నాలో ఎన్నడూలేని ఆలోచనలు ప్రారంభించాయి, నేను ఏదో నిస్సారమైన జీవితం గడుపుతున్నాను. నేను గడిపే విధంలో చాల లోటువుంది. నా బ్రతుక్కి కళాకాంతుల్లేవు. నా బరువు బాధ్యతలు ఎవరికీ లేవు. నేను చేస్తున్న షికార్లలో, చూస్తూన్న సినిమాలలో నిజమైన సంతోషం లేదు. ఎప్పుడూ నావెంటపడి తిరుగుతుండే నళిని పెళ్ళయిందో లేదో పలుకే బంగారం చేసుకుంది. అతనితోటే సినిమాలూ-అతనితోటే షికార్లూ, రాత్రుళ్ళూ పగళ్ళూ అతనే. స్నేహితుల్నే మర్చి పోయింది.
"ఏమిటో ఆయన్ని వదిలి వుండాలనిపించదే". అంటుంది. అందర్నీ చూస్తూంటే నేనే దౌర్భాగ్యురాలినేమో అనిపించేది. నేనూ అలా మధూతో కలిసి తిరక్కూడదూ? నళినీ వాళ్ళాయన ఏమీ బావుండడు. మధూ ఎంతో అందమైనవాడు కూడా-అనుకొనేదాన్ని.
రాను రాను ఇంటి వాతావరణంలో మార్పు కన్పించసాగింది. ఎప్పుడూ పన్నెత్తి మాట అతని వదిన సన్న సన్నగా సాగించటం-పిల్లిమీదో, ఎలకమీదో పెట్టి ఎత్తిపొడవటం-హేళన చెయ్యటం సాగించింది. నేను చాలాసార్లు విన్నాకలుగజేసుకోలేదు. ఓసారి పనిమనిషిని పట్టుకు ఎత్తి పొడుస్తోంది. అది అలిగి రాత్రి అన్నం వండకుండా పడుకొందట. తెల్లారి లేచి పనిలో కొచ్చేసిందంటూ వదినతో చెప్పింది కాబోలు-"ఎంత గడుసు ఆడదానినే! మొగుళ్ళూ పెళ్ళాలు అన్నాక మాటామంచీ రాకుండావుంటాయా ఆమాత్రానికే కూడువండడం మాని వాణ్ణి పస్తుపడుకో బెట్టావా? నీ ప్రాణం ఎలా ఒప్పిందే తల్లీ?"'
ఇంతలేసి పౌరుషాలూ అభిమానాలూ వున్న వాళ్ళు అసలు పెళ్ళిళ్ళెందుకు చేసుకుంటారమ్మా! కట్టుకున్న వాళ్ళు వుసూరుమంటే మాత్రం మనకి కాదటే? ఆడ పుటక పుట్టాక ఆమాత్రం భయం భక్తి లేకుండా మగవాడితో పంతాలకి దిగితే చెడేది ఎవరే? చెడ్డా, పడ్డా కలిగిన మహారాణి లెవరో సాగించుకుంటారు. నీవంటిదానికేముందే? భార్యా భర్తలన్నాక ఒకళ్ళ కష్టసుఖాలొకళ్ళు తెలుసుకోవాలి. ఒకళ్ళమాట మీద ఒకళ్ళు గౌరవం వుంచాలి. ఒద్దికగా బ్రతకాలి. అంతేగాని ఇదేం చోద్యమమ్మా? పంతాలూ - పౌరుషాలూ...... ఆకెళ్ళి ముల్లు మీద పడ్డా - ముల్లొచ్చి ఆకుమీద పడ్డా పోయేది ఆకేగా? ఆడ పుట్టుక పుట్టాక....."
"వదినా! నువ్వనే మాటలన్నీ పనిమనిషినేనా? నీకంత కష్టందేనికి? నా భారం నువ్వేం మోస్తున్నావు? ఎందుకన్ని మాటలంటావు? ఎవరి మంచి చెడ్డలు వాళ్ళకి తెలీవా?" ఎంత సేపటినుంచో మెట్లమీద నిలబడి ఆవిడ ఎత్తిపొడుపులు వింటున్నదాన్ని సహించలేక తీవ్రంగానే అడిగాను.
