Previous Page Next Page 
కృష్ణవేణి పేజి 38


    "అన్నిటికన్నా గొప్ప విశేషం-బావగారికి ఏడోపడిలో మూడోపెళ్ళి"
    "తారా!" విస్తు బోయాను. "నిజంగానా?" అన్నాను.
    "మీతోనా అన్నయ్యా అబద్ధం చెప్పేది? ఆయన్నీ నేను చూశాను కూడా"
    "నీకేం మతి పోయిందా? ఎలా ఒప్పుకున్నావ్? అన్నాను కోపంగా తార కళ్ళలో నీళ్ళు తిరిగాయి-ఒప్పుకోక ఏం చెయ్యమంటారు? మాకుటుంబ పరిస్థితులు మీకు తెలియక పోతే నాకు తెలీవా అన్నయ్యా?"
    "ఒద్దు తారా! నామాట విను. ఏమైనా ఈ పెళ్ళి నువ్వు ఒప్పుకోవద్దు. నీ బ్రతుకు నాశనం చేసుకోవద్దు".
    తార క్షణం మవునంగా కూర్చుంది-" మిమ్మల్ని ఒక సహాయం అడగాలని వచ్చాను" అంది నా కళ్ళలోకి చూస్తూ.
    వెంటనే సంతోషంగా అన్నాను- "నువ్వే దడిగినా చేస్తాను. నీకేమీ అనుమానం వద్దు తారా! ఏం కావాలో అడుగు. ఈ పెళ్ళి మాత్రం చేసుకోవద్దు".
    "మాట తప్పి పోకూడదన్నయ్యా"!
    "తారా! నామీద నీకు నమ్మకం లేదా? ఎందుకిలా అనుమానిస్తావ్? తార నాకేసి నిర్భయంగా సూటిగా చూసింది. తార ఏదో కోరుతుందనీ, ఎంత కష్టమైనా తప్పక తీర్చాలని ఎదురు చూశాను. కాని తార కోరిక వింటూనే అదిరి పడ్డాను.
    "డాక్టర్స్ దగ్గర ఎన్నో విషాలు వుంటాయట. ఒక్క చిటికెడు".
    "తారా!"
    తార చేతులు కప్పుకొని వెక్కి వెక్కి ఏడుస్తూంటే లేచి దగ్గిరి కెళ్ళాను. జుట్టు నిమిరి ఓదార్చాను-" ఇదేం కోరికతారా? తప్పుకదూ? ఎందుకింత నిరాశ పడిపోతావు? నీకిష్టంలేకుండా. నీపెల్లెలా జరుగుతుంది చెప్పు. ఛ! పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నావా? నీకేం భయం లేదు. నేనున్నాను. నువ్వు  అన్నయ్యా అని పిలుస్తున్నందుకైనా అన్నయ్యగా సహాయం చేస్తాను".
    తార కళ్ళు తుడుచుకుని క్రిందికి చూస్తూ వుండిపోయింది.
    "ఒక్కసారి మీ నాన్నగార్ని కన్పడమని చెప్తావా లేకపోతే సాయంత్రం నేనే మీ ఇంటికొస్తాలే. ఆయనతో మాట్లాడుతాను. నీ పెళ్ళికయ్యే డబ్బు నేనిస్తాను. నీ అందానికి తగిన చందమామ లాంటి అబ్బాయిని చేసుకొందువు గాని సరేనా?' అన్నాను నవ్వి, తార నవ్వింది పేలవంగా-""ఇంటింటా వున్న సమస్యే ఇది. ఎంతమందికి మీరు సహాయం చేస్తారన్నయ్యా?" అంది.
