూడు నాలుగు గంటల మధ్యలోనే. ఇవన్ని పాటించండి ,నెమ్మదిగా సమస్య తగ్గిపోయి నిద్రించే సమయాలు క్రమబద్ధం అవుతాయి. చక్కటి నిద్ర ,ఆహ్లాదభరితమైన ఉదయం మీ సొంతం అవుతాయి.  ...సాయి లక్ష్మీ మద్దాల

read more
బీపీ... ఇలా చేస్తే హ్యాపీ

  బీపీ (blood pressure) ఇప్పుడు చాలామందిలో కనిపిస్తోంది. ఇటీవల వైద్య మార్గదర్శకాల ప్రమాణాల ప్రకారం ఒక వ్యక్తి బీపీ 140- 90 కంటే ఎక్కువగా ఉంటే అది అసాధారణం. అలాంటప్పుడు అతనికి ఎలాంటి బీపీ లక్షణాలు కనిపించకపోయినా చికిత్స ప్రారంభించాల్సిందే. సాధారణంగా హైబీపీతో బాధపడుతున్న రోగులకు తమకు బీపీ వ్యాధి ఉన్న సంగతి తెలియదు. ఈ వ్యాధి ఉన్న వారు తరుచుగా పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా వారు కిడ్ని సరిగా పనిచేయకపోవడం, గుండెపోటు వంటి సమస్యలకు గురైతే తప్ప వారిలో ఎలాంటి రోగ లక్షణాలు కనిపించవు. కుటుంబంలో ఎవరికైనా హైబీపీ ఉన్నట్లయితే 30 ఏళ్ల  వయసులోనే చెక్ చేయించుకుంటే దానిని నియంత్రించవచ్చు.   డాక్టర్లు రోగి అవసరానికి తగిన మందులను, అలాగే జీవన విధానంలో మార్పులను అంటే వాకింగ్, యోగా, ఉప్పు వాడకం మొదలైన విషయాలను సూచిస్తారు. బీపీ 140 నుంచి 159 ఎంఎం మధ్య ఉంటే సిస్టాలికే ప్రెషర్ గా 90-90 మధ్య ఉంటే డైయాస్టాలిక్ ప్రెషర్ గా గుర్తిస్తారు. ఒక్కసారి హైబీపీ సమస్య మొదలైతే ఒక్కసారి మందులు వాడితే పోయే జబ్బు కాదు. మనమే దానిని కంట్రోల్‌లో పెట్టుకోవాలి.   చికిత్స ప్రారంభించడానికి ముందు మన జీవనజైలిలో  కొన్ని మార్పులు అవసరం. ఒక 6 వారాల నుండి 3 నెలలు వరకు మన జీవన విధానాన్ని పరిశీలించుకోవాలి. ఇలా చేయకపోతే మందులు ప్రభావవంతంగా పని చేయవు.  దీర్ఘకాలికంగా మందులు వాడినా ఎలాంటి ప్రమాదం ఉండదు. అతి తక్కువ కేసుల్లో మాత్రమే దుష్ర్పభావం చూపుతుంది. అలాంటి సమయంలో కూడా డాక్టర్లు వెంటనే మరో రకం మందు ఇచ్చి నియంత్రిస్తారు.  నియంత్రణకు సాధ్యంకాని సెకండరీ హైబీపీ వల్ల అవయవాలు కాపాడుకోవడమే మన లక్ష్యం. ఎట్టిపరిస్థితిల్లోనూ మందులు మానకూడదు.   ఒక్కసారి మందులు వాడటం మానేస్తే మళ్లీ బీపీ పెరుగుతుంది. బీటా బ్లాకర్స్ లాంటి మందును వాడుతున్నప్పుడు కొందరు రోగుల్లో బీపీ సాధారణ వైద్యానికి లొంగనంతగా పెరిగిపోతుంది. కనుక హైబీపీ తగ్గినా మందులు మాత్రం వాడుతూనే ఉండాలి. సెకండరీ హైబీపీకి గురైన గర్భిణులు మాత్రం ఈ మందులు ఆపడం జరుగుతుంది. ఒక్కసారి హైబీపీ వ్యాధి వచ్చిందంటే ఇక జీవితం ముగిసిపోయినట్టే అనే అపోహను వదిలిపెట్టి, సరైన వైద్య విధానం ద్వారా నియత్రించి సాధారణ జీవనవిధానాన్ని కొనసాగించవచ్చు. అందుకు మనం చేయాల్సింది క్రమంతప్పకుండా మందులు వేసుకోవడమే. కొంతమందికి వ్యాధిని గుర్తించలేక దురదృష్టవశాత్తు కిడ్నీలు దెబ్బతినడం, గుండెపోటు లాంటి సమస్యలు వస్తున్నాయి.   ఇలాంటి వారికి ముందు వారి జీవనవిధానంలో  అలవాట్లను మార్చాల్సి ఉంటుంది.  అలా చేయడం వల్ల శరీరంలో గుండె రక్త ప్రసారమయ్యే తీరు, కిడ్నీ పని విధానం బాగుపడతాయి. ఎవరికైనా షుగర్ లేదా ఇతర సమస్యలు ఉంటే అవసరాన్ని బట్టి ఇతర మందులను నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. పెయిన్ కిల్లర్స్, సంతాన నిరోధక మాత్రలు లాంటి మందులను తీసుకున్నపుడు మాత్రం అవి బీపీని ప్రభావితం చేసి ఇతర సమస్యలకు కారణమవుతాయి. కనుక ఎలాంటి మందులనైనా వైద్యుల సలహాల ప్రకారమే తీసుకోవాలి.

