Next Page 
బొమ్మరిల్లు కధలు -31 పేజి 1


                               వీరబుడతడు           
                                                                            వసుంధర

                           
    పులివాడ గ్రామంలో కనకయ్య అనే భాగ్యవంతుడున్నాడు. ఆయనకు శరభుడు, రమణుడు , మోహనుడు అని ముగ్గురు కొడుకులు. పెద్దవారిద్దరూ స్వార్ధపరులు, సంకుచిత స్వభావులు. ఆఖరివాడైన మోహనుడుది మాత్రం అన్నదమ్ములిద్ద్రికీ విరుద్దమైన స్వభావం . అతడు దయాశీలి.
    శరభుడు, రమణుడు ఎల్లవేళలా తండ్రినే అంటి పెట్టుకుని ఉంటూ వ్యాపారం లోనూ, ఇతర వ్యవహారాల్లోనూ తండ్రికి సాయపడుతూ ఆస్తి రెట్టింపు చేయటానికి సహకరిస్తుండేవారు. మోహనుడు మాత్రం వ్యాపారం పనులు పట్టించుకోక ఊరిలో కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటూ వుండేవాడు. తీరిక సమయాల్లో అతను పదిమందికీ చదువు చెప్పేవాడు.
    తాము కష్టపడి ధన సంపాదన చేస్తుంటే తమ్ముడది తగలబెడుతున్నాడని అన్నలు బాధపడేవారు. కనకయ్య మాత్రం పెద్దకొడుకుల దగ్గర చిన్నవాడినీ, చిన్నవాడి దగ్గర పెద్దవాడిని, వెనకేసుకు వచ్చేవాడు.
    "మనం డబ్బు సంపాదిస్తున్నా మంటే అది పాపపు సంపాదన. ఆ పాపం పోవాలంటే ఇంట్లో ఓ మంచి వాడుండాలి. మంచి పనులు చేయాలి. ,మోహనుడు చేసే మంచి పనుల వల్ల మీ పాపాలు నశించి మీకు మరింత డబ్బు వస్తుంది. మీరు వాడ్నేమీ అనకండి. " అని కనకయ్య శరభుడికీ, రామణుడికి చెప్పాడు.
    "డబ్బు ఖర్చు చేయడం తేలిక. సంపాదించడం కష్టం. లోకంలో డబ్బున్న వాడికున్న గౌరవం మంచి పనులు చేసేవాడి కుండదు. నువ్వేన్నీ దాన ధర్మాలు చేసినా తనకు మాలిన ధర్మం తగదు. పదివేలు సంపాయించి ఐ వెయ్యి దానం చెయ్యి అంతే గాని పై సంపాదన లేకుండా వేలకు వేలు దానాలు చేయకు " అని కనకయ్య మొహనుడి దగ్గిర హెచ్చరించే వాడు.
    కనకయ్య మాటలను ముగ్గురు కొడుకులూ లక్ష్య పెట్టలేదు. అందువలన తరచుగా వాళ్ళలో వాళ్ళు వాదులాడుకుంటూ ఉండేవారు. ఈ కీచులాటల్లో పెద్ద వాళ్లుద్దరూ ఒకటిగా ఉండేవారు. కొడుకుల మధ్య చెలరేగిన ఈ గొడవలు కనకయ్యకు దిగులు కలిగించేవి.
    దిగులు వలనో మరే కారణం వల్లనో గానీ అయన ఒకరోజు ఉన్నట్లుండి హటాత్తుగా గుండె ఆగి చనిపోయాడు.
    తండ్రి పోగానే ఆస్తి పంపకాల విషయం వచ్చినది. అందులో పెద్దవారిద్దరూ ఒక్కటై "ఇందులో నువ్వు సంపాదించిందేమీ లేదు. నాన్న సంపాదించినా దాంట్లో నీ వాటాకు మించి ఎప్పుడో ఖర్చు పెట్టేశావు. ఇంక నీకేమీ రాదు " అంటూ మొహనుడిని ఇంటిలో నుంచి వెళ్ళగొట్టారు.
    మొహనుడందుకు విచారించలేదు. ఉళ్ళో అతడెంతమందికో సహాయపడి ఉన్నాడు. వాళ్ళలో ఒక్కరయినా తనని ఆదరించక పోతారా అని ధైర్యముగా ఇల్లు వదిలిపెట్టాడు. అయితే అతడి అంచనా తప్పయింది. అతడి వల్ల సంతోషంగా సహాయం పొందిన ప్రతి ఒక్కడు కూడా ఆరోజు అతడిని వదిలించుకోవడానికి ఏదో కుంటిసాకు చెప్పారు. ఆఖరి ప్రయత్నంగా మోహనుడు కుమ్మరి గురవయ్య ఇంటికి వెళ్ళాడు.