    "అందరి గొడవా నీకెందుకు? నీ విషయం నేను చూస్తాను. నువ్వుమాత్రం పిచ్చి పిచ్చి పనులేమీ చెయ్యకు. ఇంటికెళ్ళు" అన్నాను. తార వెళ్ళిపోయింది-నిన్నసాయంత్రం అర్జంటుగా కేసు వస్తే వెళ్ళిపోయాను. చావు బ్రతుకుల మధ్య చిక్కుకున్న ఒక గర్భవతిని దేవుడి దయవల్ల బ్రతికించ గలిగాను. సుఖంగా ప్రసవించింది. చాల రాత్రివరకూ అక్కడే వుండి పోవాల్సి వచ్చింది. తార విషయం తాత్కాలికంగా మర్చి పోయాను. ఇవాళ సాయంత్రం వెళ్దామనే అనుకొంటున్నాను. ఇంతలో పిడుగులాంటి వార్త! భరించరాని బాధతో కొట్టుకొంటూన్న తారని చూసి బావురుమనటం తప్ప ఏమీ చెయ్యలేక పోయాను. కాళ్ళూ చేతులూ ఆడలేదు. తార స్పృహలో లేదు. కిరసనాయిల్ పోసి అంటించుకుందట. ఎక్కడని మందులుపోసి కట్లు కట్టను? ఒళ్ళంతా కాలి పోయింది. నేనే చూడలేక కళ్ళు మూసుకున్నాను. పది నిముషాల్లో నాకళ్ళముందే కళ్ళు మూసింది-తార చావుకి నేనూ కారణమే రోజా"! అన్నయ్య ఎంతో బాధ పడుతున్నాడు.
    "తొందరపడింది. ఇష్టంలేని పెళ్ళికంటే చావే సుఖం అనుకొంది" అంది వదిన. నా మనస్సులో ఏదో మెరిసినట్టయింది.
    "కంగారు పడొద్దని ఎన్నో విధాల చెప్పి పంపాను. ఇంత మూర్కంగా ప్రవర్తిస్తుందను కోలేదు. బ్రతికి వుంటే సుఖపడేదే....ఆ అందమంతా ఏమై పోయిందో చూడలేని విధంగా తయారైంది. తార చచ్చిపోయినందుకు కాదు రోజా! అంత బాధపడుతూ బలవంతంగా పోయి నందుకే ఎక్కువ బాధగా వుంది నాకు. తార కోరి నప్పుడు చిటికెడు విషం ఇచ్చినా అంత బాధకి గురి అయ్యేది కాదనిపించింది".
    "మీరు సహాయం చేస్తానని చెప్పారు కదా? తార నమ్మలేదా?"
    "నమ్మకపోవటం కాదు. నేను సహాయం చెయ్యటం ఇష్టంలేదు తనుపోతే ఎవరికీ ఏ సమస్యా వుండదనుకొందేమో!"
    తార విషయమే మాట్లాడు కొంటూంటే పది దాటింది.
    సరే చెప్పుకు బాధపడటమే గాని ఎవరిఖర్మకు ఎవరు కర్తలు? భోజనాలకి లేవండి" అంది అమ్మ. ఒకళ్ళకీ అన్నం తినాలనిపించ లేదు. అన్నయ్యతినలేనన్నాడు. అమ్మ పిలుస్తున్నా విన్పించుకోకుండా నాగదిలోకి వెళ్ళిపోయాను.
    మాధవ్ వచ్చి వెళ్ళటం-తార చచ్చిపోవటం రెండు విషయాలకీ ఏదో అన్వయం కుదర్చాలని ప్రయత్నిస్తోంది మనసు. తార బ్రతికి వుంటే సుఖపడేదే. అవును అన్నయ్య సహాయం చేసేవాడు. కానీ నాకు సహాయం చేయాలంటే ఎవరూ చెయ్యగలిగేపని గాదు. నాదొక అర్ధంలేని సమస్య.
    "ఇష్టంలేని పెళ్ళికంటే చావే సుఖం అనుకొంది" అంది వదిన. తార అనుకున్నట్టు నేనూ అనుకుంటాను. కాని తార చేసిన తెంపూ, సాహసం నేను చెయ్యగలనా? తారలా నేను ఎవర్నీ మందుకోసం మాకుల కోసం దేవిరించుకోనవసరం లేదు. అన్నయ్య ప్రైవేటు గది అలమారులో వున్న విషాలు ఏక్షణాన్నయినా నా చేతిలోకి వస్తాయి. నాకు చావటం అనేది సమస్యే కాదు. నాకు మార్గదర్శకురాలిగా తోచింది తార. మరో లోకంలో నైనా తారతో స్నేహం కట్టాలనిపించింది. ఇష్టంలేని పెళ్ళిచేసుకుని బ్రతుకంతా జీవచ్చవంలా కుమిలి కృశించిపోయేకంటే తార చేసినపని ఎంత వుత్తమం!-ఆలోచిస్తూ పడుకొన్నాను.
