ఇది జీవిత సమస్య. శ్రద్ధగా ఆలోచించు.
ఉంటాను.
లక్ష్మి.
"లక్ష్మీ!" అంటూ బావురుమన్నాను. అనుకున్నంతా అయింది. నా బ్రతుకులో నేనే నిప్పులు పోసుకున్నాను. నా కాపురం నేనే ధ్వంసం చేసుకున్నాను. మధు చాలా పట్టుదల గల మనిషి. ఏది ఏమైనా తన నిర్ణయం మార్చుకోడు. నే నెలా మార్పించగలను? ఏ మొహం పెట్టుకుని అడుగుతాను? అదేదో తల్చుకుంటూంటే శరీర మంతా కంపించిపోయింది. గుండెలు దడ దడ కొట్టుకోసాగాయి. తర్వాత ఏం జరుగుతుందో గానీ, తక్షణం వెళ్ళిపోవాలి. నా స్థానం నేను పదిలంచేసుకోవాలి.
అదేమిటో ఒక్క గంటలోనే ఆరోగ్యం ఎంతో దెబ్బతిన్నట్లు ఒళ్ళు నీరసపడిపోయింది. తలనొప్పీ జ్వరం ముంచుకొచ్చాయి. ఆ రాత్రి వంటిమీద తెలివి లేకుండా పోయింది. ఆ జ్వరం జ్వరంలా లేవలేని పరిస్థితిలో చాలా రోజులు ఉండిపోయాను, టైఫాయిడ్ లోకి దించింది ఒకసారి తగ్గి నట్లే తగ్గి, తిరగబెట్టింది. "మా యింటికి వెళ్ళిపోతాను. నన్ను తిట్టకన్నయ్యా! అని కలువరించేదాన్నట. అన్నయ్య తరుచు దగ్గరకు వచ్చి కూర్చుని వెడుతూ వుండేవాడు. బావకు ఉత్తరం వ్రాయమంటావా" అన్నాడు ఒకసారి. "వద్దు, తగ్గిపోగానే నేనే వెళ్ళిపోతాను. ఆయన్ని రమ్మంటే బాగుండదు. నేనే వెళ్ళి క్షమార్పణ కోరుకుంటాను." అన్నాను. మంచంమీదవున్న రెండు నెలలలోనూ యమబాధ అనుభవించాను. ఈ జబ్బులో మధూ వుంటే ఎంత సేవచేసేవాడో! ఏడ్చి ఏడ్చి పశ్చాత్తాపంతో పవిత్ర మై పోయాను. నాలో ఎటువంటి గర్వాలూ, పంతాలూ మిగిలి లేవు. నా భర్త, నా సంసారం అనే ధ్యాస తప్ప మరేమీ లేదు. అప్పుడే నేను నిజమైన ఆడదాన్నిగా మారా ననిపించింది. లక్ష్మి మరొక ఉత్తరం వ్రాసింది. "అన్నయ్యకు ఈ మధ్య జ్వరం వస్తుందని వ్రాస్తే చూడడానికి వెళ్ళాను. చాలా కృశించి పోయాడు. ఎందుకనో కృష్ణవేణిని తీసుకు రాలేదు. ఆ ప్రసక్తి కూడా తీసుకురావటం లేదు. పిచ్చివాడిలా తయారయ్యాడు. ఏం జరిగిందో తెలీదు నువ్వు చాలా జబ్బుపడ్డావని వ్రాశావు. ఆరోగ్యం చిక్కగానే అన్నయ్య దగ్గరకు వస్తానని ఆశిస్తాను."
నా కళ్ళు చెమర్చాయి మధూని చూసి సంవత్సరాలే గడిచాయి. కనీసం ఫోటోకూడా నా దగ్గర లేదు. చాలా కృశించిపోయి వుంటాడు. ఎంత త్వరగా వెళతానో ఏమో! రెక్కలు కట్టుకు వాలిపోవాలన్నంత ఆరాటంగా వుంది. కానీ ప్రయాణం చేయగలిగే స్థితిలో లేను. ఐనా ఎలానో వెళ్ళిపోతానంటే అన్నయ్య వారించాడు. "నాలుగు సంవత్సరాలు గడవంగా లేనిది మరి నాలుగు రోజులకా? ఏం ఫర్వాలేదు." అన్నాడు. మరి పదిరోజులలో పూర్తిగా కోలుకున్నాను. నాతో రావడానికి అన్నయ్య సిద్ధమయ్యాడు కానీ, ఏవో అర్జంటు వ్యవహారాలవల్ల ఆగిపోయాడు. ఆఫీసు వ్యవహారాలు చూసే ఒకాయిన్ని ఇచ్చి పంపించాడు.