    ఒకసారి గురవయ్య పాక అంటుకు పొతే మోహనుడు గురవయ్యకు క్రొత్త పాక వేయించి ఇంటిల్లిపాదికీ క్రొత్త బట్టలు కొని వాళ్ళ నష్టం అంతా తను పూడ్చాడు. గురవయ్య తండ్రి ఎనబయ్యేళ్ళు . పున్నయ్య "నీ అంత మంచివాడికి దేవుడు పదింతలు మంచి చేస్తాడు నాయనా !" అని కూడా దీవించాడు.
    గురవయ్య మొహనుడి కధ విని జాలిగా ముఖం పెట్టి , " నేను నీకు తిండి పెట్టి అదుకోగలను. కాని అందువలన నీ అన్నలతో విరోధం వస్తుంది. కుండలమ్ముకుని బ్రతికేవాడిని. డబ్బున్న వాళ్ళతో విరోధం కొని తెచ్చుకుంటే ఎలాగో నువ్వే చెప్పు ?" అన్నాడు.
    అపుడు మొహనుడికి ప్రపంచమంటే అసహ్యం వేసింది. తిన్నగా గురవయ్య తండ్రి పున్నయ్య దగ్గరకు వెళ్ళి తన కధ చెప్పుకుని "తాతా! ప్రపంచంలో మంచికి వున్న ఆదరణ ఇదేనా ? నేను చేసిన దానికి దేవుడు పదింతలు మంచి చేస్తాడని దీవించావు. దేవుడు నాకేమిచ్చాడో చూశావా ?" అన్నాడు.
    అందుకు పున్నయ్య నవ్వాడు.
    "వెర్రి నాయనా? ప్రజల తప్పు లేదు. దేవుడి తప్పూ లేదు. నీ దగ్గర తండ్రి సంపాయించిన ధనముంది. ఈ తండ్రి ఎంత కష్టపడి అది సంపాయించాడో నీకు తెలియదు. పేదవారికి సాయపడితే నీ మనసుకు సంతోషంగా వుంటుంది. నీ సంతోషం కోసమని నువ్వే డబ్బును పేదవారికిచ్చావు. వాళ్ళు తీసుకున్నారు. నువ్వు ఎవరి బాధ్యతా తీసుకోలేదు. అయాచితంగా వచ్చిన డబ్బును తాత్కాలికంగా ఒకరికిచ్చి సాయపద్దావు. మా అబ్బాయి గురవయ్యకు నువ్వు ఇల్లు కట్టించావు. ఆ తరవాత గురవయ్య తన బ్రతుకు తనే బ్రతుకుతున్నాడు కదా కానీ ఇపుడు నీ విషయం అలా కాదు. నిన్నెవరు చేరదీస్తే వారు నిన్ను జీవితాంతం పోషించాలి. నీ బాధ్యత ఒక రోజుతో తీరి పోయేది కాదు. అందులోనూ నీకు దానం చేయటమే తప్ప సంపాదించడం చేత కాదాయె! అదీగాక ప్రతి పెలాక్షతో చేసేదానం దానం అనిపించుకోదు. దేవుడు నీకు డబ్బు , మంచి మనసు ఇచ్చాడు వాటిని సరిగా ఉపయోగించుకోవడం నీ బాధ్యత !"
    పున్నయ్య మాటలు విన్నాక మోహన్ కి ఉక్రోషము వచ్చింది. "మీరంతా మంచి వారే కదా ! నేను విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతూ వుంటే , నా మంచి కోసం మీ రెవ్వరూ అలా చెయ్యొద్దని సలహా ఇవ్వలేదెం?" అని అడిగాడు.
    "వెర్రి నాయనా! డబ్బివ్వడం నీకు సంతోషం,  పుచ్చుకోవడం నాకు సంతోషం. నిన్ను హెచ్చరించే బాధ్యత నీ తండ్రిదే గానీ మాది కాదు" అన్నాడు పున్నయ్య.
    అప్పుడు మోహనుడికి తండ్రి హెచ్చరిక గుర్తు వచ్చింది. అయన ఎంతో అనుభవంతో చెప్పిన మాటలు తను చెవిని పెట్టలేదు. అందువల్లనే ఈనాడు బికారిగా వీధిలో నిలబడ్డాడు. మోహనుడికి జ్ఞానోదయమైంది. ఈ ప్రపంచంలో ఎంత మంచి వాడికయినా, గొప్ప వాడికైనా డబ్బుంటేనే గౌరవం !
    మోహనుడు వెంటనే తన అన్నం దగ్గరకు పరుగెత్తి తన అనుభవాలన్నీ చెప్పి - 'అన్నలారా ! నాన్న మాటలు వినక నేనీరోజు బికారినయ్యాను. మీరు కూడా ఆయన మాటలు దృష్టిలో ఉంచుకుని ధన సంపాదనతో పాటు తగినన్నీ దానధర్మాలు కూడా చేస్తుండండి. లేకపోతె ఏదో ఒక రోజున మీకూ నా గతే పడుతుంది " అన్నాడు.
    అన్నలు అతడి మాటలకు నవ్వి , "మేము నీకులా తెలివితక్కువ వాళ్ళం కాము. మాకు నువ్వేమీ నీతులు చెప్పనక్కర్లేదు. ముందు నువ్వి క్కన్నుంచి వెళ్ళు ?" అన్నారు.

