Next Page 
వసుంధర కథలు-15 పేజి 1


                               ప్రత్యక్ష సాక్షి

                                                                   వసుంధర

                            

    వెతకబోయిన తీగ్ కాలికి తగిలిన విధంగా శేషగిరి నాకు బజార్లో తటస్థ పడ్డాడు. అయితే అతడు కాఫీ హోటల్లో దూరడం వల్ల నేను బయట కిళ్ళీ కొట్టు వద్ద ఎదురు చూస్తూ ఉండిపోయాను.
    శేషగిరి నాకు స్నేహితుడు కాదు, అయ్యే అవకాశం కూడా లేదు. అతనికీ నాకూ అంతస్థుల్లో చాలా బెధముంది. నేను మామూలు బడి పంతుల్ని, అతను లక్షాధికారి. అతను నన్నే మయ్యా బడి పంతులూ అంటే నేనతన్ని నమస్కారమండీ శేషగిరి గారూ అని పలకరిస్తాను. ఇద్దరం ఇంచుమించు సమవయస్కులమే!
    శేషగిరి కి ముగ్గురు కొడుకులు. పెద్దవాడి కిప్పుడు ఇరవఏళ్ళు ఉంటాయి. రెండో వాడికి పద్దెనిమిది మూడో వాడికి పద్నాలుగు ఉంటాయి. రెండో వాడికి మూడో వాడికి మధ్య పదిహేనేళ్ళ ఆడపిల్ల ఉంది.
    శేషగిరి పిల్లలందరికీ నేను ప్రయివేటు చెప్పాను. చివరి ఇద్దరికీ ఇంకా చెబుతున్నాను. అదే మా పరిచయం.
    నాకు ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయి వరలక్ష్మీ కి పంతొమ్మిదో ఏడు, రెండో అమ్మాయి రామావతి కి పదహారేళ్ళు . ఆఖరి వాడు రామనాధానికి పన్నెండేళ్ళు.
    నాలుగు రోజుల క్రితం వరలక్ష్మీ ని చూసుకుందుకు పెళ్ళి వారొచ్చారు. నా కూతురని అనకూడదు కానీ వరలక్ష్మీ చక్కని చుక్క. ఏ పెళ్ళి వారికైనా ఆమె అందం వెంటనే నచ్చుతుంది. అయితే పెళ్ళికి అందమొక్కటే చాలదు కదా - అందులోనూ చాలామందికి డబ్బే అందం.
    వచ్చిన పెళ్ళివారు పిల్ల నచ్చిందనీ అయిదు వేలు కట్నం మిచ్చే పక్షం లో ఈ పెళ్ళి జరుగుతుందని అన్నారు. అయిదు వేలివ్వలేనని ఖచ్చితంగా చెప్పేశాను. వరలక్ష్మీ పేరు చెప్పి - రామావతి , రామనాధముల భవిష్యత్తు లో చీకటి నింపడం నాకిష్టం లేదు. నా షరతులు నేను చెప్పేశాను. పెళ్ళి గుడిలో జరుగుతుంది. కట్నం వెయ్యిన్నూట పదహార్లు మించదు. ఏ ఇతర లాంచనాలు జరుపలేను.
    నా మాటలు విని ముఖం ముడుచుకుని వెళ్ళిపోయారు పెళ్ళివారు. కానీ పెళ్ళి కొడుక్కి పిల్ల బాగా నచ్చింది. అతని ముఖం చూస్తుంటే తెలుస్తుంది. కానీ నేను మరింక ఆశలు పెట్టుకోలేదు. అయితే ఆశ్చర్యకరంగా నిన్న పెళ్ళి వారింటి నుంచి కబురు వచ్చింది. కుర్రాడికి నచ్చిన కారణంగా నా షరతులన్నింటికీ అంగీకరించామని. ఎటొచ్చీ కట్నం మాత్రం రెండు వెలియ్యవలసి ఉంటుందని చెప్పారు.