"అయ్యో! నిన్నెందుకంటానమ్మా? నీకు లక్షలకు లక్షలు ఆస్థి వుండగా నిన్ను నేనెందుకు మోస్తాను? బోలెడు చదువుకున్నావయ్యే. నీకు తెలీందేముంటుంది? ఆ పనిమనిషేదో దాని మొగుణ్ణి గురించి చెప్తే నాకుతోచినట్టు మందలిస్తున్నాను. అంతేగాని, నిన్నెందుకంటాను నేను?" వదిన అంటూ వుండగానే అన్నయ్య హాల్లోంచి వరండాలోకి వచ్చాడు - "ఎందుకనరు? లోకానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఏమైనా అంటారు. ఆ పనిమనిషికంటే నువ్వే విధంగానూ గొప్పదానివికాదు అరుణా! ఇంట్లో వాళ్ళ నోరుమూస్తావుగానీ లోకం నోరు ముయ్యలేవు. నిన్నుగురించి ఎందరెన్ని విధాల అనుకుంటున్నారో నీకు తెలుస్తోందా? మొగుణ్ణి వదిలేశావనీ - పోకిరీగా తిరుగుతున్నావనీ......"
"అన్నయ్యా!"
"ఛీ! అన్నయ్య!.....పిలవటానికి నీకు సిగ్గులేదు గానీ అలా పిలిపించుకోవటానికి నాకు సిగ్గుగా వుంది. ఫలానా ఆయన చెల్లెలు అని ఎవడో వేలెత్తి చూపించి నవ్వుతూంటే నువ్వు కార్లో దూసుకుపోతావు. సిగ్గుతో నేను తల దించుకుంటాను. నీకు మంచీ చెడూ కావాలా? నీ సర్దాలూ నీ జల్సాలూ నీవి." -అన్నయ్య అంత తీవ్రంగా ఏనాడూ మందలించలేదు. నిలబెట్టి తిడుతూంటే నాకళ్ళవెంట నీళ్ళు జలజలా రాలి పడ్డాయి. అంతలో అమ్మవచ్చింది - "దాన్ని పట్టుకు తిట్టాల్సిన అవసరం నీకేం లేదు నాయనా! దానికిష్ట మొచ్చిన చోటే వుంటుంది. ఎవరో ఎందుకనుకుంటారు?" అంది. అన్నయ్య మండిపడ్డాడు - "ఛ! నువ్వు పెద్దదానివేగాని వివేకం లేదమ్మా! సంసారాలు పాడుచెయ్యటం తప్ప బాగుచెయ్యడం నీకు చేతకాదు. దానికి తెలీని విషయాలు చెప్పి మందలించాల్సిందిబోయి ప్రోత్సహిస్తున్నావు. ప్రపంచంలో కూతుర్ని కన్నదానివి నువ్వొక్కదానివే కాదు. ప్రతీ తల్లీ బిడ్డని ప్రేమిస్తుంది. కాని నీవంటి మూర్కపు ప్రేమ ఎక్కడా వుండదు. అరుణ అత్తవారింటి కెళ్ళి భర్తతో కాపురం చేసుకొంటే ఎంత సంతోషంగా వుంటుందో......మొగుణ్ణి వదిలేసి పోకిరీగా తిరిగితే ఎలా వుంటుందో నువ్వు వూహించనేలేవు. దాన్ని పాడుచేసింది నువ్వు. ముమ్మాటికీదాన్ని పాడుచేసింది నువ్వు! కన్నతల్లి చెయ్యాల్సిన పని ఇదికాదమ్మా!"
అన్నయ్య తిడుతూంటే అమ్మకూడా ఏం మాట్లాడలేదు. ఎవరి గదుల్లోకి వాళ్ళం వెళ్ళి పోయాం. నాకెంతో దుఃఖం ముంచుకొచ్చింది. నన్ను నలుగురూ వేలెత్తి చూపించి హేళన చేస్తున్నారట. మొగుణ్ణి వదిలేసి పోకిరీగా తిరుగుతున్నానని నవ్వుకుంటున్నారట. ఛీ! పాడు ప్రజలు! నేనేమంత కానిపనులు చేస్తున్నా నని నవ్వుకుంటారు? నా దాంపత్యంలో ఏం లోటు పాట్లున్నాయో - నా స్వంత విషయాలేమిటో ఎవరికేం తెలుస్తుంది? - ఐనా లోకులు అనుకుంటారు. మంచీ చెడ్డా చెప్పుకుంటారు. నలుగుర్లో గౌరవం లేకపోయాక ఎన్నివుంటే ఏం లాభం? నేను గౌరవం ఎందుకు పాడుచేసుకోవాలి? నా విలువ ఎందుకు తగ్గాలి? నేను నలుగురికీ ఎందుకు చులకన కావాలి? నేనేం దిక్కులేనిదాన్నా? నాకు భర్త లేడా? సంసారం లేదా? అన్నీ వుండి లోకాని కెందుకు లోకువ కావాలి? -మధూ రమ్మని ఒక్క వుత్తరం రాస్తే - అవును ఒక్కసారి పిలిస్తే వెళ్ళిపోవచ్చు. అందరిలా గర్వంగా - గౌరవంగా బ్రతకొచ్చు. ఆ సంఘటన జరిగినప్పటి నుంచీ వెళ్ళిపోవాలనిపించేది - ఆమాటే ఓసారి సుజాతతో అన్నాను. "నీకై నువ్వే వుత్తరం రాయకూడదా?" అంది. నాకేమిటో నచ్చ లేదు. 'తనే ముందు పిలిస్తే వెళ్ళిపోదును'- అనుకొనేదాన్ని.