                                 2
    మోహనుడు పులివాడ వదిలిపెట్టి సమీపారణ్యంలోకి ప్రవేశించాడు. కనపడ్డ చెట్టు ఫలాన్ని కోసుకుని కడుపు నింపుకున్నాడు. దొరికిన చోటల్లా మంచినీళ్ళు త్రాగాడు. అరణ్యమద్యం చేరుకునేసరికి అతడికి నిద్ర ముంచుకు వచ్చింది. ఓ చెట్టు క్రింద సొమ్మసిల్లి నిద్రపోయాడు.
    అలా ఎంతసేపు నిద్రపోయాడో అతడికే తెలియదు. ఎవరో తట్టి లేపగా లేచాడు మోహనుడు.
    అతను కళ్ళు నులుముకుని చూసేసరికి ఎదురుగా ఆజానుబాహువు, బుర్ర మీసాల వాడైన ఓ భయానకారుడు కనిపించాడు.
    "మాట్లాడకుండా నీ దగ్గరున్న డబ్బంతా తీసి ఇక్కడ పెట్టు !" అన్నాడా భయంకరాకారుడు.
    "నా దగ్గర డబ్బా?" అంటూ నవ్వాడు మోహనుడు. "నా కధ విన్నావంటే నన్ను డబ్బు అడిగినందుకు నవ్వుతావు ?"
    "కధలు వినే ఓపిక నాకు లేదు ." అన్నాడు భయంకరాకారుడు. "త్వరగా డబ్బు తీసి ఇవ్వు ?"
    "నా దగ్గర ఏమీ లేదు " అన్నాడు మోహనుడు.
    'చూడ్డానికి గొప్పింటి బిడ్డ లాగున్నావు. నీడగ్గరేమీ లేదంటే ఎలా నమ్మేది ?" అన్నాడా భయంకరాకారుడు.
    'అందుకే కధ చెబుతానన్నాను. మాట్లాడకుండా విను " అంటూ మోహనుడు తన కధంతా భయంకరాకారుడికి చెప్పాడు.
    భయంకరాకరుడు ఆశ్చర్యంగా మోహనుడి వంక చూసి- "డబ్బున్న రోజుల్లో అంతా దానం చేసి ఇప్పుడు బికారి వాడిలా అరణ్యాల పాలయ్యావా ? అందుకే మీ మనుషుల్ని నమ్మకూడదు . వాళ్ళతో మంచిగా ఉండకూడదు " అన్నాడు.
    "మీ మనుషులు అంటున్నావు. నువ్వు మనిషిని కావా ?" అన్నాడు మోహనుడు.
    "నేను మనిషిని కాను. ఈ అరణ్యంలోని అన్నిజంతువులతో పాటు నేనూ ఒక జంతువుని పద నిన్ను మా ఇంటికి తీసుకు వెడతాను అన్నాడు భయంకరాకరుడు.


Next Page 

WRITERS
PUBLICATIONS