read more
కడుపులో మంటగా ఉంటే....?

  చాలామంది ఉన్నట్లుండి కడుపులో మంట పుడుతోందంటూ కుర్చీలో అలాగే వాలిపోతుంటారు. దీనికి అసిడిటీయే కారణం. అసిడిటీ రావడానికి కారణాలు ఏమిటి అని చూస్తే... 1. సరిగా నిద్ర లేకపోవడం. 2. ఆహారాన్ని త్వరగా భుజించడం. సరిగా నమిలి తినకపోవడం. 3. ఆహారంలో మసాలా దినుసులతో కూడుకున్న ఆహారం ఉండటం. 4. ధూమపానం, మద్యపానం సేవిస్తుండటం. 5. ఉండాల్సిన బరువుకన్నా ఎక్కువ బరువు ఉండటం. రుచిగా ఉందని ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవటం మూలాన జీర్ణక్రియ సరిగా జరుగదు. దీంతో ఉదరం, గుండెల్లో మంట ప్రారంభమౌతుంది. 6. సమయానికి భోజనం చేయకపోవడం వంటివి ప్రధాన కారణాలు.   అసిడిటీ మరియు గుండెల్లో మంటను అదుపు చేసేందుకు కొన్ని చిట్కాలు : *  అసిడిటీతో బాధపడే వారికి అరటిపండు అత్యుత్తమమైన ఔషధం. ప్రతిరోజు అరటిపండును ఆహారంగా తీసుకుంటుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది. *  ఆహారంలో వీలైనంత మేరకు వేపుడు పదార్థాలను తగ్గించాలి. దీంతోపాటు ఊరగాయ, మసాలా దినుసులతో కూడిన ఆహారం, చాక్లెట్లను తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. *  యాపిల్ పండు రసం, వెనిగర్, తేనెను తగినంత నీటిలో కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని భోజనానికి ముందు సేవించి భోజనం తీసుకుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది *  పచ్చి కూరగాయలతో తయారుచేసిన సలాడ్‌ను తగు మోతాదులో తీసుకోండి. *  తీసుకునే ఆహారంలో భోజనానికి భోజనానికి మధ్య ఎక్కువ సమయం ఖాళీ కడుపుతో ఉండకండి. దీంతో పొట్టలో గ్యాస్ పేరుకుపోయే ప్రమాదం ఉంది. *  ప్రతిరోజు ఎనిమిది గ్లాసుల నీటిని సేవిచేందుకు ప్రయత్నించండి. భోజనం తీసుకున్న వెంటనే నిద్రకు ఉపక్రమించకండి. *  మద్యపానం, ధూమపానం అలవాటుంటే వాటిని మానేసేందుకు ప్రయత్నించండి. *  తులసి ఆకులను ఉదయంపూట తీసుకుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది.