నా మనసులోనే ఏదో మార్పు వస్తోంది తప్ప అది పై కేమీ కన్పించటం లేదు. అమ్మతో కూడా నేనెప్పుడూ అనలేదు. అన్నయ్య ప్రేమగా మాట్లాడి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తూంది. ఎప్పుడూ "అరుణా! అరుణా!" అని పిలిచినవాడు పిలిచినట్టే వుండేవాడు. ఇద్దరం కలిసి ఒకే కార్లో కాలేజీ కెళ్ళేవాళ్ళం. సినిమాలు చూసేవాళ్ళం. పార్టీల వెళ్ళేవాళ్ళం. ఎప్పుడూ గారంగా వెంటబెట్టుకు తిరిగేవాడు. అటువంటి అన్నయ్య మాట్లాడటమే మానేశాడు. చూస్తేనే పాపమన్నట్టు అసహ్యించుకొంటున్నాడు. తనకీ నాకూ సంబంధమే లేనట్టు వదిలేసుకున్నాడు- అన్నయ్య మనసు ఎంతో సున్నితం. అటువంటి అనురాగాన్నే దూరం చేసుకున్నాను. తోడబుట్టిన వాడికి అసహ్యమయ్యాను. నావాళ్ళకే నేను పనికిరాకుండా పోతే ఇంకెవరికి కావాలి? నాకెందుకీ మొండిపట్టుదల? - చాలవరకు బయట తిరగటం తగ్గించుకున్నాను. స్నేహితుల్ని పిలవటం మానుకున్నాను. ఇంట్లోనే కూర్చుని ఎక్కువగా పుస్తకాలు చదువుకొంటూవుండేదాన్ని.
ఒకసారి సిల్కు ఎంపోరియం వారు ఫోన్ చేశారు. కొత్త రకాల చీరలు వొచ్చాయి, చూసి వెళ్ళమని-నాకు ఎప్పటిలా గబగబా వెళ్ళి చీరలు చూడాలనిపించలేదు. బీరువా నిండా ఎన్నో రకాల చీర లున్నాయి. ఎన్ని రకాలు మార్చుకున్నా ఎన్నివిధాల అలంకరించుకున్నా, చూడవలసినవాళ్ళెక్కడ? ఏ సినిమాకో, ఏ షికారుకొ, కట్టాల్సింది తప్ప వేరే అవసరం ఏమిటి? సుజాత ఎన్నిచీరలు కొన్నా అత నొచ్చినప్పుడే మడత విప్పుతుంది. ఛీ! ఏమిటీహీనం? అన్నివిధాలా అనుకూలుడయిన భర్త ఉండి, ఎందుకీ దిగులు? అక్కడికి వెళ్ళిపోతే, అందర్నీ తలదన్నినట్లు వుండవచ్చునే. ఇంకా ఎందుకీ ఆలశ్యం? ఏమొ ఎందుకని ఆలస్యం చేసేదానినో ఒకవైపు బాధపడుతూ కూడా ఎందుకు బయల్దేరలేకపోయేదానినో నాకే తోచేది కాదు.
