Next Page 
వసుంధర కధలు-7 పేజి 1


                            అమర ప్రేమికులు
                                                               ---వసుంధర

                             


    "ఇంత రాత్రివేళ ఎక్కడికిరా బయల్దేరావ్?" అంది మాలతమ్మ కొడుకు వంక ఆశ్చర్యంగా చూస్తూ.
    "సెకండ్ షో సినిమా కమ్మా!" అన్నాడు ముత్యాల్రావు.
    "సెకండ్ షో కెందుకూ - రేపు ఆదివారమేగా-ఏ మ్యాట్నీకో వెళ్ళొచ్చు-" అంది మాలతమ్మ.
    "ఆ సినిమాకు మ్యాట్నీకి టికెట్ దొరకడానికి ఇంకా రెండు నెలలేనా గడవాలి. రేపు ఆదివారం కాబట్టే ఈ రోజు సెకండ్ షోకు వెడుతున్నాను-" అని తల్లి ఇంక యెదురు ప్రశ్నలేమీ వేయకుండా చకచక వీధిలోకి నడిచాడు ముత్యాల్రావు.
    ముత్యాల్రావుకి చాలా ఉత్సాహంగా వుంది. బయట కాస్త చలిగా వున్నా ఉత్సాహంలో ఆ చలి తెలియడం లేదు.
    సెకండ్ షో అని తను తల్లికి అబద్దం చెప్పాడు. కానీ తను నిజానికిప్పుడు వెడుతున్నది సినిమాకు కాదు- వేదవతి వద్దకు.
    వేదవతి పేరు తల్చుకోగానే అతడి తనువు పులకరించింది.
    వేదవతి వయులో ఉన్నదనడానికి ఆమె వయసు పొంగుల సాక్ష్యం వున్నది. ఒకసారామెవైపు చూసిన వాళ్ళు మళ్ళీ కళ్ళు తిప్పుకోలేరు. ఆమె గొప్ప అందగత్తె కాకపోవచ్చు కానీ చాలా సెక్సీగా వుంటుంది.
    వేదవతి ముత్యాల్రావుని ప్రేమించింది. పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నది. ముత్యాల్రావూ ఆమెను ప్రేమించాడు కానీ పెళ్ళి చేసుకోవాలనుకోవడం లేదు.
    వేదవతి తన అభిప్రాయం అతడికి పూర్తిగా చెప్పింది. ముత్యాల్రావు తన అభిప్రాయం ఆమెకు సగంమాత్రమే చెప్పాడు.
    "నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ..." అని ఆగిపోయాడతను.
    ఆ వాక్యం అతడిచేత పూర్తిచేయించడానికి వేదవతి కి వారం రోజులు పట్టింది. "నువ్వు నన్ను నమ్మవు, అపార్ధం చేసుకుంటావు, అసహ్యించుకుంటావు. మన ప్రేమ ఇలాగే వుండిపోనీ-" అంటూ అతడామెకు అసలు సంగతి చెప్పకుండా వారం రోజులు దాటవేశాడు. ఆమె నొక్కించగా తన మనసులోని మాట చెప్పాడు.
    ఈ రోజుల్లో పెళ్ళయ్యాక యెందరో దంపతులు సెక్సు పరంగా ఇబ్బందులకు గురవుతున్నారు. అందువల్ల పెళ్ళికి ముందే కొంతకాలం దాంపత్య జీవితం అనుభవించి ఒకరికొకరు నచ్చినదీ లేనిదీ తేల్చుకొనడం మంచిదని ముత్యాల్రావు అభిప్రాయం.
    ఇది విని వేదవతి తెల్లబోయింది. తర్వాత నెమ్మదిగా "ఏను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నీకోసం ఏమైనా చేయగలను. ఎందుకైనా సిద్దపడతాను. కానీ ఆ తర్వాత నువ్వు నన్ను మోసం చేయకూడదు-" అన్నది.
    ఆమెను మోసం చేయడం కోసమే ముత్యాల్రావు ఆ షరతు పెట్టాడు. ఆడది యెందువల్లనో ఈ ఒక్క విషయాన్ని విస్మరిస్తుంది.
    ముత్యాల్రావుకు వేదవతిని పెళ్ళిచేసుకోవడం ఇష్టం లేదు. అందుకు చాలా కారణాలున్నాయి. వాటిలో మొదటిది ఆమె చాలా సెక్సీగా వుండడం. ఆడది అంత సెక్సీగా వుండడం-మగవాడుగా సహించగలడు. కానీ భర్తగా భరించలేడు.
    ఆపైన వేదవతికి యెవ్వరూ లేరు. పదిమంది దయతో చందాలమీద చదువుకుని ప్రస్తుతం ఉద్యోగం చేస్తోంది. అంత సెక్సీగా ఉన్న మనిషి ఇంతకాలం స్వచ్చంగా ఉండగలగడం కష్టం.