    వాళ్ళింతగా దిగి వచ్చినప్పుడు నేనూ పట్టుదలగా ఉండ కూడదని పించింది. అందుకే నా అంగీకారాన్ని తెలియబరిచాను. మంచి ముహూర్త మొకటి ఈ నెల్లోనే చూసి పెళ్ళి జరిపించేయాలని మగపెళ్ళి వారభిప్రాయ పడుతున్నారు. కుర్రాడు గుమస్తా ఉద్యోగం చేస్తూ దగ్గర దగ్గర నెలకు నాలుగొందలు సంపాదిస్తున్నాడు. మనిషి చూడ్డానికి లక్షణంగా ఉన్నాడు. వినయంగా ప్రవర్తిస్తున్నాడు. వరలక్ష్మీ ఈ పెళ్ళి చేసుకుని తప్పక సుఖపడగలదని నాకు తోస్తోంది.
    కూతుళ్ళ పెళ్ళిని దృష్టి లో ఉంచుకుని నేను నాకు వచ్చే ట్యూషన్స్ డబ్బుని బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ల లో వేస్తున్నాను. ఈ సంవత్సరం చివరకు రెండు వేల అయిదు వందలు వస్తుంది. కాబట్టి ఈ పెళ్ళి జరగాలంటే డబ్బు నాకు మరీ అంత సమస్య కాదు. ఇప్పటికిప్పుడు మాత్రం ఎవరైనా రెండు మూడు వేల రూపాయలు అప్పుగా ఇవ్వగలిగితే పని సానుకూల మవుతుంది. అలా నాకు సాయపడగలవాడు శేషగిరి. నిన్న రాత్రిల్లా బాగా అలోచించి అతన్ని వెదుక్కుంటూనే ఈరోజు బయల్దేరాను. ఇంటికి వెడితే ఇంట్లో లేడన్నారు. సరేనని వచ్చేస్తే -- బజార్లో వెతకబోయిన తీగ కాలికి తగిలిన విధంగా శేషగిరి నాకు తటస్థపడ్డాడు.
    శేషగిరి హోటల్లో సుమారు అర్ధగంట ఉన్నాడు. అతడు హోటల్లోంచి బయటకు వచ్చి ఎవరి వంకా చూడలేదు ఏదో సీరియస్ గా ఆలోచిస్తూ అతను పేవ్ మెంట్ మీద త్వరత్వరగా అడుగులు వేసుకుంటూ వెడుతున్నాడు. నా అవసరముంది కనుక నేనతన్ని అనుసరించాను. నా అవసరమలాంటిది కనుక -- అతన్ని వెంటనే పలకరించ లేక అనుసరించుకుంటూ వెళ్ళాను.
    సాధారణంగా కార్లో తిరిగే శేషగిరి ఈరోజు కాలి నడకన బయల్దేరడం విశేషమే ననిపించింది. అయినా డబ్బున్న వాళ్ళు విచిత్ర మనస్తత్వాన్నర్ధం చేసుకోవడం అంత సులభం కాదు.
    శేషగిరి వెనక్కు తిరక్కుండా -- ఎవరికేసీ చూడకుండా వడివడిగా అడుగులు వేసుకుంటూ సూటిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అతను రెండు సందులు తిరిగాడు. అతని తో పాటే నేనూను.
    ఒక సందులో ఒక చిన్న పెంకుటింటి ముందు అగేడతడు. క్షణం తటపటాయించి ఒక్కసారి అటూ యిటూ చూశాడు. ఎందుకో అతని కళ్ళబడరాదని పించింది నాకు. చటుక్కున కనిపించిన పక్కింటి మెట్లెక్కాను. కానీ అతన్ని గమనిస్తున్నాను.