ఓసారి సరళ పుట్టింటి కొచ్చింది. దానికి మూడోనెలట. కొన్నాళ్ళు వుంచుకుని, వాళ్ళ అమ్మా వాళ్ళు తీసుకొచ్చారు. ఆ వార్త ఫ్రెండ్సందరికీ ఆనందం కలిగించింది. వేళాకోళాలు భరించలేక సరళ సిగ్గుతో చితికిపోయేది. "మిమ్మల్ని వెక్కిరించే ఘడియ రాకపోతుందా? నేనూ చూస్తాను" అనేది, ఆ వేళాకోళా లోపాలు పంచుకోవడానికి నేను మాత్రం తగననిపించేది నామట్టుకు నాకు అవును కొన్ని నెలలు పోతే సరళకు చిన్న పాపాయి వుంటుంది. ఆ పాపాయికి సరళ ఎన్నో చేస్తుంది. నిజంగా ఓ పాపాయి వుంటే బావుండదూ? అన్నీ సిల్కుగౌనులే కుట్టించ వచ్చు. బుల్లిబుల్లి నెక్ లెస్ లు బోలెడు వేయించుకోవచ్చు. ఎప్పుడూ కార్ లో ప్రక్కన కూర్చోబెట్టుకుని తీసుకెల్తూ ఉండొచ్చు. తెల్లగా, బొద్దుగా సిల్కు గౌనులో పాపాయి బొమ్మలా ఎంత ముద్దొస్తుందనీ!
అబ్బ! ఆ వూహలు నన్నెంతో మైమరపించేవి. తీరా వాస్తవం గుర్తు వస్తే, ఏముంది? పాపాయీ లేదు, ఏమీ లేదు, మోడులా నేనూ నా పంతాలూ తప్ప,
ఓసారి ఫ్రెండ్సంతా వూర్లో వున్నందుకు సంతోషంగా సినిమా ప్రోగ్రాం వేసుకున్నాం. అంతా మా యింటికి చేరారు. తీరా బయల్దేర బోయేసరికి అన్నయ్య వచ్చేశాడు. అన్నయ్యని చూస్తూనే సగం చచ్చిపోయాను. కానీ పది మందిలో బయలుదేరిన దాన్నయ్యె, ఎలా ఆగిపోను? అన్నయ్యను చూడనట్లే హాల్లోంచి పోబోయాను. "సుజాతా! యిల్లారా!" అంటూ పిలిచాడు అన్నయ్య సుజాతని. సుజాతతో అన్నయ్య చాలా చనువుగా మాట్లాడుతాడు.
"ఎక్కడికి ప్రయాణం?" అన్నాడు, సుజాతని చూస్తూ.
"ప్రయాణమేమీ లేదే? అంతా కలిశామని ఏదో పిక్చర్ కి బయల్దేరాం. "అంది సుజాత నెమ్మదిగా.
"సుజాతా! మీ ధోరణి నాకేం నచ్చలేదు. మీ స్నేహాలు షికార్లు కొట్టడానికీ, సినిమాలు చూడటానికీ తప్ప ఎందుకూ పనికి రావు. మీలో అరుణ విషయం ఎవరికీ తెలియందీ? మీ రంతా గొప్ప స్నేహితులు కాబోలు ఒకళ్ళయినా దాని. మంచిచెడ్డలు చెప్పి, దాని సంసారం బాగుపరచడానికి ప్రయత్నించారా? మీరంతా సంసారాలు చేసుకోవడం లేదా? దానికిలాగే కట్టుకున్నవాణ్ణి తిరస్కరించి పుట్టినింట్లో వుండిపోరేం? మీరు మాత్రం మీ కన్నవాళ్ళకి గారాం కాదా? మిమ్మల్ని చూసైనా అరుణ తెలుసుకోలేకపోతోందా? ఛీ! స్నేహితులమంటూ చెప్పుకోటానికి సిగ్గు పడాలి సుజాతా! మీరంతా. విచ్చలవిడిగా తిరగటానికేగా మీ స్నేహం? ఒకరి కష్ట సుఖాలలో ఒకరికి జోక్యం లేదు. ఇకఇప్పటికైనా మీ స్నేహాలు చాలు. మీరేమనుకున్నా అనుకోవచ్చుగానీ, ఎప్పుడూ ఈ యింటికి రాకండి. దాన్నే మీ యిళ్ళకు తీసుకెళ్ళి తిప్పండి. అంతే."
వాళ్ళంతా ఏమనుకుంటారోనని నాకు చాలా సిగ్గేసింది. నా యిష్టం అని ఎదిరించే ధైర్యం మాత్రం లేదు. ఎక్కడివాళ్ళక్కడ బొమ్మల్లా నిలబడిపోయారు.
"లేదన్నయ్యా! మధు వుత్తరం వ్రాస్తే వెళ్ళిపోవాలనుకుంటుంది అరుణ" అంది నెమ్మదిగా సుజాత.
