"కాదు. కారణం తెలుసుకోవాలని".
"ముందు నేనడిగింది చెప్పండి."
"ఏమిటి?'
అరుణ నా కళ్ళలోకి చూస్తూ వుండిపోయింది.
"అడగవేం?"
"కృష్ణవేణిని తీసుకురాలేదేం?"
ఆశ్చర్యపడ్డాను - "నీకెలా తెలుసు?"
"ఎలానో తెలుసు. చెప్పండి."
నేను మాట్లాడలేదు. అరుణ అంది - "లక్ష్మి నాకు వుత్తరాలు రాసింది. మీరు కృష్ణ వేణి అనే అమ్మాయిని రెండోపెళ్ళి చేసుకుంటానంటున్నారనీ-నా సంసారం నన్ను చక్కబరుచుకోమనీ-లక్ష్మి వుత్తరం మాట అలా వుంచండి. రెండోపెళ్ళి చేసుకోవాలని ఎలా అనుకున్నారు?"
"ఏం? బాగానే అనుకున్నాను. ఏంచేసే దానివి?" "ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగంచేదానిని" "సింగినాదం చేసేదానివి. ఎవడు నీకు అండ? మీ అన్నయ్య నా తరువు. కృష్ణవేణి రావటమంటూ జరిగితే ఈ ఇంట్లో నీచోటు రూపుమాసిపోయేది."
అరుణ వుదాసీనంగా మారిపోయింది-"అవును అన్నయ్య మీ తరుపు. కాబట్టే ఈ ఇంట్లో నా చోటు రూపుమాసిపోకముందే కళ్ళు విప్పగలిగాను. "అరుణ కళ్ళలో నీళ్ళు నిండాయి-"ఛ! ఏమిటిది? ఇప్పుడేం జరిగిందని బాధపడతావు? నీచోటు నీకేవుంది అరుణా!"
"మీ మనసు మంచిదికాబట్టే నాచోటు నా కిచ్చారు. ఎంతమూర్కంగా ప్రవర్తించినా క్షమించగలిగారు. పుట్టింట తేలికైనందుకు ఇక్కడకూడా చోటులేకపోతే ఏమయ్యేదాన్ని?"
"అరుణా! చిత్రంగా మాట్లాడుతున్నావు. మీఇంట్లో నిన్నెవరు తేలికచేశారు?"
"తేలికచేసినా నిర్దయగా చూసినా నాకు వుపకారమే జరిగింది-ఎందుకవన్నీ చెప్పటం? మీకూ చులకన గావటం మాత్రం మిగులు."
"ఛ ఏం మాటలు అరుణా? క్షమాపణకోరి వచ్చిన నిన్ను నేను చులకన చేసుకుంటానా? ఇక నిన్ను కాదని ఎవర్ని గౌరవిస్తాను చెప్పు. నన్ను నమ్మితే మీ ఇంట్లో సంగతులు నాకు చెప్పు. మీ అమ్మయ్య ఏమైనా అనేవాడా?"
అరుణ లేచికూర్చుంది-"మిమ్మల్ని నమ్మక పోవటంకాదు. కానీ అన్నయ్య అలా ప్రవర్తించాడనుకొంటే నాకేమిటో లా వుంటుంది. అన్నయ్య ఒక్కడే కాదు. వదినకూడా అదే ధోరణిలోకి దిగి పోయింది. నాకు వూహ తెలిసిన దగ్గర్నుంచీ అన్నయ్య నన్ను ఎన్నడూ పల్లెత్తుమాట అని ఎరగడు. అపురూపంగా చూసేవాడు. నాన్న పోయాక మరీ గారంచేసేవాడు. అమ్మ సరేసరి. నేను ఆడింది ఆటా-పాడింది పాటా నాన్న నాకూ వాటా ఇమ్మనీ పరాయి యింటికి పంపవద్దని ప్రేమగా చూచుకొమ్మనీ చెప్పారుట. పెళ్ళికిముందు ఆ విషయం బాబాయితో చెప్తే ఆయన అంగీకరించారు. మీకు తెలీకుండా జరుగుతూందని మేమనుకోలేదు. అన్నయ్యకు మీరంటే చాలాయిష్టం. నాకూ అయిష్టమేమీలేదు. చాలాయిష్టంకానీ మీ అధికారం నా స్వేచ్చని అరికడుతోందని పించేది. చిన్ననాటినుంచీ నాయిష్టానుసారం ప్రవర్తించటానికి అలవాటుపడ్డ నాకు మీ యిష్టప్రకారం నడవాలంటే కోపం వచ్చేది. వాలు జడవేసుకు పువ్వులు పెట్టుకోమనీ-మీకు నచ్చిన చీరె కట్టుకోమనీ నిర్బంధించటం నాకు చాల మూర్కత్వమనిపించేది. ఏం? నేను సర్దాపడి చేసుకొన్న ముస్తాబు