"ఏముంది వచ్చేశాను" అంది మీదికి ఓంగి చెంపలు నిమురుతూ నవ్వి.
"కానీ ఎంతో భయంతోనే వచ్చాను. ఏం మాట లంటారో? ఏం దెప్పిపొడుస్తారో అని జడిశాను. అదేమీ లేదు. మీ మనసెంత సున్నితం మధూ? చూస్తూనే ఆప్యాయతగా ఆదరించారు, క్షమించి దరికి తీసుకున్నారు. నాకింకేం లోటు? ఈ వ్యవహారంలో యింత సున్నితంగా చక్కబడుతుందనుకోలేదు. "అరుణ గొంతులో ఏదో బాధ ధ్వనించింది.
"అరుణా!" అని మాత్రం అనగలిగాను, దగ్గిరకు తీసుకున్నాను. "కృష్ణవేణిని చూస్తావా?" అన్నాను.
"ఎక్కడుంది?" అంది ఆశ్చర్యంగా.
లేచి డైరీలో ఫోటో తీసి చూపించాను. అరుణ చాలాసేపు చూస్తూ వుండిపోయింది. "అంద మైంది" అంది తలెత్తి నా కళ్ళల్లోకి చూస్తూ.
"అవును నా దృష్టిలో కృష్ణవేణి నీకంటే అందమయింది. కానీ ఆ అందాన్ని నే నిప్పుడు పొగడకూడదు. కృష్ణవేణికి పెళ్ళయింది. అంతా మరిచి చెల్లిగా మాత్రం చూసుకుంటున్నాను. కృష్ణవేణి వంటి చెల్లి ఉండటం కూడా ఒక అదృష్టం."
"కానీ, మీ నిర్ణయం ఎందుకు మార్చుకున్నారో తెలుసుకోవాలని వుంది. అసలు మీకీ స్నేహం ఎలా కలిసింది?"
"అదంతా చాలావుంది అరుణా! గుర్తువస్తే బాధగానే వుంటుంది. నీలానే ముందు ముందు ఆలోచించలేని మంచిచెడ్డలు ఆఖరు దశలో ఆలోచించ గలిగిందట ...... ...... ........"
"పోనివ్వండి, మరొకసారి వింటాను" అంది.
నేను తలక్రింద చేతులు పెట్టుకుని పందిరి గుడ్డమీది పువ్వులకేసి చూస్తూ, మవునంగా పడుకున్నాను. నా మవునం అరుణకు విసుగెత్తింది లావుంది. లేచి కూర్చుంది కాళ్ళవైపు. "నేను వున్న ధ్యాస లేనట్లుంది మీకు. గంటన్నర శ్రమ పడి జడనిండా పువ్వులు పెట్టుకు వస్తే మాట మాత్రమయినా బావున్నాయన్నారా? మనిషి దగ్గరుండగానే అంత పరాకేమిటి? నేను కింద పడుకుంటాను" అంది బుంగమూతి పెట్టి.
"పడుకో" అన్నాను నవ్వి.
నిజంగానే వెళ్ళి గచ్చుమీద పడుకుంది. రమ్మని పిలిచాను. విన్పించుకోలేదు. నేనూ లేచివెళ్ళి కింద పడుకున్నాను. జడలో మల్లెపూలు కాసిని వూడదీసి, పక్కమీదికి విసిరాను. "అదేం పని" అంది.
"నా యిష్టం. యిది నా జడ. నీకేం ?" అన్నాను.
"నయం" అంది నవ్వి లేచి రమ్మంటే రానంది.
"నీవంటి సుకుమారి కటికి నేలమీద పడుకోకూడదు. దేవీరావూ?"
"బ్రతిమాలుకోండి" అంది వారగా చూస్తూ.
"సరే! చందమామరావే, జాబిల్లి రావే! పరిగెత్తుకు రావే! పరుపుమీదికి రావే!"
అరుణ ఫక్కున నవ్వింది. లేచివెళ్ళి పరుపుమీద పడుకుంది. నేను వెళ్ళి ప్రక్కన పడుకోబోతే చేతుల్లో యిముడ్చుకుంది.
అరుణ వచ్చిన క్షణమే ఇంటికి కళ వచ్చింది కృష్ణవేణీ! అరుణ నాలో కొత్తజీవం పోసింది. నేను ఓవారం రోజులపాటు ఆఫీసుకు సెలవు పెట్టేశాను. అరుణ వచ్చిన మర్నాడే పదిరోజులుండి వెళ్దురుగాని రమ్మని లక్ష్మి భర్తకి టెలిగ్రాం ఇచ్చాను. సాయంత్రానికే వాళ్ళిద్దరూ వచ్చారు. ఈమూడు రోజుల నుంచీ ఇల్లు మహాసందడిగా వుంది. అరుణ వంటింటి పనులుకూడా చూస్తోంది. నేనూ వంటగది గుమ్మంమీదే కూర్చుండి పోతున్నాననుకో.