read more
ఇది తాగితే ఆరోగ్యమే

    చల్లటి కాలంలో వేడి వేడి ‘‘టీ’’ గొంతులోంచి జారుతుంటే ఎంత హాయిగా వుంటుందో కదా.. నిజమే! అయితే ఈసారి ఓ చిన్న మార్పు చేసి చూడండి. హాయితోపాటు ఆరోగ్యం కూడా మీ స్వంతం అవుతుంది అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ టోక్యోకు చెందిన అధ్యయనకర్తలు. అదే మామూలు టీ బదులు గ్రీన్ టీ తాగడం. ఎందుకు అంటే... బోల్డన్ని లాభాలు ఉన్నాయట మరి. అవేంటో చూద్దామా... 1. గుండె ఆరోగ్యానికి, క్యాన్సర్ నిరోధానికి పనికొచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ (ఎపిగాల్లో కొటెచిన్) గ్రీన్ టీలో ఉన్నాయి. 2. ఇక మంచి కొలెస్ట్రాల్‌ని పెంచి, చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది.  బరువు తగ్గాలనుకుంటే గ్రీన్ టీ మంచి మందు. ఎందుకంటే, చక్కగా కేలరీలను ఖర్చు చేస్తుంది. పొట్ట ప్రాంతంలో నిల్వ వుండే కొవ్వును కరిగిస్తుంది. 3. పిల్లలకి రోజూ ఓ కప్పు గ్రీన్ టీని తాగిస్తే దంత సమస్యలు దూరమవుతాయి. బ్యాక్టీరియాను నిర్మూలించే సుగుణాలు అందులో వున్నాయి. 4. డయాబెటిక్ పేషెంట్లు రోజూ రెండు కప్పులు అయినా గ్రీన్ టీ తాగితే మంచిది. రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో వుంచే గుణం దీనికి వుందని అధ్యయనాల్లో తేలింది. 5. రోగ నిరోధక శక్తి పెరగాలన్నా, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా, కాలేయానికి హానిచేసే ఫ్రీ రాడికల్స్ నుంచి తప్పించుకోవాలన్నా రోజుకి రెండు కప్పుల గ్రీన్ టీ అయినా తాగి తీరాల్సిందే. 6. ‘‘అంతెందుకు చెప్పండి... ఒక్క సంవత్సరం పాటు క్రమం తప్పకుండా గ్రీన్ టీ తాగి చూడండి. అధిక రక్తపోటు సుమారు 46 శాతం తగ్గడం మీరే గమనిస్తారు’’ అంటున్నారు అధ్యయనకర్తలు.   ఇన్ని సుగుణాలు ఉన్నాయని తెలిశాక గ్రీన్ టీ తాగకుండా ఉండగలమా? అయితే ఒక్కటే సమస్య. మనం అన్ని విషయాలూ తెలుసుకుంటాం. కానీ, ఆచరించడం మర్చిపోతాం. ఈసారి అలా కాదు. రాయడం అవ్వగానే నేను, చదవడం అవ్వగానే మీరు వెంటనే ఓ కప్పు గ్రీన్ టీని వేడివేడిగా తాగేద్దాం... ఏమంటారు? - రమ

read more