    శేషగిరి ఆ ఇంట్లోకి వెళ్ళాడు. అయిదు, పది, పదిహేను నిముషాలు గడిచినా ఇంకా బయటకు రాలేదు. నేను అనుమానంగా ముందుకు కదిలాను. ఆ ఇంటి ముందు మరో అయిదు నిమిషాలు నిలబడ్డాను. ఇంక నాలో ఓర్పు నశించింది. ఆ ఇంటి వైపు చూశాను. తలుపులు పూర్తిగా వేసి లేవు. ఏమైతే అయిందని ధైర్యంగా ముందడుగు వేశాను.
    తలుపులు తోసుకుని లోపలికి అడుగు పెట్టాను. విశాలమైన హాలు, హల్లో మూడు గుమ్మాలు న్నాయి. వీధి గుమ్మం కాక. క్షణం తటపటాయించి కుడి వైపు ద్వారం వైపు దారి తీశాను. తలుపులు కొద్దిగా తీసి - కనబడ్డ దృశ్యం చూసి మ్రాన్పడి పోయాను.
    ఒక వ్యక్తీ నేలమీద పడి ఉన్నాడు.  అతని గుండెల్లో కత్తి దిగి ఉంది. ఆ వ్యక్తీ - పక్కన కూర్చుని కత్తి పిడిని జేబురు మాలతో తురుస్తున్న ఒకతను. ఆ వ్యక్తీ శేషగిరి.
    నేను తలుపు తోయగానే శేషగిరి ఉలిక్కిపడి లేచాడు. నన్ను చూసి, అప్రయత్నంగా -- "నువ్వా-- పంతులూ!" అన్నాడు. అంటూనే ముందు వచ్చాడు.
    నా శరీరంలో వణుకు ప్రారంభమయింది. పారిపోవాలనిపించింది కానీ కాళ్ళు సహకరించలేదు. ఒక నిండు ప్రాణాన్ని నిలువునా తీయగల క్రూరత్వం శేషగిరి లో ఉన్నట్లు ఇంతవరకూ నాకు తెలియదు. అయితే ఆ క్రూరత్వాన్నిప్పుడు నేను కళ్ళారా చూశాను. శేషగిరి నన్నేం చేస్తాడు?
    శేషగిరి నన్ను సమీపించి. "ఎందుకొచ్చావిక్కడకు?" అనడిగాడు.
    "నేను తడబడుతూ ...."నేనేం చూడలేదు....ఏమీ చూడలేదూ..." అన్నాను.
    "చూడలేదు లే -- ఎందుకోచ్చావని అడుగుతున్నాను" రెట్టించాడు శేషగిరి.
    "పెద్దమ్మాయికి పెళ్ళి నిశ్చయమైంది. మూడు వేలు కావాలి, అప్పెక్కడా దొరక్క మీ యింటికి వెళ్ళాను. మీరు లేరన్నారు. నిరుత్సాహంగా బయటకు వచ్చేశాను. అనుకోకుండా ఈ ఇంట్లోకి వెడుతున్న మీరు కనబడ్డారు. కాసేపు ఎదురుచూసి లోపలకు వచ్చాను. అంతే ఇంకేమీ చూడలేదు...."
    శేషగిరి నిట్టూర్చి జేబులోకి చెయ్యి పోనిచ్చాడు. జేబులోంచి ఓ నోట్ల కట్ట బయటకు తీసి నాకిచ్చాడు. అది కొత్త నోట్ల కట్ట. అన్నీ యాభై రూపాయల నోట్లు.
    "మొత్తం అయిదు వేలు, ఆప్పుగా కాదు, ఊరికే ఇస్తున్నాను. వెంటనే ఇక్కణ్ణించి వెళ్ళిపో" అన్నాడు శేషగిరి.
    నేను వెంటనే వేనుతిరిగాను.
    "ఇదిగో - వెళ్ళేముందు ఒక్క మాట, నువ్వు మూడు వేలడిగితే నేనైదు వేలిచ్చాను. నువ్వప్పుగా అడిగితె నేనూరికే ఇచ్చాను. యివన్నీ నువ్వు గుర్తుంచుకోనవసరం లేదు. కానీ ఇక్కడ నువ్వేమీ చూడలేదన్న విషయం మాత్రం గుర్తుంచుకోవాలి." అన్నాడు శేషగిరి.