లక్ష్మి వచ్చిన రాత్రే అరుణ శుభవార్త మోసుకొచ్చింది. "మనకి కోడలో అల్లుడో పుట్టబోతున్నారని". లక్ష్మి తల్లి కాబోతూందనుకొంటే ఎంతో సంతోషమైంది. "కోడలూ, అల్లుడూ రావాలంటే కొడుకూ కూతురూ వుండాలిగదా? ఎప్పుడుమరి?" అన్నాను అరుణని దగ్గిరకు తీసుకొంటూ-అరుణ సిగ్గుసిగ్గుగానే జవాబు చెప్పింది. "నాకేం తెలుసు? నేనే మిమ్మల్ని అడగాలనుకొంటున్నాను." అంటూ నవ్వింది. "ఇన్ కంటాక్స్ తప్పించుకోటానికైనా మనకి పాపాయి వుండాలి" అన్నాను.
* * *
.jpg)
మూడో రోజు అరుణా వాళ్ళన్నయ్య దగ్గిర్నుంచి వుత్తరం వచ్చింది-క్షేమ సమాచారాల తదనంతరం చెల్లెలు విషయం ఎత్తి రాశాడు. "అరుణ నీకు అంతా చెప్పివుంటుంది. ఎలా గైనా అరుణ మనసు మార్చి, అరుణ కాపురం నిలబెట్టాలని నేనూ, మీ అక్కయ్యా కూడా ఎంతో నిర్దయగా ప్రవర్తించాల్సి వచ్చింది. అరుణని దెప్పిన దెప్పులూ-అన్నమాటలూ అరుణ మంచి కోసమే తప్ప, అరుణ మాకు భారమై కాదు. దాన్ని ఎన్నడూ అంత కర్కశంగా మందలించి ఎరుగను. అది కళ్ళనీళ్ళు పెట్టుకుంటూంటే లోలోపల నేనెంతో బాధపడేవాడిని. కాని అంత మొండిగా వుండబట్టే అరుణ మారగలిగింది. అరుణ ఒక్కగానొక్క తోబుట్టువు నాకు. అది సంతోషంగా వుండటమే నాకు కావాలి. దానికి పుట్టింట్లో గౌరవం లేదేమో అనుకొని చులకన చేసేవుసుమా! నీమీద ఎంతచిన్న ఫిర్యాదు వచ్చినా వూరుకోను. దానికి సినిమాలూ, షికార్లూ ఎంతో ఇష్టం. తరచూ సినిమాలు చూపించు. రోజూ షికారుకు తీసికెళ్ళు. దాని సర్దాలకే లోటూ రాకూడదు. నాలుగైదురోజుల్లో అరుణనీ, నిన్నూ చూడడానికి నేను వస్తున్నాను. వెనుక నేనున్నానన్న సంగతి మాత్రం మర్చిపోకు బావా!
ఆ వుత్తరం చదివి అందరికీ వినిపించాను. నవ్వుకున్నాం. "ఏం అపురూపమమ్మా అన్నగారికి!" అంది లక్ష్మి వేళాకోళంగా. "ఏమమ్మా. నువ్వంటే మీ అన్నగారికి లేదూ?" అంది అరుణ ఏదో ఒకటి వాళ్ళెప్పుడూ హాస్యాలాడుకుంటూనే వుంటారు. "నీకు కూతురే పుట్టాలి లక్ష్మీ!" అంటుంది అరుణ. "కొడుకు పుడితే నీకూతుర్ని అడుగుతామనా అంత భయం? మేమున్నంతలో మేముంటాముగానీ అంతస్థులకి తగని ఆశల! పోతామా వదినగారూ?"
"అదికాదే! కూతురే ముందు పుడితే పెట్టి పోతలూ, మంచిచెడ్డలూ తెలిసివస్తాయి నీకు." అన్నాను నేను.
లక్ష్మికి కోపం వచ్చేసింది - "నాకంతగా ఏం పెట్టెస్తున్నావేమిటన్నయ్యా! పోనీలే. ఇక నీది నువ్వు దాచుకో" అంది. నేను నవ్వాను-"ఎందుకే లక్ష్మీ అంతకోపం? నీకు పిల్ల నిచ్చే భారం నాది. మీవదిన పెత్తనం ఏమీలేదు. నువ్వు కొడుకునే కనూ" అన్నాను. లక్ష్మి సిగ్గుపడింది.
