కక్కుర్తి లేని దొంగ
జొన్నలగడ్డ రామలక్ష్మీ

అదొక చిన్న బంగళా.
చల్లని సాయం సమయం.
బంగళాముందు లాన్లో నాలుగు కుర్చీల్లో కూర్చున్నారు శేషగిరి-ఆయన స్నేహితులు!
వారి మధ్య కబుర్లు జోరుగా సాగిపోతున్నాయి.
ఆ సమయంలో గేటుదగ్గర చిన్నగా చప్పుడయింది.
స్నేహితులమధ్య కబుర్లాగి పోయాయి.
గేటు దగ్గర ఓ యువకుడు.
శేషగిరి కుర్చీలోంచి లేచి గేటుదాకా వెళ్ళాడు.
ఆ యువకుడెవరో ఆయనకు తెలియలేదు.
"ఎవరుకావాలి?" అన్నాడాయన ఒరియాలో.
"నేను తెలుగువాడినండి-" అన్నాడా యువకుడు.
"ఎవరు కావాలి?" అన్నాడు శేషగిరి తెలుగులో.
యువకుడాయనకు నమస్కరించి-"తెలుగు మాట వినిపించి ఇలా వచ్చానండి-" అన్నాడు.
ఇదేమైనా చందాల బాపతా అని అనుమానించాడు శేషగిరి. పైకది వ్యక్తంచేయకుండా-"మీ దీ ఊరు కాదా?" అన్నాడు శేషగిరి.
"కాదండి-"
"నేను మీకేవిధంగా సాయపడగలను?"
"నేను చిన్నవాణ్ణి నన్ను మీరనకండిసార్...."
అతడి వినయం మెచ్చుకో తగ్గదే అయినా శేషగిరికి అసలు విషయమింకా తేలక విసుగ్గా ఉంది-"నేను నీకే విధంగా సాయపడగలను?" అన్నాడాయన మళ్ళీ.
"సాయం కాదండి - నేనే మీ యింట్లో కాసేపు సరదాగా...." అని అర్దోక్తిలో ఆగిపోయాడతడు.
శేషగిరి ఇబ్బంది పడ్డాడు.
మనిషి చూడ్డానికి పెద్దమనిషిలాగున్నాడు. అంత మాత్రాన అపరిచితుడి నింటిలో కెలా రానిస్తాడు?
"నీ ఉద్దేశ్యం నా కర్ధంకాలేదు...." అన్నాడు శేషగిరి.
"లోపలకు రావచ్చాండీ?" అన్నాడతడు.
కాదనలేకపోయాడు శేషగిరి.
లాన్లో కుర్చీలు ఆయిదయ్యాయి. శేషగిరి స్నేహితుల కా యువకుడు కూడా జతపడ్డాడు.
"నా పేరు గోపాల్" అన్నాడతడు-"నా ఊరు రాజమండ్రి-"
శేషగిరి మనసులో విసుక్కుంటున్నాడు. లేనిపోని కంఠసం వచ్చి తనకు తగులుకుందని ఆయన చిరాకు.
"ఏం చేస్తున్నావు నువ్వు?" అన్నాడు శేషగిరి స్నేహితుడు.
"ఇంకా ఏం చేయడంలేదండి ఖాళీ...." అన్నాడతడు.
"ఈ ఊరేపని మీదొచ్చావు...."
"వీ సీ ఆర్ కొందామని...."
"ఏం-అక్కడ దొరకడంలేదా?"
దొరుకుతున్నాయికానీ పేపర్సుండవండి. ఏ కస్టమ్స్ వాళ్ళైనా రెయిడ్ చేస్తే అసలుకే మోసంగదా...."
"అంటే వీసీఆర్ కోసం రాజమండ్రి నుండి భువనేశ్వర్ వచ్చేవా?" అన్నాడు శేషగిరి స్నేహితుడాశ్చర్యంగా.
"అవునండి...."
"ఇక్కడ నీకెవరైనా స్నేహితులున్నారా?"
"లేరండి-"
"మరి వీసీఆరెలా కొందామనుకుంటున్నావు?"
"కొనేశానండి..." అన్నాడు గోపాల్.
శేషగిరి స్నేహితుడాశ్చర్యంగా "ఊరు తెలియకుండా ఊళ్ళో వాళ్ళెవరూ తెలియకుండా - ఊళ్ళో బేరమెలా చేశావు? వచ్చి ఎన్నాళ్ళయిందేమిటి?" అన్నాడు.
"నిన్ననే వచ్చానండి....."
శేషగిరి విసుగ్గా - "నువ్వు చాలా ముక్తసరిగా సమాధానాలు చెబుతున్నావు అసలు నీ గురించి పూర్తిగా చెప్పు...." అన్నాడు.