"అవును. దానికా గర్వం ఏనాడూ పోదు. ఉత్తరాలు వ్రాసినన్నాళ్ళూ వ్రాశాడు. దేవిరించి నమ్తకాలం దేవిరించాడు. అన్నింటికీ చాలించుకుని వదిలేసి వూరుకున్నాడు. అప్పుడిది లక్ష్య పెట్టిందా? అతను సజ్జనుడు. కాబట్టే ఇంకా ఏ గొడవలూ లేకుండా వుండిపోయాడు. కానీ ఓర్పయినా ఎన్నాళ్ళు? ఎప్పుడో విడాకులిచ్చి పారేసి, తనదారి తాను చూసుకుంటాడు. అతనికేం మగవాడు, తర్వాత తెలిసివస్తుంది. పంతం, పౌరుషం ఇంక బ్రతుకంతా కావలసినన్ని సినిమా లు, షికార్లూనూ సరేకానీ! అనుభవానికి మించిన మందు లేదు. నే నిక అక్కడ నిలువలేక పోయాను. గబగబా పైకివెళ్ళి పక్కమీద పడ్డాను. అందర్నీ సాగనంపి సుజాత ఒక్కతే పైకి వచ్చింది. చాలాసేపు మవునంగా కూర్చుని "వెళ్తావా?" అంది.
"అన్నయ్య అలానే భయపెడతాడు. ఆయనెప్పుడూ అలా చెయ్యరు సుజాతా! మధూకి నేనంటే ప్రాణం."
"ఇంకా ఎందుకు జాప్యం చేస్తావు అరుణా! రెండు మూడు రోజుల్లో వెళ్ళిపోకూడదూ ?" అంది సుజాత. నేనేం జవాబివ్వలేదు. ఆరాత్రి అన్నయ్య మాటలు గుర్తుకు వస్తూంటే ఎంతో భయం వేసింది. అమ్మో! అలా జరిగితే యింకే మైనా వుందా? నిండు బ్రతుకు ఏం కాను? ఇంక ఏముందని గర్వపడను? అలా ఎప్పుడూ జరుగదు. జరుగనివ్వను. కాళ్ళమీద పడి దేవిరించినా చోటు నేను నిలుపుకుంటాను. నా సంసారం నేను చేసుకుంటాను. మర్నాడు అమ్మతో, అన్నాను. "నేను వెళ్ళిపోతానమ్మా!" అని. అమ్మ ఎంతో సేపు మాట్లాడకుండా ఊరుకుంది. చివరికి "సరే నీ యిష్టం" అంది. రెండు రోజులికి లక్ష్మి దగ్గరనుండి ఉత్తరం వచ్చింది. అది చదివి నిర్గాంతపోయాను. గంటల తరబడి రాయిలా కూర్చుండి పోయాను. - "వదినా! నీకు చెప్పేపాటిదాన్ని కాను. కానీ యిక్కడి విషయాలు తెలియ చేయటం చాలా ముఖ్యం. అన్నయ్య పూర్తిగా నీ ప్రశక్తి వదులుకున్నాడు. కృష్ణవేణి అనే అమ్మాయితో స్నేహం చేస్తున్నాడు. ఆ అమ్మాయి పరీక్షాలు కాగానే వచ్చేస్తుందట. పెళ్ళి చేసుకుంటానని అన్నయ్య చెప్తున్నాడు. అమ్మ ఓసారి మందలించబోతే తీవ్రంగా ఎదిరించాడు. ఈ విషయం లో చాలా గాఢంగా నిశ్చయం చేసుకున్నాడు. ఇప్పటికీ నువ్వు నీ పంతాలతో వుంటే, చేజేతులా నీ సంసారం నాశనం చేసుకుంటావు? నువ్వు చదువుకున్న దానివి. మంచి చెడ్డలు తెలుసుకోలేక పోవు, నీ కెంత ఆస్తి పాస్తులున్నా అందచందాలున్నా సంసారం లేకపోయాక వాటి విలువేమీ లేదు. నిండు బ్రతుకు అర్ధంలేని పట్టుదలతో వ్యర్ధం చేసుకోకు. ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే శాశ్వతంగా అంధకారం లోనే వుండిపోతావు. తక్షణం బయలుదేరి నీ యింటికి నువ్వు వస్తే, మించిపోయిందేమీ లేదు. ఇప్పుడైతే పరిస్థితి ఎలా అయినా చక్కబెట్టుకోవచ్చు. అన్నయ్యా, నువ్వు సుఖంగా వుంటే సంతోషిస్తాముగానీ, ఏవో గొడవల్లో చిక్కుకుంటే సహించలేము.