                                     2
    మర్నాడు పేపర్లో ఆ హత్య గురించిన వివరాలు పడ్డాయి.
    హతుడెవరో తెలియడం లేదట. హంతకుడు హత్య చేశాక -- అక్కడ తనకు సంబంధించిన ఏ గుర్తులు లేకుండా జాగ్రత్తా పడ్డాడట. కత్తి పిడి మీదా వేలుముద్రలతో సహా అన్ని ఆధారాలూ తుడిచేశాడట. హతుడెవరో, హంతకుడెవరో అసలా హత్య ఎందుకు జరిగిందో ఎవరికీ అంతు పట్టడం లేదుట.
    హత్య జరిగిన ఆ యిల్లు సుబ్రహ్మణ్యం అనే అతని పేరు మీద ఉన్నదట. ఆ సుబ్రహ్మణ్యం ఎవరో కూడా ఆచూకి తెలియడం లేదు ఇల్లు విశాలమైన ఆవరణ లో ఉండడం ఆ చుట్టూ పక్కల వాళ్ళెవ్వరికి -- ఆ ఇంట్లో ఎవరున్నారో ఏం జరుగుతుంటుందో తెలియదట. చూచాయగా ఎవరి కైనా తెలిసి వున్నప్పటికీ - హత్య జరిగిన ఇల్లు కావడంతో ఎవ్వరూ సరైన సమాచార మివ్వడం లేదని పోలీసులు భావిస్తున్నారుట.
    వివరాలు చదివితే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. శేషగిరి అన్నీ పధకం వేసుకుని చాలా పకడ్బందీగా చేశాడు హత్య. అనుకోకుండా నేను చూడడం సంభవించింది తప్పితే -- లేకుంటే ఎవ్వరికీ ఈ హత్య గురించి మూడో కంటి వాడి క్కూడా తెలిసుండేది కాదు.
    నా మనసు మనసులో లేదు. భావిభారత పౌరుల్ని తీర్చిద్దిద్దవలసిన ఉపాధ్యాయుణ్ణి నేను. నా కళ్ళముందు జరిగిన హత్య గురించి నిర్లిప్తంగా ఉంటున్నాను. ప్రభుత్వానికి, పోలీసులకు సమాచారాన్నందించడం లేదు. నేను చేస్తున్నది పెద్ద తప్పు. అయిదు వేలు లంచం తీసుకునుని అధర్మానికి అమ్ముడు పోయాను.
    ఎల్లకాలమూ మనస్సాక్షి ని నమ్ముకోకూడదు. వాస్తవిక జీవితంలోని సాధక బాధకాలు మనకు కర్ధం కావు. దానికి మనిషిని సాధించడం మాత్రమే తెలుసును.
    అయితే ఆ సాయంత్రం జరిగిన మరో సంఘటన నా మనసుకు కూడా బుద్ది చెప్పింది.
    సుమారు అయిదు గంటల ప్రాంతంలో నేను ట్యూషన్ చెప్పడానికి శేషగిరింటికి బయల్దేరుతున్న క్షణం లో మా యింటికి ఒక మనిషి వచ్చాడు. ఆరడుగుల ఎత్తుగల ఆ మనిషి కండలు తిరిగి - భీముడిలా ఉన్నాడు. పాంటూ షర్టు వేసుకున్నప్పటికీ ముఖంలోనూ, కళ్ళజోడు లోనూ కూడా సంస్కారం కనబడడం లేదు. అతని చూపులు తీవ్రంగా ఉన్నాయి కూడా.


Next Page 

WRITERS
PUBLICATIONS