మార్చమని ఎందుకడగాలి? నాయిష్టాన్నేతనూ ఎందుకిష్టం చేసుకోకూడదు? అధికారమా? ఎవరిమీద? అదే పట్టుదల నాకు వుండేది. ఆ మొండితనమే నన్ను ఇన్నిరోజులు దూరంచేసింది మీకు-మీరు పూర్తిగా రావటం మానెయ్యటం ఉత్తరాలైనా రాయకపోవటం నాపంతాన్ని మరీ దృఢంచేశాయిగానీ భయపడనివ్వలేదు. నాకేం? అంతులేని ఆస్థీ-అప్సరసల్ని మించిన అందం-మీతోసాటికి సరైన చదువూ ఏం లోటు? నేనెందుకు లొంగిపోవాలి? వస్తే మీరే రావాలి. లేకపోతే అంతే, అదీ నా ధోరణి. అమ్మకూడా నన్నేవిధంగానూ మందలించలేదు. పైగా సమర్ధించేది కూడా. అన్నయ్య మాత్రం మా ఇద్దరికీ వ్యతిరేకం. మాటకు ముందు నాకేదో నచ్చచెప్పబోయేవాడు. లేక పోతే అమ్మతో అనేవాడు "అరుణ వెళ్ళిపోవటం మంచిదమ్మా! అతను పంతం పట్టాడని ఇదీపడుతుందా? సంసారాలు పాడుచేసుకోవటం మంచి పనా?" అంటే అమ్మ - "అదేం చిన్నపిల్లే మిటి ఒప్పించటానికి? దానికి నచ్చని చోటుకి వెళ్ళి ఎలా వుంటుంది? ఇందులో సంసారాలు పాడుకేముంది? నాలుగు నెలలు పోతేసరి. అతనే వస్తాడు" అనేది. ఇక అన్నయ్య చెయ్యగలిగిందేముంది? కొన్నేసి రోజులు ముభావంగా వూరుకునేవాడు. నేనేం చేసినా పట్టించుకొనేవాడు కాదు. ఆప్యాయంగా పిలిచి మాట్లాడేవాడు కాడు. డబ్బుమాత్రం ఎంతడిగితే అంత పంపించేస్తూ వుండేవాడు ఆఫీసునుంచి. ఫ్రెండ్స్ తో షికార్లు కొడుతూ సినిమాలు చూస్తూ ఆ తర్వాత నిశ్చింతగా రెండు సంవత్సరాలు గడిపే శాను. ఎప్పుడూ ఏవో కొత్త బట్టలు కొనుక్కోవటం-కొత్తకొత్త ఫేషన్లుగా అలంకరించుకోవటం-పిక్నిక్ లు తిరగటం- సినిమాలు చూడటం అదొక దశగా గడిచిపోయింది.
ఫ్రెండ్సందరికీ పెళ్ళిళ్ళయిపోయాయి. నెల లోపులోనే చాలమంది మిష్టర్స్ తో కలిసి వెళ్ళి పోయారు. వాళ్ళు ఎప్పుడో వస్తూండేవాళ్ళు. కానీ వాళ్ళ దోరణంతా భర్త హోదాల గురించీ-కొత్త సంసారాల గురించీ. ఎప్పుడూ అవే కబుర్లు చెప్తూండేవాళ్ళు. వినటం నాకెందుకో ఆసక్తిగా వుండేది. నాకూ భర్తవున్నాడు- సంసారం వుంది. అని అప్పుడప్పుడూ గుర్తువస్తూండేది. అన్నయ్య చాలాసార్లు ఒంటరిగా పిలిచి బోధిస్తూండేవాడు. మౌనంగా విని వచ్చేస్తూండేదాన్ని. నాలో ఏవో ఆలోచనలు రేగబోయినా అర్ధంలేని పౌరుషం అడ్డువచ్చేది. నేను లొంగిపోకూడదు. లొంగిపోవాల్సిన అవసరం నాకులేదు-అనుకొనేదాన్ని.
ఓసారి సంఘటన నన్ను తీవ్రంగా కదిలించింది. సుజాత సినిమాకు రమ్మని అడిగింది. నాకెందుకో ఆపూట తలనొప్పిగా వుందని రాలేనన్నాను. రాకతప్పదనీ-ఆ సినిమా ఆ రోజుతో ఆఖరనీ చూసి తీరాలనీ పట్టుపట్టింది. "సరే! రెడీగా వుండు. వస్తున్నానని చెప్పి రిసీవర్ పెట్టేసి టాయ్ లెట్టయి కారేసుకు బయల్దేరాను. సుజాత కూడా రెడీగానే వుంది. ఇద్దరం కారువరకూ కూడా వచ్చాం. అప్పుడే గేట్లో టాక్సీ ఆగింది. సుజాతా వాళ్ళాయన దిగాడు. కనీసం నెలకి రెండుసార్లయినా వస్తూంటాడు. అతన్ని చూస్తూనే సుజాత చిరునవ్వుతో ఎదురువెళ్ళింది.