    మాధవ్ చేతులు పట్టుకొని ప్రాధేయపడ్డాడు. పసిపాపలా ఏడిచాడు. కళ్ళనీళ్ళు తుడుచుకొని గుండెరాయి చేసుకుని వెళ్ళి పోయాడు. ఇన్నాళ్ళూ ఇష్టమైనట్టు ఆడించి ఆఖరుకు ఏడిపించాను. అంతా సహించాడు. నిండు మనసుతో సౌభాగ్యవతిగా ఆశీర్వదించి వెళ్ళిపోయాడు.
    "నేను కావాలని నీమనసు ఆరాట పడటం లేదా వేణూ!
    "నా స్నేహం క్షణికమని భావించకు వేణూ!"
    "నువ్వు నాకు కావాలి. నిన్ను ఒదులుకో లేను".
    మాధవ్ కళ్ళెదుట ప్రత్యక్షమై ప్రాధేయపడుతున్నాడు.
    "నువ్వూ నాకు కావాలి మాధవ్!" అనుకున్నాను. "నీకోసం మరోలోకంలో ఎదురుచూస్తాను. తప్పక రావాలి" అని చెప్పుకున్నాను.
    నా సమస్యని తార సున్నితంగా పరిష్కరించి పెట్టింది. నామనసు చాల తేలికపడింది. అదేధ్యాస పడింది. అదె ధ్యానంతో పడుకున్న నాకు తెల్ల బట్టలతో గాలిలో ఎగురుతున్నట్టూ-తారతో కబుర్లు చెప్పుకుంటున్నట్టూ కలవచ్చింది.
    ఆ రోజు రేణు వచ్చింది.
    "నిన్న సాయంత్రం మాధవ్ వచ్చి వెళ్ళాడు." అన్నాను క్లుప్తంగా.
    "మాధవ్ వచ్చాడా? వెళ్ళిపోయాడా? ఏమన్నాడు కృష్ణవేణీ? ఏం చెప్పావ్? అంటూ ఆశ్చర్యంతో అడిగింది. జరిగిందే చెప్పాను-" చివరికి ఏడిపించాను కూడా మాధవ్ వంటి వ్యక్తిని బాధ పెట్టిన పాపం నన్ను విడిచి పెట్టదు రేణూ!"
    "మాధవ్ చాలామంచివాడు కృష్ణవేణీ! ఇక్కడికి రావటమంటూ జరిగితే నయాన్నో భయాన్నో నిన్ను తీసుకెళ్ళి పోతాడని అనుకొనేదాన్ని".
    మాధవ్ అభిమానపరుడు రేణూ! నా మనసు మార్చాలనే ప్రయత్నించాడు గానీ - నాకిష్టం లేకుండా బెదిరించి లొంగదీసుకోవాలని అనుకో లేదు. తనని తిరస్కరించే వ్యక్తినికాదు మాధవ్ కోరేది".
    రేణు కొంతసేపు వూరుకుని అంది-"నువ్వు వెళ్ళిపోతేనే మంచిదని పిస్తూంది కృష్ణవేణి నాకు ముఖ్యంగా మాధవ్ కోసమైనా..." "అన్నిటికీ పరిష్కారం నా చావు ఒక్కటే రేణూ! నాకు బ్రతకాలనే అనిపించటంలేదు. బ్రతికివుండి నేనేం అనుభవించాలి చెప్పు" నాకళ్ళు చెమర్చాయి. రేణు అర్ధంగానట్టు చూస్తూ వూరుకొంది. తర్వాత నాకేమీ మాట్లాడాలనిపించలేదు. రేణు కొంతసేపు కూర్చుని వెళ్ళిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS