స్రీ
ముప్పాళ రంగనాయకమ్మ

"అమ్మా! ఒక్కసారి ఇలా వచ్చి వెళ్ళు."వంటింటి ముందు వరండా లో తచ్చాడుతున్న విజయ శాస్త్రి చివరికి ధైర్యం చేసి గొంతు పెగల్చుకొని ఆ రెండు మాటలూ అనేశాడు.
కొడుకు కంఠం విన్న కామేశ్వరమ్మ బయటికి చూడకుండానే అంది. "నేను మడిలో ఉన్నానురా. జానకి వస్తోంది-- ఏం కావాలో చెప్పు."
"కాదమ్మా! నువ్వే ఒకసారి లేచిరా!" అసహనంగా మళ్ళీ పిలిచాడు శాస్త్రి . ఓ క్షణం తటపటాయించి చేతులు కడుక్కుని లేచి వచ్చింది కామేశ్వరమ్మ.
చేతిలో పేపరు పట్టుకుని, పాలిపోయిన ముఖంతో నిలబడి ఉన్న కొడుకును చూడగానే కాస్త కంగారుపడింది తల్లి. ప్రశ్నార్ధకంగా కొడుకు ముఖంలోకి చూడబోతూ, "ఏమిటిరా, శాస్త్రీ, ఎందుకలా పిలిచావూ?' అంటుంటే--- మాట్లాడకుండా , తెరిచి వున్న పేపరు తల్లికి అందించి, రెండడుగులు స్తంభం కేసి నడిచి ఎటో చూస్తూ, నించున్నాడు శాస్త్రి . కొడుకు వైఖరి అర్ధం కాని కామేశ్వరమ్మ అలాగే తెలియని జంకుతో చేతుల్లో విడమరిచి వున్న పేపరు లోకి చూసింది ఎగాదిగా.
(2).jpg)
పెద్ద పెద్ద పూలదండలతో కంఠలనలన్కరించుకుని అతి సన్నిహితంగా నిలబడి వున్న వధూవరుల ఫోటోలో స్త్రీ మూర్తిని పోల్చగలిగింది వెంటనే."ఇది...ఇది....పద్మజ కాదూ?..... మన పద్మజ!" అప్రయత్నంగా అంటూ కొడుకు కేసి చూసింది. "ఏమిటిరా, శాస్త్రీ, ఏమిటిది?" అంది అయోమయంగా.
శాస్త్రి మాట్లాడలేదు సరిగదా ముఖం కూడా కనిపించనీయకుండా నించున్నాడు స్థాణువులాగా. కామేశ్వరమ్మ మళ్ళీ మళ్ళీ చూసింది పేపర్లో పడ్డ ఫోటో కేసి. గుండెల్లో ఏదో దుశ్శంక జరజరా పాకుతుంటే చటుక్కున రెండడుగులు ముందుకు వేసి కొడుకు భుజం పట్టి వెనక్కు తిప్పుతూ కంగారుగా అడిగింది. "ఏమిటిరా, శాస్త్రి , మాట్లాడవేం? మన పద్మ ఫోటో వేశారెందుకూ? ఈ పక్కన నిలబడ్డ కుర్రాడేవరూ? నేనేం చదువుకు చచ్చాననా అలా నోరు మూసుకు నించున్నావు?'
(2).jpg)
శాస్త్రి ముఖం జేవురించింది. కనుగుడ్లు నిప్పు కణికలయ్యాయి. పళ్ళు పటపటలాడించాడు. "ఇంకేం చెప్పనమ్మా? మన బతుకులు బండలయ్యాయి. ఆ పూల దండలూ, ఆ వ్యవహారమూ చూస్తుంటే కూడా అర్ధం కాలేదా? పద్మజ , జార్జి విలియమ్స్ అనే ఆంగ్లో ఇండియన్ వాణ్ణి రిజిస్టర్ పెళ్లి చేసుకుంది. వాడూ డాక్టరెనట."
"శాస్త్రీ!" కెవ్వున కేక పెట్టింది కామేశ్వరమ్మ. ఆందోళనతో ఆవిడ ఒళ్ళంతా వణకసాగింది. "చాల్లే! అర్ధం పర్ధం లేని నీ వాగుడూ నువ్వునూ. మన పద్మజ అలాంటి వెధవ పని చేస్తుందా?"
వెర్రివాడిలా చూశాడు శాస్త్రి.
కామేశ్వరమ్మ తీక్షణంగా అంది మళ్ళీ. "రెండు కళ్ళూ పెట్టుకు చదివావూ? నోటికి ఎంతవస్తే అంతా అనేస్తావా? అదేం గొప్ప పని చేసిందనో ఫోటో వేశారో గానీ...."
