Next Page 
వసుంధర కధలు -11 పేజి 1


                                     వెంట వెళ్ళిన దెయ్యం!
                                                                   ----వసుంధర

                         


    తలుపు తీశాడు రమాకాంతం.
    "మీ యింట్లో వాటా కాళీ వుందని తెలిసింది-"
    రమాకాంతం ఆ వ్యక్తివంక తేరిపార చూసి-"ఫామిలీకి తప్ప మా యిల్లు అద్దెకివ్వడం-" అన్నాడు.
    "నేను, నా భార్య, ముసలి తల్లి, ఇద్దరు పిల్లలు-ఇదీ మా కుటుంబం-ఇల్లు చూపిస్తారా?" అన్నాడా వ్యక్తి.
    "అద్దె నెలకు మూడువందలు-" అన్నాడు రమాకాంతం.
    "ఇల్లు చూడనివ్వండి-" అన్నాడా వ్యక్తి.
    "మూడొందలు అద్దె యివ్వగలరా?" రమాకాంతం రెట్టించాడు.
    "ఇల్లు నచ్చితే ఇంకా ఎక్కువే ఇవ్వగలను...." అన్నాడా వ్యక్తి.
    అప్పుడు రమాకాంతం కాస్త పక్కకు కదిలి "రండి-వాటా చూద్దురుగాని-" అన్నాడు. ఆ వ్యక్తి లోపలకు వచ్చాడు.
    రమాకాంతం ఆయన్ను కూర్చోమని చెప్పి, లోపలకు వెళ్ళి తాళం చెవులు తీసుకుని వచ్చి - "ఏమీ అనుకోకండి- ఇల్లు మాకు పెద్దదయిందని సగం వాటా అద్దెకిస్తున్నాం గానీ-అద్దె కోసమని ఇల్లుకట్టలేదు. అద్దెకుండే వాళ్ళూ మేమూ సహజీవనం చేయాలి-అందరికీ ఒకటే వీధి గుమ్మం-" అంటూ పక్క వాటా దగ్గరకు తీసుకువెళ్ళాడు. తలుపు తాళం తీస్తూ-"మంచి సెంటర్లో వున్న మూలాన మా యింటికి మంచి డిమాండు. ఇల్లు కాళీ అయి ఇరవైనాలుఉగు గంటలు కాలేదు. అప్పుడే చూసుకుందుకు నలుగురొచ్చి వెళ్ళారు-" అన్నాడు.
    ఆ వ్యక్తి రమాకాంతం చెప్పే మాటలన్నీ మౌనంగా వింటున్నాడు. ఈ రోజుల్లో అద్దేకిల్లు దొరకడం గగనంగా వుంది. ఏమంటే ఏం తప్పోనని భయపడుతూ విసుగుణు మనసులోనే భరిస్తూ నిలబడ్డాడు.
    రమాకాంతం తాళంతీసి తలుపు తెరిచాడు. ఆయన వెనుకే ఆ వ్యక్తి కూడా అడుగులు వేశాడు. ఉన్నట్లుండి రమాకాంతం ఓ వెర్రికేక పెట్టాడు. ఉలిక్కిపడిన ఆ వ్యక్తి కూడా ఓ వెర్రికేక పెట్టాడు.
    తలుపు తీయగానే ఆ గదిలో నేలమీద వెల్లకితలా పడివున్న యువతిని చూడడానికి రమాకాంతానికి అంతసేపు పట్టడానికి కారణం ఆయన మాటల ధోరణిలో వుండడం. పడివున్న ఆ యువతి గుండెల్లోకి కత్తి దిగి వుంది. రక్తం ఇంకా ఆరినట్లు కనబడదు.
    "హత్య!" అద్దెకొచ్చిన వ్యక్తి వెనక్కు తిరిగి పరుగెత్తాడు అరుస్తూ.
    పోలీసులు వచ్చి అన్నివిధాలా పరీక్షలు చేసి వెళ్ళారు.
    చనిపోయిన యువతి ఎవరో రమాకాంతానికిగానీ, ఆ వీధిలో వాళ్ళకుగానీ తెలియదు. ఆ గది తలుపులు తాళంవేసి ఉండగా హత్య జరిగింది. హంతకుడు ఎప్పుడు ఎలా అక్కణ్ణించి పారిపోయాడో తెలుసుకొనడం కష్టంగా వుంది. గదిలో ఏ విధమైన ఆధారాలూ లేవు.
    పరిస్థితి విచారించాక పోలీసులు రమాకాంతాన్ని అనుమానించారు.
    "మీ సమాధానాలు సంతృప్తికరంగా లేవు. మీ యింట్లో ఎవ్వరికీ తెలియకుండా ఈ యువతి ఇక్కడ చచ్చిపడుండే అవకాశంలేదు. మీకింకా కొంత అవకాశమిస్తున్నాను. రేపు మధ్యాహ్నానికల్లా నాకు నిజం తెలియాలి-" అన్నాడు పోలీసు ఇన్స్ పెక్టర్.
    రమాకాంతం గది తలుపులు తీసిన సమయం ఉదయం ఎనిమిదిన్నర. డాక్టరు అంచనా ప్రకారం హత్య ఏడున్నర, ఎనిమిది గంటల మధ్య జరిగింది. అది ఆత్మహత్య అనుకుందుకు వీల్లేదని-శవం వున్న పొజిషన్, మరణం సంభవించిన పద్ధతినిబట్టి డాక్టరు నిర్ణయించాడు. ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఇదంతా ఎలా జరుగుతుంది?
    రమాకాంతం వాదనేమిటంటే-ఇంట్లో అన్ని వ్యవహారాలూ సర్వసాధారణంగా గడిచిపోయాయి. అంతా మామూలుగా ఉన్నారు. ఇంట్లో హత్య జరిగినట్లు తెలిస్తే తను పరాయి వ్యక్తికి పనికట్టుకుని శవాన్నెందుకు చూపిస్తాడు?
    ఆయన వాదన సబబుగానే ఉన్నప్పటికీ మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కే వారెందరినో ఇన్ స్పెక్టర్ తన సర్వీసులో చూసి వున్నాడు. అందువల్ల-ఆ యువతి గురించి ఎంతో కొంత ఏదో విధమైన సమాచారం ఇవ్వవలసిన బాధ్యత రమాకాంతానికున్నది.
    రమాకాంతం యింట్లో జనాభా చాలామంది వున్నారు. ఆయన వయస్సు నలభై అయిదు. అయన భార్య శాంతమ్మ. వయసు నలభై-వారి పెద్ద కూతురు రమాదేవి వయసు సుమారు పాతిక ఉంటుంది. పుట్టింటికి వచ్చి వారం రోజులయింది. రెండోవాడు అబ్బాయి. ఇరవైమూడేళ్ళు. పేరు రఘు. బియ్యే ప్యాసవగానే ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం వచ్చింది. మూడో అమ్మాయి విజయ వయసు ఇరవై వుంటుంది. పెళ్ళి సంబంధం నిశ్చయమయింది. బియ్యే ఫైనలియర్ చదువుతోంది. నాలుగో అమ్మాయి లక్ష్మికి పదహారేళ్ళు. ఇంటర్ మీడియేట్ చదువుతోంది. అయిదవవాడు శ్యామలరావు వయసు పదకొండు. ఆరో తరగతి చదువుతున్నాడు.
    ఇంతమందినీ ఇన్ స్పెక్టర్ విడివిడిగానూ, సమూహం గానూ కూడా ఎన్నో ప్రశ్నలు వేశాడు. ఆ అమ్మా యెవరో ఎవ్వరూ చెప్పడంలేదు బదులు చెప్పే పద్ధతిని బట్టి అంతా నిజమే చెబుతున్నారనిపిస్తోంది. ఆ పరిస్థితుల్లో ఇన్ స్పెక్టర్ కు రమాకాంతం కుటుంబం తప్ప ఆధారంలేదు. అందుకే ఆయన వాళ్ళను హెచ్చరించీ, బెదిరించీ వెళ్ళిపోయాడు.
    పోలీసులు వెళ్ళిపోయాక రమాకాంతం కుటుంబ సభ్యులందర్నీ ఒకచోట సమావేశ పరచి తలపట్టు కూర్చున్నాడు.
    "ఇన్స్ పెక్టర్ చెప్పిందాంట్లో అబద్దం లేదు. మనింట్లో ఎవ్వరికీ తెలీకుండా ఆ పిల్ల అక్కడికెలా చేరింది? తెలిసినవాళ్ళు చెప్పకపోతే నేను జైల్లో కూర్చోవాలి!" అన్నాడాయన.
    "బాగుందండీ-మీరు అనుమానించి, ఇన్స్ పెక్టరూ అనుమానిస్తే మేమంతా ఏమైపోవాలి?" అంది శాంతమ్మ చిరాగ్గా.
    "అలా చిరాకుపడకు. నువ్వే పోలీసు ఇన్స్ పెక్టరనుకో. ఈ పరిస్థితుల్లో ఏం చేస్తానో చెప్పు!" అన్నాడు రమాకాంతం.
    "నేనే పోలీసు ఇన్స్ పెక్టర్నయితే ఇబ్బందేముంది? నా పిల్లలూ, నా భర్తా అమాయకులని నాకే తెలుస్తుంది గదా!" అంది శాంతమ్మ.
    "అబ్బ-నీకు అర్ధమయ్యేలా చెప్పడం కష్టం-ఆ పిల్ల ఎవరో మనింటికెలా వచ్చిందో, ఎవరు చంపారో ఎలా తెలుసుకోవడం? తెలుసుకోకపోతే నా చావు దగ్గరపడేలాగుంది!" అన్నాడు రమాకాంతం.
    సరిగ్గా ఆ సమయంలో కాలింగ్ బెల్ మ్రోగింది.
    "మళ్ళీ పోలీస్ ఇన్స్ పెక్టరేమో?" అన్నాడు రఘు.
    "కాదు. ఎవరో యిల్లు అద్దెకి చూసుకుందుకు వచ్చి ఉంటారు-" అంది రమాదేవి. కానీ ఆమె కళ్ళలో భయం స్పష్టంగా కనబడుతోంది.
    "నువ్వెళ్ళి తలుపు తీసి-ఇప్పుడిల్లు అద్దెకివ్వడం లేదని చెప్పిరా!" అన్నాడు రమాకాంతం, ఆఖరి వాడు శ్యామలరావు నుద్దేశించి.
    "నాకు భయం- అన్నయ్యను వెళ్ళమనండి!" అన్నాడు శ్యామలరావు.
    అతడివాక్యం పూర్తికాకుండానే రఘు లేచి వెళ్ళి తలుపు తీశాడు.


Next Page 

WRITERS
PUBLICATIONS