గోపాల్ నొచ్చుకోలేదు - "చాలా సారీ అండి నేను రాత్రి కోరమాండల్లో వెళ్ళిపోవాలి. నా కెక్కువ టైము లేదు. వచ్చిన పనేమిటో త్వరగా చెబుతాను" అన్నాడు.
గోపాల్ బియ్యే ప్యాసయ్యాడు. తండ్రిది బట్టల వ్యాపారం. కొడుకును కూడా వ్యాపారంలో పెట్టాలని ఆయన కోరిక. గోపాల్ కు బ్యాంకుద్యోగం సంపాదించాలని కోరిక. ఉద్యోగమైతే టైముకువెళ్ళి టైముకి వచ్చి హాయిగా జీవితం ఎంజాయ్ చేయొచ్చునని అతడి భావం. బ్యాంకు పరీక్షలు రాశాడు. ఫలితాలింకా రాలేదు.
వ్యాపారం పనిమీద గోపాల్ తండ్రి స్నేహితుడీ ఊరొచ్చాడు. అప్పుడాయనకు తెలిసింది వీసీఆర్ సంగతి. అదీ అనుకోకుండా మాటల సందర్భంలో తెలిసింది.
ఒకాయనకు వీసీఆర్ కొన్నాక ఏమీ కలిసిరాలేదు. చాలామంది అందుకు వీసీఆరే కారణమన్నారుట. చివర కోరోజున క్రికెట్ బంతి తగిలి కలర్ టెలివిజన్ స్క్రీన్ బద్దలయింది. ఆయనిక వీసీఆర్ అమ్మేయాలనుకుంటున్నాడు. ఆయన వీసీఆర్ పదిహేను వేల రూపాయలకు కస్టమ్స్ డ్యూటీ వగయిరాలన్నీ చెల్లించి మరీ కొన్నాడు. పేపర్సన్నీ సకమంగా ఉన్నాయి. అయతే ఆయన తన వీసీఆర్ ని భువనేశ్వర్లో ఎవరికీ అమ్మదల్చుకోలేదు. ఏమైనా అయితే తనేదో తప్పు చేసినట్లు ఫీలవ్వాలి.
గోపాల్ తండ్రి వీసీఆర్ కొనాలనుకొంటున్నాడు. ఆదాయన స్నేహితుడికి తెలుసు. ఆయన వీసీఆర్ ఓనర్ తో - "అప్పుడే మీ రితరులకు మాటివ్వకండి. నేను కొంటే కొంటాను...." అని చెప్పాడు.
ఆయన పదమూడు వేలకయితే వీసీఆరివ్వడానికి సిద్దంగా ఉన్నాడు.
విషయం గోపాల్ తండ్రికి చేరింది.
పేపర్స్ తో వీసీఆర్ దొరుకుతోందంటే ఆయనకు సంతోషమే.
కానీ వీసీఆర్ చరిత్ర ఆయనకు నచ్చలేదు.
అసలే ఆయన వ్యాపారస్థుడు. ఎన్నో రకాల సెంటిమెంట్సుంటాయి.
బాగా ఆలోచించి ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు.
వ్యాపారంలో కొడుక్కింకా భాగం లేదు. కాబట్టి వీసీఆర్ ని కొడుకుని కొనమన్నాడు. ఏ నష్టం జరిగినా కొడుక్కే జరుగుతుంది. అది తాను సరిచేయగలడు. తను పచ్చగా ఉన్నంతకాలం కొడుక్కే యిబ్బందీ ఉండదు. తనే దెబ్బతింటే కష్టం.
అదీకాక - పదమూడు గోపాల్ తండ్రికి అడ్డొచ్చిన అంకె!
వీసీఆర్ ఖరీదు పదమూడు వేలు!
కొనడం కూడా పదమూడో తారీఖున అని ఆయన నిర్ణయించాడు.
"ఈ రోజు పదమూడో తారీఖు...." అన్నాడు గోపాల్.
"ఇంతకూ నీకు నాతో పనేమిటి?" అన్నాడు శేషగిరి.
"అమ్మనాయన ఇంట్లో టీవీ లేదు. వీసీఆర్ ఎలా పని చేస్తున్నదీ తెలుసుకోవాలంటే వేరే మార్గం లేదు. టీవీ తెప్పించి డిమాన్ స్ట్రేట్ చేయడాని కాయనొప్పుకోలేదు. వీసీఆర్ కండిషన్ లో ఉంది. ఇష్టమైతే తీసుకో లేకపోతేమానెయ్యమన్నాడు."