"అమ్మా!' కోపంగా అన్నాడు శాస్త్రి. "ఆవిడ దృష్టి లో ఇది కూడా ఘనకార్యమేనని ఫోటో వేయించుకొంది. పత్రికలో అచ్చుపడ్డ సంగతి చదివి నీకు చెప్పానంతే. ఆ పిల్ల మన పద్మజే అయితే అది ఆంగ్లో ఇండియన్ వాణ్ణి కట్టుకున్న సంగతి కూడా నూటికి నూరు పాళ్ళూ యదార్ధమే."
పిచ్చిపట్టినట్టే చూసింది కామేశ్వరమ్మ. "పద్మ....మన పద్మ.... మనతో చెప్పకుండానే.... ఇలాంటి పనెలా చేస్తుందిరా? నాన్నగారు కుదిర్చిన సంబంధం.... ఉండగా ఎక్కడో తెల్లవాణ్ణి ....ఎలా నమ్మేదిరా?"
"బాగా నమ్ముదువులే, వెళ్ళి నాన్నగారినే అడుగు." విసురుగా వరండా దిగి వెళ్ళిపోయాడు శాస్త్రి.
అయోమయంగా పదేపదే పేపర్లోకి చూస్తూ నించుంది కామేశ్వరమ్మ.
"అత్తయ్యా! కుంపటి మీద పోపు మాడి పోతోంది. నేనెలా ముట్టుకునేది?" వరండాలోకి వినిపించేలా కంఠస్వరం హెచ్చించి పిలిచింది జానకి వంటింట్లో నుంచి. అప్పటికే కామేశ్వరమ్మ దడదడ కొట్టుకొంటున్న గుండెతో పేపరు పట్టుకుని పరుగు పరుగున భర్త గారి గది వైపు నడిచిపోయింది.
"ఏమండీ! ఇది విన్నారూ? మన పద్మ...." ఈశ్వర సోమయాజి నిర్లిప్తంగా చూస్తూ కూర్చుని ఉన్నాడు పక్క మీద.
పొంగి పొంగి వస్తున్న కన్నీళ్ళ తో ఆరాటం వెల్లడిస్తూ అంది కామేశ్వరమ్మ. "శాస్త్రి ఏమంటున్నాడో చూశారా? మన పద్మ తల్లి ఇంత వివేకం లేని పని చేస్తుంది? అసలు దాని ఫోటో ఎందుకు వేశారో-- కాస్త మీరైనా సరిగ్గా చదివి...."
"కాముడూ!"
మంచు తాకిడి వంటి భర్త పిలుపుతో తెల్లబోయింది కామేశ్వరమ్మ. అయన ముఖంలో, కళ్ళలో ఏదో దేవతలా తాలుకూ మహత్యం ప్రకాశిస్తున్నట్టు తోచింది. మరేమీ అడగటానికి నోరు రాక ఇంకా దగ్గరికి వెళ్ళి నిలబడింది. ఒక్క నిట్టుర్పు విడిచాడు ఈశ్వర సోమయాజి. పేపరు చూడకుండానే డగ్గుత్తికతో అన్నాడు." "అబ్బాయి చెప్పింది నిజమే, కాముడూ!"
"ఆలాక్కాదు మీరు స్వయంగా చూసి చెప్పండి-- నేను నమ్ముతాను. మన పద్మకేం మంచి చెడ్డలు తెలీవనా? అంత పాడుపని ఎన్నడూ చెయ్యదు" అంటూ పేపరు తెరిచి భర్త ఒళ్ళో పెట్టి దగ్గరగా కూర్చుంది ఆందోళనగా చూస్తూ.
క్షణకాలం కుమార్తె పెళ్ళి ఫోటోను తీక్షణంగా చూశాడు సోమయాజి. చూస్తుండగానే అయన కళ్ళలో నీళ్ళు ఊరాయి. చటుక్కున ఉత్తరీయంతో ఒత్తుకున్నాడు. ఫెళ్ళుమని శబ్దం చెయ్యకుండానే గుండెల్లో పిడుగుపడి కుప్పలా ఏనాడూ అపనమ్మకం లేకపోయినా, అకస్మాత్తుగా అంత అభాండాన్ని అంగీకరించ లేక అంతవరకూ పెనుగులాడుతూ వచ్చిన ధైర్యం యావత్తూ నీళ్ళు గారిపోయింది.
"ఇదేం ఘోరమండీ? మనకీ మాట వరసకైనా చెప్పకుండానే దాని పెళ్ళి అదే చేసేసుకోవడం ఏమిటండీ? కులం, గోత్రం , జాతి , మతం -- ఏవీ చూడకుండా, ...." దుఃఖ భారంతో ఆవిడ కంఠం మరి పెగలలేదు. కొంగు అడ్డుపెట్టుకుని విలవిల్లాడింది.
ఒక్కసారి వేదాంతి లా చూశాడు సోమయాజి. "కాముడూ! ఇక ఏడ్చి ప్రయోజానం లేదు. మన పద్మ..... కోరుకున్నవాణ్ణి వివాహం చేసుకొంది. జరిగిపోయింది ....అంతా," ఎంత తమాయించుకొబోయినా గాంభీర్యం సడలి మళ్ళీ మళ్ళీ కళ్ళు చెమర్చుకుంటే ఉత్తరీయంతో ఒత్తుకుంటూనే కూర్చున్నాడాయన.
ఎన్నడూ అధైర్యపడని భర్త కంటనీరు తిరగటంతో కామేశ్వరమ్మ శోకా వేగం తాత్కాలికంగా శాంతించింది. అయన ముఖం తుడుచుకుంటున్న ఉత్తరీయాన్ని చేతుల్లోకి తీసుకొంటూ, "ఒక్కసారి ఇలా చూడండీ! ఇది ఇలా చేస్తానని మీకు గాని చెప్పిందీ?' అంది అర్ధం లేని ఆశతో.
చేసిన పని వెల్లడించుకోలేక, నేరమంతా ఎదుటి వాళ్ళ మీదికి తోసివేసే మనస్తత్వం కాదు సోమయాజిది. సూటిగా భార్య కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. "చెప్పింది కాముడూ! చెప్పింది. నేడో రేపో ఇది జరుగుతుందనే...."
ఘొల్లుమంది కామేశ్వరమ్మ. పొంగులు వారుతున్న దుఃఖంతో వణికి పోతూ , "మీకు.... మీకు తెలిసీ,.... ఇలా ఊరుకున్నారా? ఒక్క ముక్కైనా నా చెవిని వేశారా? నయాన్నో, భయాన్నో.... ఏడ్చో , మొత్తుకునో ఈ అప్రతిష్ట రాకుండా కాపాడుకునేదాన్ని కాదూ? కట్టుకున్నదాన్నంటూ నేను ఉన్నానని-- ఎన్నడైనా మీకు కష్టసుఖాలకి గుర్తు వచ్చానా?" అని నిష్టూరాలాడుతూ ఏడ్చింది." మీ చేతులతోనే మీ ఇంటికి నిప్పు పెట్టుకున్నారు. మీ వేలితోనే నా కన్ను పొడిచారు."
సోమయాజి స్థాణువులా కూర్చున్నాడు.
"అది పెళ్ళికి ఒప్పుకుందని నాతొ అబద్దం ఆడారు. పెళ్ళి కళతో నా ఇల్లు కలకల్లాడుతుందని మురిసి ముక్కలయ్యాను. మమ్మల్నందర్నీ ఇంత మభ్యపెట్టి చివరికి ఇంత నవ్వుల పాలు చేశారా? అయ్యో, భగవంతుడా!" అంటూ బావురుమని ఏడ్చింది.
"కాముడూ!' భార్య శిరస్సు మీద ఆప్యాయంగా చేయి వేశాడు సోమయాజి. "నువ్విలా బాధ పడకూడదు. నా మాట విను. కొంచెం ధైర్యం తెచ్చుకో. మన బిడ్డ మనకు కాకుండా పోయినా, ఎక్కడ ఉన్నా సుఖంగానే ఉండాలి. ఒక్కసారి మనస్సు లోనైనా పద్మని ఆశీర్వదించు, కాముడూ! తప్పదు-- నువ్వు కన్న తల్లివి.
"కాదు, కాదు. నేనా పాపిష్టి దానికి తల్లిని కాదు." ఘొల్లుమంది కామేశ్వరమ్మ."అది నా కడుపున పుట్టనే లేదు. నా బిడ్డలు ఇద్దరే. ఇద్దరే!"
పై నుంచి గబగబా మెట్లు దిగి వస్తున్న సుజాత, ఊహించలేని స్థితిలో తల్లిదండ్రులను చూసి నిర్ఘాంత పోయింది. తండ్రి ఒళ్ళో తలదాచుకుని రోదిస్తున్న తల్లినీ, తల్లి తల నిమురుతూ ఓదార్చు ప్రయత్నిస్తున్న తండ్రినీ కారణం తెలియని వారి దుఃఖాన్ని చూస్తూ స్థాణువులా నిలబడిపోయింది.
"మనం కాదనుకున్నా లోకం కాదనదు, కాముడూ! బిడ్డలని కనగలమే గానీ నుదుటి రాతలని కూడా కనగలమా? మన నుదుటి రాత ఇలా ఉందని సరిపెట్టుకోవటం తప్పితే ఇంకేం చెయ్యగలం? ఇకనైనా ఊరుకో."
"అవెం మాటలండీ? మన నీతీ, జాతీ, పరువూ, ప్రతిష్టా ఇవన్నీ ఏ గంగలో కలిపారు? ఇక మరో మనిషి ఎదుట తలఎత్తుకుతిరగగలమంటారా? తలచుకొంటున్నకొద్దీ మీకు మాత్రం కడుపు చేరువై పోవటం లేదూ , అగ్ని హోత్రం లాంటి ఇంట పుట్టిన బ్రాహ్మణ బిడ్డ ఎక్కడో జాతి కాని జాతి వాణ్ణి కట్టుకొంటుంటే?"