    ఈ రెండు కారణాలను బట్టి ముత్యాల్రావు ఏ తరహా మనిషో ఊహించవచ్చు. అతడామెను పెళ్ళిచేసుకోకపోవడానికి ఏమేం కారణాలుండవచ్చునో వేరే వివరించనవసరంలేదు.
    ఈ ముత్యాల్రావును ప్రేమించి వేదవతి అతడినొక మహోన్నత వ్యక్తిగా భావిస్తున్నది. అతడి కోరిక తీర్చడానికి ఈ రోజు ముహూర్తం పెట్టింది.
    ముత్యాల్రావు ఓసారి సమయం చూసుకున్నాడు. తొమ్మిదిన్నర అయింది. వేదవతి పెట్టిన ముహూర్తం పది గంటలు.
    "రాత్రంతా పూర్తిగా నీదాన్ని. నాకు నమ్మక మున్నది - నేను నీకు నచ్చుతానని!" అంది వేదవతి అమాయకంగా.
    ఆమె ఒక చిన్న ఇంట్లో ఉంటున్నది. ఆ యింటి వారూళ్ళో లేరు. మూడు రోజులవరకూ రారు. పగలైతే చుట్టుపక్కలవారికి తెలిసిపోతుంది. రాత్రి తొమ్మిది గంటలు దాటాక ఆ వీధంతా సద్దుమణుగుతుంది.
    ముత్యాల్రావు కాలినడకన వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. చేసేది తప్పుపనని అతడికి తెలుసును. అందుకని సాక్ష్యాలు లేకుండా జాగ్రత్తపడుతున్నాడు.
    సరిగ్గా పదిగంటలకు ముత్యాల్రావు వేదవతి ఇల్లు చేరుకున్నాడు.
    వీధి నిర్మానుష్యంగా ఉన్నది. ఇళ్ళల్లో అంతా నిద్రపోతున్నట్లున్నారు. వీధిలో కుక్కలు కూడా మొరగడం లేదు.
    వేదవతి ఇంట్లో మాత్రం దీపం వెలుగుతున్నది. తలుపు ఓరవాకిలిగా వేసి వుండడం వల్ల బయట మెట్లమీద వెల్తురు పడుతున్నది. ఆ మెట్లు యెక్కేముందు ముత్యాల్రావు మరో పర్యాయం వీధిలో చుట్టూ చూశాడు. అప్పుడు గబగబా మెట్లు ఎక్కాడు. ఓరవాకిలిగా వున్న తలుపు తోశాడు.
    అంతే!
    వివేకం హెచ్చరించకపోతే అతడు కెవ్వుమని అరిచి వుండేవాడే!
    గదిలో మంచం మంచంమీద వేదవతి. ఆమె చేయి ఒకటి క్రిందకు వేలాడుతున్నది. వంటిమీద బట్టలు అస్తవ్యస్తంగా వున్నాయి. అయితే ఆమె సెక్సీగా లేదు. నిర్జీవంగా వున్నది. అందుకు సాక్ష్యం-ఆమె గుండెలవద్ద కనిపిస్తున్న కత్తి పిడి-అక్కణ్ణించి ధారగా ప్రవహించి ఎండిన రక్తం!
    ముందడుగు వేయాలా? వెనక్కు పోవాలా?
    వేదవతి చచ్చిపోయింది. ఎవరో చంపేశారు.
    తానిప్పుడు పోలీసులకు రిపోర్టు చేయాలా? లేక....
    ముత్యాల్రావు చటుక్కున వెనక్కు తిరిగాడు. చక చకా మెట్లు దిగాడు. అతడి బుర్ర పనిచేయడం లేదు. కాళ్ళు మాత్రం పనిచేస్తున్నాయి.
    వచ్చేటప్పుడు ముఫ్ఫై అయిదు నిముషాలు పట్టింది. కానీ ఇప్పుడతడు ఇరవై రెండు నిమిషాల్లో ఇల్లు చేరాడు.
    "అదేమిట్రా-అప్పుడే సినిమా అయిపోయిందా?" అంటూ ఆశ్చర్యపోయింది అతడి తల్లి.
    "సెకండ్ షోకు కూడా టికెట్లు దొరకలేదమ్మా-" అన్నాడు ముత్యాల్రావు. అయితే తను కోరిన టికెట్ ఈ జీవిత కాలానికి దొరకదని అతడికి తెలుసు.

                                         2

    మూడు నలుగు రోజుల వరకూ ముత్యాల్రావు వేదవతి ఇంటివైపు వెళ్ళలేదు. పేపర్లో ఆమె హత్య గురించిన వార్త వస్తుందేమోనని చూశాడు. పేపర్లలో రాలేదు. ఊళ్ళో యెవరూ చెప్పుకోవడంలేదు.
    వేదవతిని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? ఆ తర్వాత ఆమె శవం ఏమైంది?-ఈ విధమైన ఆలోచనలతో ముత్యాల్రావు సతమతమైన మాట మాత్రం నిజం. అయితే ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే చోటుకి మాత్రం అతడు వెళ్ళలేదు.


Next Page 

WRITERS
PUBLICATIONS