"ఎక్కడికో బయల్దేరినట్టున్నారు?" అన్నాడతను నవ్వుతూ. "ఆ ఏదో పిక్చర్ కి బయల్దేరాం. మీరు వస్తారని నాకేం తెలుసు?" అంది సుజాత-"ఇప్పుడేం పోయింది? వెళ్ళిరండి. పది గంటలకి వచ్చేస్తావు కదా?" అన్నాడతను.
"పోనిద్దురూ! ఏం సినిమా! మరొకసారి చూడొచ్చుకదా!" అంది,
"తీరా బయల్దేరి మానటం ఏమిటి సుజా? అతను వెళ్ళి రమ్మంటున్నారుకదా?" అన్నాను నేను. అతను లోపలికెళ్ళిపోయాడు. సుజాత నా దగ్గిరకొచ్చింది-"క్షమించు అరుణా! నేను రాలేను. వెళ్ళి రమ్మంటున్నారనుకో. ఎలా రాను? నువ్వే చూశావు. ఆయన ఇప్పుడే కదా వస్తా. అసలే ట్రైన్ లో ప్రయాణం. న్యూసెన్సూ. స్నానానికి వేన్నీళ్ళవీ చూడాలి. నేనింట్లో లేకపోతే ఈ నౌకరు వెధవలకేం తోచదు. ఇప్పుడే వచ్చిన మనిషిని వదిలేసి ఏం రాను?" అంటూ చెప్పుకొచ్చింది. నేనేం మాట్లాడలేకపోయను. చాల కోపం వచ్చింది. తన కొక్కదానికే మొగుడు వున్నట్టు మహా అపురూపం. తలనొప్పిగావున్నా కాదనలేక వచ్చాను. తీరా రమ్మని మొగుణ్ణి చూడగానే పొమ్మంది. ఇన్సల్టు చేసినట్టు ఫీలయ్యాను. మారు మాట్లాడకుండా ఒక్కదాన్నీ దియేటర్ కెళ్ళి బాక్స్ లో కూర్చున్నాను. కాని నాకు సినిమా చూడాలనిపించలేదు. సుజాత ప్రవర్తనే మాటమాటకూ గుర్తురాసాగింది. అతన్ని చూస్తూనే ఎంత చిత్రంగా మారిపోయిందీ! దగ్గిరే వుండాలని ఎంత తాపత్రయ పడిందీ!- మధూ పట్ల ఆభావాలు నాకెందుకుండవు? రాకరాక మధూవస్తే నేను చేసిందే మిటి? మధూ ఏమైనా అనుకొనివుంటాడా?- ఏమిటో సినిమా చూడాలనిపించక లేచి, వచ్చేశాను. ఆరోజే నా ప్రవర్తన గురించి నేను విమర్శించుకోవటం ప్రారంభించాను. సుజాత అతనికి అన్ని సౌకర్యాలూ స్వయంగా చూసుకొంటుంది కాబోలు. నేనుకూడా అలా ఎందుకు చేసుకోకూడదు?
"నువ్వు చాల అందమైనదానివి కమలం! అందుకే నన్ను నీ చుట్టూ భ్రమరంలా తిప్పుకొంటున్నావు" అంటాడట కమలా వాళ్ళాయన కమల మహాగొప్పగా చెప్పుకొంటుంది. కబుర్లే గాని అదేం అంత అందగత్తె కాదు. ఐనా వాళ్ళాయనదాన్ని ఇరవై నాలుగ్గంటలూ పొగుడుతూనే వుంటాడు-కమల అందం ఏపాటిది? కమలే ఎన్నోసార్లు అంది-"నువ్వు అప్సరసవి అరుణా!" అని. అదే ఇప్పుడు నా ఎదురుగా తనెంతో రంభనని మిడిసిపడుతుంది. దానికా ధైర్యం వాళ్ళాయన కలిగించాడు కాబోలు-కాని నన్నెవరు పొగుడుతారు? నేనెవరి దగ్గిర గర్వపడతాను? ఏం? నేను అందగత్తెనికానా? నన్ను పొగిడేవాళ్ళు లేరా? ఉండీ నేనెందుకు బాధపడాలి? నాకంటే ఏవిధంగా ఈ కమలా వాళ్ళు ఎక్కువ?
